ప్రజల మేలు కోరేవాడే నిజమైన నాయకుడు | Sakshi
Sakshi News home page

ప్రజల మేలు కోరేవాడే నిజమైన నాయకుడు

Published Thu, May 9 2024 8:05 AM

ప్రజల మేలు కోరేవాడే నిజమైన నాయకుడు

సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున

మద్దిపాడు: ప్రజల మేలు కోరుతూ ప్రభుత్వాన్ని నడిపే వాడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాడని సంతనూతలపాడు నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. బుధవారం ఆయన మండలంలోని దొడ్డవరప్పాడు, వెంకట్రాజుపాలెం పల్లె, కొలచనకోట గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మేరుగు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, కుల మత వర్గ విభేదాలు లేకుండా ప్రజలందరికీ ఆమోద యోగ్యంగా పథకాలు అమలు చేస్తూ అందరికీ మేలు చేస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ను మళ్లీ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా విజ్ఞతతో ఆలోచించాలని, ఎవరు మేలు చేశారో గుర్తు చేసుకోవాలని కోరారు. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీలకు తప్ప ప్రజలకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా అంటూ ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన బాబు ఫలానా మంచి పథకం తాను తీసుకొచ్చానని చెప్పగలడా అంటూ ప్రశ్నించారు. ఏమీ చేయకపోయినా హైదరాబాద్‌ను కట్టించింది నేనే, కంప్యూటర్లు తయారు చేయించింది నేనే అంటూ ఆయన చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాలు వింటూ ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ముసుగులు వేసుకుని పక్క రాష్ట్రాల్లో దాక్కున్న చంబా, ఆయన ఉత్త పుత్రుడు, దత్త పుత్రుడు ఈరోజు జగన్‌ను మట్టి కరిపిస్తామంటూ ప్రగల్భాలు పలకడం చూస్తే ఆకాశం పై ఉమ్మివేసినట్లు ఉందని అన్నారు. ప్రజలు గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే టీడీపీని పరిమితం చేశారని, ఇటువంటి మాటలు మాట్లాడితే రాబోయే ఎన్నికల్లో పూర్తిగా చాప చుట్టి బంగాళాఖాతంలో వేయడం ఖాయమని అన్నారు. సంతనూతలపాడు అభ్యర్థిగా తనను, బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా నందిగం సురేష్‌ను మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. ముందుగా ఆయన వెంకట్రాజుపాలెంలో అంబేడ్కర్‌ విగ్రహానికి, కొలచనకోటలో బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం ఆయన వెంట రాష్ట్ర పార్టీ కార్యదర్శి చుండూరి రవిబాబు, పార్టీ మండల అధ్యక్షుడు మండవ అప్పారావు, ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ వాకా కోటిరెడ్డి, వైస్‌ ఎంపీపీ పైడిపాటి వెంకట్రావు, అనపర్తి చిరంజీవి, సీనియర్‌ నాయకులు, మాజీ ఎంపీపీ నారా విజయలక్ష్మి గుడ్డపాతల రవి, తేళ్ల పుల్లారావు, పిట్టల ఆంజనేయులు విల్సన్‌, సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు బెజవాడ రాము బొమ్మల రామాంజనేయులు, పైనం శ్రీనివాసరావు, శ్రీకాంత్‌, కొలచనకోట సర్పంచ్‌ డొక్కా మరియమ్మ, ఎంపీటీసీ బొమ్మల దేవదాసు పైనం ప్రభాకర్‌, సిద్ధయ్య, హరిబాబు, సింగయ్య, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement