సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (CAQM) నేడు (బుధవారం) గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మొదటి దశను అమల్లోకి తెచ్చింది. దసరా మరుసటి రోజే ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) 233కు చేరడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాలి నాణ్యత ‘పూర్’ (201–300) కేటగిరీలోకి వెళ్లడంతో కాలుష్య నియంత్రణ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
గ్రాప్-1లో భాగంగా భవన నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము నియంత్రణ, చెత్తను బహిరంగంగా కాల్చడంపై నిషేధం, వాహన కాలుష్యంపై వాహనాల తనిఖీలు చేపట్టనున్నారు. రోడ్డు పక్కన ఆహార విక్రయ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లల్లో బొగ్గు, కట్టెల వినియోగంపై ఆంక్షలు అమలవుతాయి. అత్యవసర అవసరాలు మినహా డీజిల్ జనరేటర్ల వినియోగంపై కూడా పరిమితులు ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహన ఇంజిన్లు ఆపాలని అధికారులు సూచించారు.
భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. పగటి ఉష్ణోగ్రత 31 డిగ్రీల వరకు ఉండొచ్చని అంచనా వేసింది. గాలి నాణ్యత మరింత దిగజారకుండా అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని CAQM ఆదేశించింది.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు ఎలాన్ మస్క్ షాక్!


