భజనా.. ప్రతీ దానికి భజన.. మస్క్ వ్యంగ్యాస్త్రాలు! | Elon Musk Takes a Fresh Swipe at Ambani | Sakshi
Sakshi News home page

భజనా.. ప్రతీ దానికి భజన.. మస్క్ వ్యంగ్యాస్త్రాలు!

Oct 11 2026 11:51 AM | Updated on Oct 11 2026 12:06 PM

Elon Musk Takes a Fresh Swipe at Ambani

వాషింగ్ట‌న్‌ : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, భార‌త్ టెలికాం దిగ్గజం ముకేశ్ అంబానీల మధ్య శాటిలైట్ ఇంటర్నెట్ సేవ‌ల వినియోగంపై వివాదం మ‌రింత ముదిరింది. సోషల్ మీడియా వేదికగా మస్క్ చేస్తున్న వరుస విమర్శలు, వాటికి వస్తున్న కౌంటర్లు ఇప్పుడు వ్యాపార వర్గాల్లోనే కాక రాజకీయంగానూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అంబానీకి మ‌ద్దుత‌గా ప్ర‌చారం చేస్తున్న వారిపై మస్క్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.  

భార‌త్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభం కాకపోవడానికి గల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. అంబానీ అనుచర వర్గాన్ని, ఇంటర్నెట్‌లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేసేవారిని అంబానీస్ ఆర్మీ ఆఫ్ ఇంటర్నెట్ షిల్స్ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. వీరి వాదనల్లో ఎంతమాత్రం నిజం లేదని, ఇదొక పెద్ద కపట నాటకమని ఎత్తు చూపారు. ఇందులో ప్రధానంగా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయని హైలెట్ చేశారు.  

అంబానీ సృష్టించిన డిఫ్యాక్టో గుత్తాధిపత్యం కారణంగా ఇస్తున్న అతి తక్కువ ధరలతో స్టార్‌లింక్ అసలు పోటీ పడలేదని ఒకవైపు వాదిస్తారు. అదే సమయంలో, స్టార్‌లింక్ గనుక మార్కెట్లోకి వస్తే అది తమకు అత్యంత బలమైన పోటీదారుగా మారుతుందని, తమ వ్యాపారాన్ని దెబ్బతీస్తుందని మరోవైపు భయపడతారు. ఒకవైపు జియో ధరలతో స్టార్‌లింక్ నిలవలేదంటారు, మళ్లీ అదే ఊపులో స్టార్‌లింక్ చాలా పెద్ద పోటీ ఇస్తుందని ఆందోళన చెందుతారు. ఇదెక్కడి వైరుధ్యం? ఇది అర్థం లేని వాద‌న‌ అని మస్క్ దుయ్యబట్టారు.

ఈ సంద‌ర్భంగా మ‌స్క్ ఎక్స్ వేదిక‌గా ట్వీట్ చేశారు. మార్కెట్‌లో పోటీ ఎప్పుడూ కూడా అంతిమ వినియోగదారుడైన సామాన్యుడికే ఎక్కువ ప్రయోజనాలను చేకూరుస్తుందని మస్క్ బలంగా వాదిస్తున్నారు. మార్కెట్‌లో ఎంపికలు పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ పోటీ వల్ల ముకేశ్ అంబానీ లాభాలు కొంతమేర తగ్గవచ్చునేమో కానీ, అంత మాత్రాన ఆయన వ్యాపార సామ్రాజ్యం ఏమీ మూతపడిపోదని మస్క్ స్పష్టం చేశారు. అలాగే, భార‌త్‌లో స్టార్‌లింక్ ధరలు గనుక మరీ ఎక్కువగా ఉంటే సహజంగానే ఎవరూ కొనుగోలు చేయరని, కాబట్టి ఇక్కడి మార్కెట్‌కు తగినట్లుగా ధరలను అందుబాటులో ఉంచుకోవాల్సిన బాధ్యత స్పేస్‌ఎక్స్ పైనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

మొత్తానికి, భార‌త్‌లో అపారమైన డిజిటల్ మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి గ్లోబల్ టెక్కీ ఎలాన్ మస్క్‌కు, దేశీయ కుబేరుడు ముకేశ్ అంబానీకి మధ్య నడుస్తున్న ఈ కోల్డ్ వార్ కేవలం వ్యాపార పోరు మాత్రమే కాదు. భవిష్యత్ ఇంటర్నెట్ రంగంపై ఆధిపత్యం కోసం జరుగుతున్న పెద్ద యుద్ధం. ఈ టెక్కీల పోరులో ప్రభుత్వ నిబంధనలు ఎలా ఉంటాయో, సామాన్యుడికి అంతిమంగా ఎలాంటి ప్రయోజనం దక్కుతుందో కాలమే నిర్ణయించాలి!

ఇదీ చ‌ద‌వండి : బీజేపీ ప్రచారానికి నిధులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement