బీజేపీ ప్రచారానికి నిధులు! | Elon Musk shares reports of Reliance-backed firms donations to BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ ప్రచారానికి నిధులు!

Oct 11 2026 4:58 AM | Updated on Oct 11 2026 4:58 AM

Elon Musk shares reports of Reliance-backed firms donations to BJP

రిలయన్స్‌పై మస్క్‌ ఆరోపణ 

వరుస పోస్టులతో అంబానీపై విమర్శలు

మీడియా కథనాల స్క్రీన్‌షాట్లు షేర్‌

న్యూఢిల్లీ: స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలకు భారత్‌లో అనుమతివ్వకపోవడంపై గుర్రుగా ఉన్న స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ తాజాగా ముకేశ్‌ అంబానీపై తన విమర్శల బాణాన్ని ఎక్కుపెట్టారు. ఎక్స్‌ వేదికగా ఆయన ఒక పోస్టు చేస్తూ... రిలయన్స్‌ ద్వారా నిధులు పొందుతున్న ఓ సంస్థ సోషల్‌మీడియాలో బీజేపీకి ప్రాచుర్యం కల్పించేందుకు సాయపడిందని ఆరోపించారు. అంతేకాకుండా.. మరో సంస్థ అధికార పార్టీకి పెద్ద ఎత్తున విరాళాలు అందించిందని మీడియా కథనాల స్క్రీన్‌షాట్లను షేర్‌ చేశారు. వీటిల్లో 2022లో అల్‌జజీరా ప్రచురించిన ‘‘హౌ రిలయన్స్‌ ఫండెడ్‌ ఫర్మ్‌ బూస్ట్స్‌ బీజేపీ కాంపెయిన్స్‌ ఆన్‌ ఫేస్‌బుక్‌’కథనంతోపాటు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2024లో ‘క్విక్‌ సప్లై’పై రాసిన మరో కథనం ఉన్నాయి. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ కథనం ప్రకారం క్విక్‌ సప్లై ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.385 కోట్లు, శివసేనకు రూ.25 కోట్లు చెల్లించింది.

మస్క్‌ ఇటీవల ఒక పోస్టు చేస్తూ... నిబంధనలన్నీ పాటిస్తున్నా భారత్‌లో కోటీశ్వరులు కొందరు స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలు భారత్‌లోకి రాకుండా అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే భారత దేశానికి అసలైన బాస్‌ ముకేశ్‌ అంబానీనా? అని ప్రశ్నిస్తూ మరో పోస్టు చేశారు. ఈ ట్వీట్‌పై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ స్పందిస్తూ ‘‘వెల్‌కమ్‌ టు ఇండియా ఎలాన్‌...’’అంటూ వ్యాఖ్యానించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో ఎలాన్‌ మస్క్‌ మరోసారి ముకేశ్‌ అంబానీపై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం.

 మస్క్‌ ఇంకో పోస్టులో అంబానీని నేరుగా ‘ప్రధానమంత్రి అంబానీ’ అని కూడా సంబోధించారు. ఏకస్వామ్యానికి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. తన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కంపెనీని అంబానీ కంపెనీతో పోటీ పడేందుకు అనుమతిస్తారా? అని ఎద్దేవా చేశారు. ‘‘ప్రియ ప్రధానమంత్రి అంబానీ గారూ... భారతదేశపు అసలైన యజమాని మీరే అన్నది గుర్తించకపోవడంపై వినమ్రంగా క్షమాపణలు కోరుతున్నా. భారత ప్రజలపై గుత్తాధిపత్య దోపిడీని కొనసాగించాలని మీరు సహజంగానే కోరుకుంటారు. అయినాసరే... పోటీ చేయడానికి స్టార్‌లింక్‌ అనుమతించడాన్ని మీరు పరిగణనలోకి తీసుకుంటారా?’’అని ఆ పోస్టులో విమర్శించారు.  

వివక్ష లేకుండా అనుమతులిస్తున్నాం.. 
మస్క్‌ ఆరోపణలపై రిలయన్స్‌ నేరుగా స్పందించలేదు. ప్రభుత్వం మాత్రం టెలికం, శాటిలైట్‌ సేవలకు వివక్షలేకుండా అనుమతులిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎంపిక చేసిన కొందరికి మాత్రమే అనుమతులు లభిస్తున్నాయన­డం నిరాధార ఆరోపణలని, అపోహలని తెలిపింది. కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాత్రం ప్రభుత్వం ఏ రంగంలోనూ ఏకస్వామ్యాన్ని ప్రోత్సహించదని స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement