ఇకపై ధర్నాలు, ఆందోళనలు, నిరసనలకు ’నో’
జంతర్‌మంతర్ పేరును ‘నిరసన వేదికల’జాబితా నుంచి తొలగించిన ఢిల్లీ పోలీసులు
డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ
ప్రత్యామ్నాయంగా రాంలీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లలో ఆందోళనలకు అనుమతి
హోంశాఖ కమిటీ సిఫార్సు మేరకే నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ పోలీసుల స్పష్టీకరణ
ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్యానికి శాపం
కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల తీవ్ర అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఉద్యమాల రాజధానిగా, నిరసనకారులకు సిసలైన చిరునామాగా వెలుగొందుతూ దశాబ్దాల కాలంలో ఎన్నెన్నో చరిత్రాత్మక ఉద్యమాలకు కేరాఫ్‌గా నిలిచిన, ఉద్యమ నినాదాలతో అనునిత్యం హోరెత్తిపోయే జంతర్‌మంతర్‌లో ఇకపై నిశ్శబ్దం రాజ్యమేలనుంది. సెంట్రల్ ఢిల్లీలో కీలమైన ప్రాంతంలో ప్రతిరోజూ ఉద్యమ సెగలను రాజేసే ప్రతిష్టాత్మకమైన జంతర్‌మంతర్‌లో ఇక మీదట ధర్నాలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వబోమని ఢిల్లీ పోలీసులు తేల్చిచెప్పారు.
విద్యార్థి, ఉద్యోగ, యువజన, రాజకీయ, సాంఘిక, సామాజిక సమస్యలకు పరిష్కారాలు కోరుతూ తరచూ తండోపతండాలుగా తరలివచ్చే ఉద్యమకారులతో జంతర్‌మంతర్ కిక్కిరిసిపోతోందని, ఢిల్లీ వాసుల ట్రాఫిక్ సమస్యల్ని కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ధర్నాస్థలిని జంతర్‌మంతర్ నుంచి వేరే చోటుకు మార్చుతున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ప్రకటించారు. అక్టోబర్ 11వ తేదీన ఇచ్చిన ఉత్తర్వు వివరాలు సోమవారం వెలుగులోకి వచ్చాయి. రాంలీలా మైదాన్, బురారీ గ్రౌండ్, సీబీడీ గ్రౌండ్‌లలో ఇకపై ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు, ఆందోళనలు చేసుకోవచ్చని కమిషనర్ వెల్లడించారు.
జంతర్‌మంతర్ నుంచి రాంలీలా మైదాన్ దాదాపు నాలుగు కి.మీ.ల దూరంలో ఉంది. సీబీడీ గ్రౌండ్ ఏకంగా 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక ఉత్తరఢిల్లీలోని బురారీ గ్రౌండ్ మరీ దూరంగా 21 కి.మీ.ల దూరంలో ఉంది. కేంద్ర హోం శాఖ నియమించిన కమిటీ సమగ్ర సమీక్ష తర్వాత నూతన ప్రత్యామ్నాయ ధర్నావేదికలను సిఫార్సు చేసిందని, వాటినే ఖరారుచేసినట్లు ఢిల్లీ పోలీసులు వివరణ ఇచ్చారు.
గత కొద్దివారాలుగా కాక్రోచ్ జనతాపార్టీ, కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల ఉద్యమాలతో జంతర్‌మంతర్ హోరెత్తిపోయిన నేపథ్యంలో అక్కడ ఉద్యమకారులు గుమికూడకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
‘‘2022 ఏప్రిల్ 28వ తేదీనాటి ఉత్తర్వుల్లో మార్పులు చేస్తున్నాం. జంతర్‌మంతర్‌లో ధర్నాల సంగతి ఇక మర్చిపోండి. కొత్త ధర్నాస్థలాల్లో ఉద్యమాలను కొనసాగించండి. అక్కడ ఉద్యమాలకు సంబంధించిన విధివిధానాలు, నిబంధనలను త్వరలోనే ప్రకటిస్తాం’’అని పోలీస్ కమిషనర్ చెప్పారు. జంతర్‌మంతర్‌లో ధర్నాలకు తాజా తేదీలను ఖరారుచేయాలని కోరుతూ సీజేపీనేతలు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌లో వినతిపత్రాలు అందజేసిన రోజే ధర్నాస్థలిని మారుస్తున్న విషయం వెలుగులోకి రావడం గమనార్హం.
జన్‌పథ్ మెట్రో స్టేషన్ రెండో నంబర్ గేటు జంతర్‌మంతర్‌కు అత్యంత సమీపంలో ఉంది. పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లు సైతం జంతర్‌మంతర్‌కు సమీపంలోనే ఉన్నాయి. ధర్నాల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు తరచూ ఢిల్లీ మెట్రో గేట్లు మూసేస్తుండటంతో ఈ మార్గంలో ప్రయాణించే వేలాది మంది ఢిల్లీవాసులకు తీవ్ర ఇబ్బందికలుతోందని ఢిల్లీ పోలీసులు వాదిస్తున్నారు. ఇక్కడ ధర్నాల వేళ ట్రాఫిక్‌ను మరో మార్గంలోకి మళ్లించడం, అత్యధిక సంఖ్యలో బలగాలను మోహరించడం తలకు మించిన భారంగా తయారైందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
రాంలీలాలో అసలే వద్దు...
ఇకపై రాంలీలా మైదాన్‌లో ధర్నాలు చేసుకోవచ్చంటూ ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఉత్తర్వును ఆ ప్రాంతంలోని వాణిజ్య, రవాణా సంస్థల సంఘాలు తప్పుబట్టాయి. ‘‘పాత ఢిల్లీలో కీలకమైన హోల్‌సేల్ మార్కెట్ ఇక్కడే ఉంది. కొత్తగా ఇక్కడ ధర్నాలు చేపడితే టోకుధరల దుకాణ సముదాయాలకు తరలివచ్చే భారీస్థాయిలో సరుకు రవాణా అస్తవ్యస్తమవుతుంది. ఇక్కడ వాణిజ్య లావాదేవీలు, కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కొత్త ధర్నావేదికల నుంచి రాంలీలా మైదాన్ పేరు తీసేయండి’’అని ది చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ(సీటీఐ) ఒక ప్రకటనలో అభ్యర్థించింది.
‘‘జంతర్‌మంతర్‌లో ధర్నాలు ఆపేస్తే మంచిదేగానీ ఇక్కడ మొదలెడతామంటే ఏమాత్రం సబబుగా లేదు. సదర్ బజార్, చాందినీచౌక్, చౌరీ బజార్, ఖారీ బవోలీ, భగీరథ్ ప్లేస్, కాశ్మీరీ గేట్, పహార్‌గంజ్, దర్యాగంజ్, కమలమార్కెట్, లజ్‌పత్‌రాయ్ మార్కెట్, అజ్మీరీ గేట్ ప్రాంతాలన్నీ హోల్‌సేల్ మార్కెట్లే. పండుగల సీజన్‌లో వ్యాపారులు, వినియోగదారులతో ఈ ప్రాంతాలన్నీ అత్యంత రద్దీగా ఉంటాయి. కొత్తగా ధర్నాచౌక్ ఇక్కడికొస్తే వాణిజ్యం తీవ్రంగా దెబ్బతినే ఆస్కారముంది’’అని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ ఆందోళన వ్యక్తంచేశారు. రాంలీలా మైదాన్‌ను ‘ధర్నా జాబితా’నుంచి తొలగించాలని ఆలిండియా మోటార్, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ సైతం ఢిల్లీ కమిషనర్‌కు సోమవారం ఒక వినతిపత్రం అందజేసింది.
మా బతుకులు బుగ్గిపాలు..
ధర్నాలో పాల్గొనేందుకు తరలివచ్చే ఉద్యమకారులకు ఛాయ్, బిస్కెట్, సమోసా, వాటర్ బాటిళ్లు, చిరుతిండ్లు, అల్పాహారాలు, భోజన ఏర్పాట్లు చూస్తూ చిరువ్యాపారులుగా, వీధి వర్తకులుగా ఇ క్కడే స్థిరపడిపోయిన పలువురి బతుకులు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ‘‘గత 20 ఏళ్లుగా ఇక్కడే ఛోలే భటూరే, రాజ్మా చావల్, మటర్ కుల్చా, పులావ్ అమ్ముతూ ఇక్కడే ఉంటున్నా. ఉన్నంతలో బతుకుతున్నాం. ఇప్పుడు హఠాత్తుగా ధర్నాచౌక్ మూసేస్తే మా కుటుంబాలు వీధిన పడతాయి’’అని విజయ్ గుప్తా అనే చిరువ్యాపారి ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘గత 26 ఏళ్లుగా ఇక్కడే పాన్ షాప్ నడుపుతున్నా. నా కుటుంబ అవసరాలు, నా సోదరి చదువులయ్యే ఖర్చు ఈ షాప్‌తోనే వెళ్లదీస్తున్నా. ఇప్పుడు ధర్నాలకు ఆపేస్తే మా కుటుంబం వీధిన పడుతుంది’’అని అజయ్ కుమార్ అనే మరో వ్యాపారి ఆందోళనవ్యక్తంచేశారు.
ప్రజాస్వామ్యం పట్టదు: కాంగ్రెస్
ధర్నాస్థలి మార్పు నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మోదీ సర్కార్‌పై విమర్శల వర్షం కురిపించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పలు పోస్ట్‌లు పెట్టారు. ‘‘రోజూ ఉద్యమాలకు జంతర్‌మంతర్ సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ ఉత్సాహం, ప్రజా ఉద్యమం చూసి మోదీ, షాలకు భయం పట్టుకుంది. జంతర్‌మంతర్‌లో ఉద్యమాలు కొనసాగితే తమకు ముప్పు ఎక్కువవుతుందని భావించి ఈ విష ద్వయం శాంతియుత ప్రజాఉద్యమాలను దారుణంగా అణచివేసేందుకు ఈ కొత్త ఎత్తుగడతో ముందుకొచ్చింది. వాళ్లకసలు ప్రజాస్వామ్యం అంటేనే పట్టదు. వీళ్ల నిర్ణయం ప్రజాస్వామ్యానికి పెనుశాపం’’అని అన్నారు.
ఇక దేశమే జంతర్‌మంతర్: సీజేపీ
ఏకపక్ష నిర్ణయం ఏమాత్రం ఆమోదనీయం కాదు అని సీజేపీ కో–కన్వినర్ సౌరవ్ దాస్ వ్యాఖ్యానించారు. ‘‘నరేంద్ర మోదీకి జంతర్‌మంతర్ అంటే ఎంతటి భయం.. ఈ నిర్ణయంతో తేటతెల్లమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పుడు జంతర్‌మంతర్‌ను డీనోటిఫై చేసింది. త్వరలో ప్రజాస్వామ్యాన్ని సైతం డీనోటిఫై చేస్తుందేమో. ఇదే వాళ్ల తదుపరి నిర్ణయం కావొచ్చు. ఈ నిర్ణయం శాంతియుత ప్రదర్శనలకు అనుమతించే ప్రాథమిక హక్కుపై దాడే. జంతర్‌మంతర్‌లో ధర్నాలను తొలగిస్తే ఇక దేశమే జంతర్‌మంతర్‌లా మారుతుంది. అంతటా ధర్నాలుచేస్తాం’’అని ఆయన స్పష్టంచేశారు.


