తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు... | Bengaluru Enters Into IPL Final For The Fourth Time, Check Out Full Score Details And Match Highlights | Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల తర్వాత తుది పోరుకు...

May 30 2025 2:07 AM | Updated on May 30 2025 1:10 PM

Bengaluru in the IPL final for the fourth time

నాలుగోసారి ఐపీఎల్‌ ఫైనల్లో బెంగళూరు

క్వాలిఫయర్‌–1లో 8 వికెట్లతో పంజాబ్‌ చిత్తు 

రాణించిన సుయాశ్, హాజల్‌వుడ్, సాల్ట్‌ 

ఐపీఎల్‌ ప్రారంభమైన నాటినుంచి తొలి టైటిల్‌ కోసం పోరాడుతూనే ఉన్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు... ఈ సీజన్‌లో ట్రోఫీ దిశగా మరో ముందడుగు వేసింది. బౌలర్లు విజృంభించడంతో క్వాలిఫయర్‌–1లో పంజాబ్‌పై ఏకపక్ష విజయం సాధించిన బెంగళూరు... తొమ్మిదేళ్ల తర్వాత నాలుగోసారి ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరింది. హాజల్‌వుడ్‌ పేస్‌తో బెంబేలెత్తిస్తే... సుయాశ్‌ శర్మ గూగ్లీలతో పంజాబ్‌ పనిపట్టాడు. ఈ సీజన్‌లో ప్రధానంగా టాప్‌–3 ఆటగాళ్లపైనే ఎక్కువ ఆధారపడ్డ పంజాబ్‌.. ఆ ముగ్గురు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో ఓటమి పాలైంది. 

ముల్లాన్‌పూర్‌: సీజన్‌ ఆసాంతం నిలకడగా రాణించిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) క్వాలిఫయర్‌–1లోనూ సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ఐపీఎల్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన పోరులో బెంగళూరు 8 వికెట్ల తేడాతో  పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసి తుదిపోరుకు చేరింది. బౌలర్లు సమష్టిగా సత్తా చాటడంతో ఆర్‌సీబీ ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టగా... 11 ఏళ్ల తర్వాత ‘ప్లే ఆఫ్స్‌’కు చేరిన పంజాబ్‌ బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం వైపు నిలిచింది. 

మొదట పంజాబ్‌ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. మార్కస్‌ స్టొయినిస్‌ (17 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌ కాగా... ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (18), అజ్మతుల్లా ఓమర్‌జాయ్‌ (18) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ (2)తో పాటు ప్రియాన్ష్ ఆర్య (7), జోష్‌ ఇన్‌గ్లిస్‌ (4), నేహల్‌ వధేరా (8), శశాంక్‌ సింగ్‌ (3), ముషీర్‌ ఖాన్‌ (0) విఫలమయ్యారు. 

బెంగళూరు బౌలర్లలో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సుయాశ్‌ శర్మ, హాజల్‌వుడ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా... యశ్‌ దయాళ్‌ రెండు వికెట్లు తీశాడు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో బెంగళూరు 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి (12; 2 ఫోర్లు) త్వరగానే అవుట్‌ అయినా... ఫిల్‌ సాల్ట్‌ (27 బంతుల్లో 56 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. మంగళవారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న తుదిపోరులో క్వాలిఫయర్‌–2 విజేతతో బెంగళూరు ట్రోఫీ కోసం తలపడనుంది. 

ఒకరి వెంట ఒకరు... 
టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఈ సీజన్‌లో మెరుగైన ఆరంభాలతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ప్రియాన్ష్ ప్రభ్‌సిమ్రన్‌ కీలక పోరులో ఆకట్టుకోలేకపోయారు. యశ్‌ దయాళ్‌ వేసిన రెండో ఓవర్‌ రెండో బంతికి ప్రియాన్ష్ సులువైన క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగగా... భువనేశ్వర్‌ వేసిన మరుసటి ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చిన ప్రభ్‌సిమ్రన్‌ అదే జోరులో మరో షాటే ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్‌ బాట పట్టాడు. 

కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌ 3 బంతులే ఆడి అవుట్‌ అయ్యాడు. హాజల్‌వుడ్‌ బంతిని కట్‌ చేసే ప్రయత్నంలో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. హాజల్‌వుడ్‌ తన మరుసటి ఓవర్‌లో ఇన్‌గ్లిస్‌ను కూడా బుట్టలో వేసుకోగా... నేహల్‌ వధేరా ఇలా వచ్చి అలా వెళ్లాడు. స్టొయినిస్‌ కొన్ని షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించే ప్రయత్నం చేసినా అతడికి సహాకారం అందించేవాళ్లే కరువయ్యారు. సుయాశ్‌ గూగ్లీని అర్థం చేసుకోలేక శశాంక్‌ క్లీన్‌ బౌల్డ్‌ కాగా... ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా అనూహ్య అవకాశం దక్కించుకున్న ముషీర్‌ ఖాన్‌ ఐపీఎల్‌ అరంగేట్రంలో డకౌట్‌గా వెనుదిరిగాడు. 

బ్యాటర్లు వరసగా విఫలమవుతుండటంతో... ముషీర్‌కు తుది జట్టులో చోటు దక్కగా... ఆడిన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండానే అతడు అవుట్‌అయ్యాడు. తన తదుపరి ఓవర్‌లో స్టొయినిస్‌ను కూడా సుయాశ్‌ పెవిలియన్‌కు పంపడంతో పంజాబ్‌ పనైపోయింది. ఆఖర్లో అజ్మతుల్లా విలువైన పరుగులు చేసి జట్టు స్కోరును వంద పరుగుల మార్క్‌ దాటించాడు. 

ఆడుతూ పాడుతూ.. 
బెంగళూరు బ్యాటింగ్‌ ప్రారంభానికి ముందే పంజాబ్‌ పరాజయం ఖాయమైపోగా... నాలుగో ఓవర్‌లో కోహ్లిని ఔట్‌ చేసి జెమీసన్‌ కాస్త ఆసక్తి రేపినా... సాల్ట్‌ విజృంభణతో ఎలాంటి సంచలనానికి అవకాశం లేకుండా పోయింది. మూడో ఓవర్‌లో 4, 6 కొట్టిన సాల్ట్‌... ఐదో ఓవర్‌లో రెండు ఫోర్లు బాదాడు. 

జెమీసన్‌ ఓవర్‌లో వరసగా 4, 4, 6 కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ 61/1తో నిలిచింది. మయాంక్‌ అగర్వాల్‌ (19; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ రజత్‌ పాటీదార్‌ (15 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) రాణించారు. 23 బంతుల్లో సాల్ట్‌ హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్‌తో పాటీదార్‌ మ్యాచ్‌ను ముగించాడు.   

స్కోరు వివరాలు  
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: ప్రియాన్ష్ (సి) కృనాల్‌ (బి) దయాళ్‌ 7; ప్రభ్‌సిమ్రన్‌ (సి) జితేశ్‌ (బి) భువనేశ్వర్‌ 18; ఇన్‌గ్లిస్‌ (సి) భువనేశ్వర్‌ (బి) హాజల్‌వుడ్‌ 4; శ్రేయస్‌ (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 2; నేహల్‌ (బి) దయాళ్‌ 8; స్టొయినిస్‌ (బి) సుయాశ్‌ 26; శశాంక్‌ (బి) సుయాశ్‌ 3; ముషీర్‌ (ఎల్బీ) (బి) సుయాశ్‌ 0; అజ్మతుల్లా (సి) జితేశ్‌ (బి) హాజల్‌వుడ్‌ 18; హర్‌ప్రీత్‌ (బి) షెఫర్డ్‌ 4; జెమీసన్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (14.1 ఓవర్లలో ఆలౌట్‌) 101. వికెట్ల పతనం: 1–9, 2–27, 3–30, 4–38, 5–50, 6–60, 7–60, 8–78, 9–97, 10–101. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2–0–17–1; యశ్‌ దయాళ్‌ 4–0–26–2; హాజల్‌వుడ్‌ 3.1–0–21–3; సుయాశ్‌ శర్మ 3–0–17–3; కృనాల్‌ పాండ్యా 1–0–10–0, రొమారియో షెఫర్డ్‌ 1–0–5–1. 

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (నాటౌట్‌) 56; కోహ్లి (సి) ఇన్‌గ్లిస్‌ (బి) జెమీసన్‌ 12; మయాంక్‌ (సి) శ్రేయస్‌ (బి) ముషీర్‌ 19; రజత్‌ పాటీదార్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం (10 ఓవర్లలో 2 వికెట్లకు) 106. వికెట్ల పతనం: 1–30, 2–84. బౌలింగ్‌: అర్ష్ దీప్‌ సింగ్‌ 2–0–20–0; జెమీసన్‌ 3–1–27–1; అజ్మతుల్లా 1–0–10–0; హర్‌ప్రీత్‌ బ్రార్‌ 2–0–18–0; ముషీర్‌ ఖాన్‌ 2–0–27–1. 

Advertisement
 
Advertisement
Advertisement