కోల్కతాలో నిన్న ( శనివారం) ప్రసిద్ధ చోర్బాగన్ దుర్గాపూజా మండపం వద్ద భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఘటనకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. వారిలో కార్యక్రమ నిర్వహాకులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అరెస్టైన వారి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏం జరిగింది?
ఉత్తర కోల్కతాలోని ప్రసిద్ధ చోర్బాగన్ దుర్గాపూజా మండపం వద్ద శనివారం (అక్టోబర్ 17) రాత్రి పెను విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షం కురుస్తున్న సమయంలో మండపం లోపలికి వచ్చే ఎంట్రీ, బయటకు వెళ్లే ఎగ్జిట్ మార్గాల్లో ఒకేసారి తీవ్ర రద్దీ ఏర్పడి, ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకూ 19 మంది మృతి చెందగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నారు.
ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కోల్కతా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు తరలించారు. ఆసుపత్రికి హుటాహుటిన చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి గ్రూప్-డి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని సీఎం ప్రకటించారు.
అలాగే బాధితుల కోసం మెడికల్ కాలేజీలో ప్రాథమిక అత్యవసర సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేయాల్సి వస్తోందని అక్కడి ఇంటర్న్ వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు ప్రజల సహాయార్థం 8003455678, 03322141310 హెల్ప్లైన్ నంబర్లను విడుదల చేశారు.
ఇదీ చదవండి: నా ముందే ప్రాణాలు వదిలింది


