
జీవనోపాధి అవకాశాల మెరుగునకు కృషి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధి అవకాశాల మెరుగుదలకు కృషి చేయాలని అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశపు మందిరంలో స్వయం సహాయక సంఘాల జీవనోపాధి కార్యాచరణ ప్రణాళికపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) అధికారులతో కలెక్టర్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల ఆర్థికాభివృద్ధికి సీ్త్ర శక్తి, సీఐఎఫ్, ముద్ర, పీఎంఈజీపీ, ఎంఎస్‌ఎంఈ వంటి ఎన్నో మంచి పథకాలను అమలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులు వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామానికీ వెళ్లి అర్హులు తగిన వ్యాపారాలు చేసుకునేందుకు బ్యాంక్ లింక్డ్ పథకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే ఆయా పథకాలకు గుర్తించిన లబ్ధిదారులకు చెందిన యూనిట్లు గ్రౌండింగ్ అయ్యేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే వ్యాపారాలు చేసుకుంటున్న వారికి మరింత రుణ సదుపాయం కల్పించేలా కృషి చేయాలన్నారు.
మహిళలకు వ్యాపార మెలకువలు..
కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు వ్యాపార మెలకువలపై శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకాల మార్గాలను చూపాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ విధానంలో తమ ఉత్పత్తులను ఎలా అమ్ముకోవాలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో మహిళ తరఫున ఆమె భర్త లేదా కొడుకు వ్యాపారం చేసుకునేందుకు ముందు కొచ్చినా పరిగణనలోకి తీసుకొని సహకారం అందించాలన్నారు. చిన్న చిన్న వ్యాపారాలే కాకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) ద్వారా పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలనుకునే మహిళలకు అవగాహన కల్పించాలని, వారి ఎదుగుదలతో ఇతరులకు ఉపాధి కల్పించిన వారవుతారని వివరించారు. డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ ఆర్.వెంకట్రావు, పశుసంవర్ధక శాఖ అధికారి చిన నరసింహులు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ షాహిద్ బాబు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ