
‘వెన్నుపోటు దినం’ విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
మోసపూరిత ప్రభుత్వంపై కదం తొక్కిన జనం
రాష్ట్ర వ్యాప్తంగా అద్దం పట్టిన నిరసన ర్యాలీలు
అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చారు
ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం ప్రతిబింబించింది
ప్రజల తరఫున వైఎస్సార్‌సీపీ నిరంతర పోరాటం
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలకు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఏడాదిగా టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలను నిలదీస్తూ బుధవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో నిర్వహించిన నిరసన ర్యాలీలకు ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి, కదంతొక్కి విజయవంతం చేయడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను అభినందిస్తూ.. కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘సరిగ్గా ఏడాది క్రితం, జూన్ 4న చంద్రబాబు నాయుడు గొప్ప వాగ్దానాలతో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా తనను నమ్మిన ప్రజలకే ద్రోహం చేశారు.
మోసపు హామీలు, ఆయన తప్పుడు ప్రకటనలతో ప్రజలకు వెన్నుపోటు పొడవడం ద్వారా రాష్ట్రాన్ని నిరాశ, నిస్పృహల్లోకి నెట్టారు. అందుకే జూన్ 4ను మనం వెన్నుపోటు దినంగా పాటించాలని పిలుపునిచ్చాం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో అన్ని వర్గాల ప్రజలు ఉప్పెనలా కదలివచ్చి.. తమ వేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన కాదు.
అబద్ధాలు చెప్పి మోసం చేస్తే మౌనంగా ఉండబోమంటూ శక్తివంతమైన సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నిరసన ద్వారా చాటిచెప్పారు. మోసపోయిన ప్రజల బాధ, నిరాశ, ఆగ్రహం, పెల్లుబుకుతున్న వ్యతిరేకతను ఈ ర్యాలీలు ప్రతిబింబించాయి.

ప్రజల హక్కులు, న్యాయం, గౌరవం కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనంతో కలిసి పోరాడుతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజల తరఫున నిలదీస్తూ నిరసన ర్యాలీలను విజయవంతం చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు నేను హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.