బెంగాల్‌ బోణీ | Bengal defeated Delhi by 9 wickets in the Ranji Trophy | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ బోణీ

Oct 15 2026 12:57 AM | Updated on Oct 15 2026 12:57 AM

Bengal defeated Delhi by 9 wickets in the Ranji Trophy

ఢిల్లీపై 9 వికెట్ల తేడాతో గెలుపు

బోనస్‌ పాయింట్‌లతో నెగ్గిన బరోడా, గుజరాత్‌

రంజీ ట్రోఫీ

కోల్‌కతా: దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీ 2026–27 సీజన్‌ తొలి మ్యాచ్‌లో బెంగాల్‌ ఘనవిజయం సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా బుధవారం ముగిసిన పోరులో బెంగాల్‌ 9 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలిచింది. దీంతో బెంగాల్‌ జట్టు ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. ఓవర్‌నైట్‌ స్కోరు 101/3తో బుధవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఢిల్లీ జట్టు 106.2 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. ఆయుశ్‌ బదోనీ (85; 10 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి అనూజ్‌ రావత్‌ (39; 7 ఫోర్లు) కాస్త సహకరించాడు.బెంగాల్‌ బౌలర్లలో ప్రదీప్త ప్రమాణిక్‌ 3 వికెట్లు పడగొట్టగా... సుమంత గుప్తా, అమీర్‌ గనీ 2 వికెట్ల చొప్పున తీశారు. సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ 18 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. 

అనంతరం 89 పరుగుల లక్ష్యఛేదనకు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బెంగాల్‌... 15.3 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 89 పరుగులు చేసింది. కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ (34 నాటౌట్‌; 3 ఫోర్లు), అంకుర్‌ పాల్‌ (38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. అంతకుముందు ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 240 పరుగులు చేయగా... బెంగాల్‌ 429 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన బెంగాల్‌ బ్యాటర్‌ అభిషేక్‌ పొరెల్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో భాగంగా ఆదివారం నుంచి ప్రారంభం కానున్న తదుపరి మ్యాచ్‌లో సర్వీసెస్‌తో బెంగాల్‌ తలపడనుంది.  

గోవాపై బరోడా ‘బోనస్‌’ గెలుపు 
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా పనాజీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో గోవాపై బరోడా జట్టు ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో గోవాను చిత్తుచేసిన బరోడా ‘బోనస్‌’ పాయింట్‌తో కలిపి 7 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. బరోడా 472/8 వద్ద తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయగా... గోవా తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన గోవా... చివరకు 68 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. శివేంద్ర భుజ్‌బల్‌ (154 బంతుల్లో 46; 4 ఫోర్లు), కెప్టెన్‌ అభినవ్‌ తేజ్‌రాణా (100 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా ఫలితం లేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మహేశ్‌ పీతియా... రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. భార్గవ్‌ భట్‌కు 5 వికెట్లు దక్కాయి.  

విదర్భ 160 పరుగులతో విజయం 
ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో పుదుచ్చేరిపై విదర్భ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 22/1తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన విదర్భ... 36 ఓవర్లలో 175/3 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అమన్‌ మోఖడే (65; 4 ఫోర్లు), ధ్రువ్‌ షోరే (69 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో 291 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పుదుచ్చేరి జట్టు 41.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌటైంది. 

ప్రసాద్‌ పవార్‌ (48; 6 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌ కాగా... మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. హర్ష్ దూబే 4, పార్థ్‌ రేఖడే మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగులు చేయగా... పుదుచ్చేరి 313 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులు చేసిన విదర్భ సారథి అక్షయ్‌ వాడ్కర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. గ్రూప్‌లో భాగంగా ఆదివారం నుంచి జరగనున్న తదుపరి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జమ్మూకశ్మీర్‌తో విదర్భ ఆడుతుంది.  

సిద్ధార్థ్‌ ‘పాంచ్‌’ పటాకా... 
అహ్మదాబాద్‌ వేదికగా ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 10 వికెట్ల తేడాతో గెలిచి బోనస్‌ పాయింట్‌తో కలిపి 7 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఒడిశా చివరకు 46.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. సందీప్‌ పట్నాయక్‌ (65; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), నినాద్‌ రాథ్వా (53; 10 ఫోర్లు) అర్ధశతకాలు సాధించారు. 

గుజరాత్‌ బౌలర్లలో సిద్ధార్థ్‌ దేశాయ్‌ 5 వికెట్లు పడగొట్టగా... అర్జాన్‌ నాగ్‌వస్వల్లా 3 వికెట్లు తీశాడు. అనంతరం 47 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన గుజరాత్‌ జట్టు 9.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఆర్య దేశాయ్‌ (37 నాటౌట్‌; 7 ఫోర్లు) వేగంగా ఆడాడు. అంతకుముందు ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు చేయగా... గుజరాత్‌ 439 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన గుజరాత్‌ ప్లేయర్‌ వేదాంత్‌ త్రివేదికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

విక్కీ మాయాజాలం... 
ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా ఢిల్లీ వేదికగా సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లోమహారాష్ట్ర జట్టు 127 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్‌ స్కోరు 66/5తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మహారాష్ట్ర చివరకు 56 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. అంకిత్‌ బావ్నే (48; 3 ఫోర్లు), రాజ్‌వర్ధన్‌ హంగార్గేకర్‌ (43; 5 సిక్స్‌లు)రాణించారు. సర్వీసెస్‌ బౌలర్లలో అర్జున్‌ శర్మ 5 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం 248 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన సర్వీసెస్‌ 63.3 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. నకుల్‌ శర్మ (36) టాప్‌ స్కోరర్‌. మహారాష్ట్ర స్పిన్నర్‌ విక్కీ ఓస్త్‌వాల్‌ 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేయగా... సర్వీసెస్‌ 227 పరుగులు చేసింది. మహారాష్ట్ర ప్లేయర్‌ అంకిత్‌ బావ్నేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

లాంఛనం ముగిసింది! 
మూడో రోజే విజయానికి చేరువైనప్పటికీ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కాస్త ఇబ్బందిపడ్డ హరియాణా జట్టు... చివరి రోజు తొలి గంటలోపే పనిపూర్తి చేసింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా రోహ్‌తక్‌లో హిమాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో హరియాణా 7 వికెట్ల తేడాతో గెలిచింది.71 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 26/3తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన హరియాణా 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.

హిమాన్షు రాణా (37; 5 ఫోర్లు) వేగంగా ఆడాడు. అంతకుముందు హిమాచల్‌ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులు చేయగా... హరియాణా 296 పరుగులు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే పరిమితమైన హిమాచల్‌ ప్రదేశ్‌... ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. హరియాణా ఆల్‌రౌండర్‌ కనిష్క్‌ చౌహాన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.  

ప్లేట్‌ గ్రూప్‌లో మణిపూర్‌ శుభారంభం 
ప్లేట్‌ గ్రూప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో మిజోరంపై మణిపూర్‌ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేయగా... మణిపూర్‌ 251 రన్స్‌ కొట్టింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మిజోరం 295 పరుగులు చేయగా... 228 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్‌ స్కోరు 8/0తో బుధవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన మణిపూర్‌ 71.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి గెలిచింది. జతిన్‌ (105 నాటౌట్‌; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా సిక్కిం, మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది.  

ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా జంషడ్‌పూర్‌ వేదికగా జార్ఖండ్, కేరళ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన జార్ఖండ్‌కు మూడు పాయింట్లు, కేరళకు ఒక పాయింట్‌ దక్కాయి.   ళీ  ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ను డిఫెండింగ్‌ చాంపియన్‌ జమ్మూకశ్మీర్‌ జట్టు ‘డ్రా’ చేసుకుంది. 326 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన జమ్మూకశ్మీర్‌... ఆట ముగిసే సమయానికి 88/7తో నిలిచింది.  ళీ  చండీగఢ్‌ వేదికగా ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా అస్సాం, పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ ‘డ్రా’ అయింది. ఇదే గ్రూప్‌లో సౌరాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ మధ్య పోరు కూడా సమంగా ముగిసింది. సౌరాష్ట్ర బ్యాటర్‌ చిరాగ్‌ జానీ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ చెశాడు. ళీ  ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో రైల్వేస్, ఉత్తరాఖండ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌తో పాటు రాజస్తాన్, తమిళనాడు పోరు ‘డ్రా’గా ముగిశాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement