భైంసా రోడ్‌షోలో ఉద్రిక్తత | Sakshi
Sakshi News home page

భైంసా రోడ్‌షోలో ఉద్రిక్తత

Published Fri, May 10 2024 4:05 PM

భైంసా రోడ్‌షోలో ఉద్రిక్తత

భైంసా/భైంసాటౌన్‌: భైంసాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు చేదు అనుభవం ఎదురైంది. గతంలో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణతో కొందరు హనుమాన్‌ స్వాములు, మరికొందరు కేటీఆర్‌ నిర్వహించే కార్నర్‌ మీటింగ్‌ వద్దకు చేరుకున్నారు. కార్నర్‌ మీటింగ్‌ వద్ద ‘కేటీఆర్‌ ఖబడ్డార్‌’ అన్న ప్లకార్డులతో నిరసన తెలిపారు. పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. కేటీఆర్‌ వాహనం రోడ్‌షో ప్రాంతానికి చేరగానే జైశ్రీరాం నినాదాలతో నిరసన తెలిపారు. కేటీఆర్‌ ప్రసంగం ఆసాంతం జైశ్రీరాం నినాదాలతో అడ్డుతగిలారు. దీంతో కేటీఆర్‌ వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తూనే ప్రసంగం కొనసాగించారు. ఈ క్రమంలో కొందరు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనకారుల వైపు దూసుకురావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. ఇరువర్గాలను పోలీసులు నిలువరించే ప్రయత్నం చేసినా, నిరసనకారులు కేటీఆర్‌ వాహనం వైపు దూసుకెళ్లారు. దీంతో కేటీఆర్‌ పోలీసుల పనితనం ఇదేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు. నిరసనకారుల వైపు నుంచి కేటీఆర్‌ వాహనం పైకి ఉల్లిగడ్డలు రావడంతో, ఆయన పక్కనున్న బోఽథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, ముధోల్‌ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ కిరణ్‌ కొమ్రేవార్‌ అడ్డుగా నిలిచారు. దీంతో మీ రాముడు రాళ్లు విసరమని చెప్పాడా అంటూ కేటీఆర్‌ నిరసనకారులనుద్దేశించి అన్నారు. అయినా నిరసనకారులు తగ్గకపోవడంతో కేటీఆర్‌ తన ప్రసంగాన్ని త్వరగా ముగించారు.

తెలంగాణ బాగుపడిందా...

కేటీఆర్‌ కార్నర్‌మీటింగ్‌లో ప్రసంగిస్తూ.. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పాలనలో కరెంట్‌ కోతలు మళ్లీ మొదలయ్యాయన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ పార్టీ అన్నింటా విఫలమైందన్నారు. విఠల్‌రెడ్డి గురించి ఆలోచన అవసరం లేదన్నారు. ఆయన పోతే చెత్త పోయిందని అనుకుంటామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆత్రం సక్కున గెలిపించాలని కోరారు. హెలీపాడ్‌ వద్ద నిర్మల్‌ జెడ్పీ చైర్మన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌, బీఆర్‌ఎస్‌ ముధోల్‌ సమన్వయకర్తలు విలాస్‌ గాదేవార్‌, రమాదేవి, కిరణ్‌ కొమ్రేవార్‌, లోలం శ్యాంసుందర్‌తోపాటు పార్టీ శ్రేణులు కేటీఆర్‌ను స్వాగతం పలికారు.

Advertisement
 
Advertisement
 
Advertisement