జీవితాల్లో వెలుగులు | Sakshi
Sakshi News home page

జీవితాల్లో వెలుగులు

Published Sun, Nov 12 2023 12:52 AM

జిల్లా కేంద్రంలో టపాసుల దుకాణాలు  - Sakshi

అంబులెన్స్‌ 108

పోలీస్‌ కంట్రోల్‌ రూం. 100

ఫైర్‌ స్టేషన్‌ 101

అత్యవసర ఫోన్‌

నంబర్లు

నేడు దీపావళి పర్వదినం

నోములు, వ్రతాలకు ప్రత్యేకం

కిక్కిరిసిన మార్కెట్లు

ప్రమిదలు, బాణాసంచా,

పూల దుకాణాల్లో సందడి

కందనూలు/ అచ్చంపేట: హిందువుల అతి ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు నింపే పండుగ. విజయానికి ప్రతీకగా అశ్వయుజ అమావాస్య రోజున ఈ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం దీపావళి పండుగను జరుపుకొనేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. కుల, మత వర్గ భేదాలు లేకుండా జరుపుకొనే ఈ పండుగ వెనుక పురాణగాధలు ఉన్నాయి. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దీపావళి పండుగ సందడి మొదలైంది. ఇంటింటా దీపాల వెలుగులతో సందడి నెలకొంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా బాణాసంచాతో చీకట్లను తొలగించే సంబురానికి ప్రజలు సిద్ధమయ్యారు.

దీపం.. మహా లక్ష్మి స్వరూపం

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగానే కాకుండా మనోవికాసం, ఆనందం, సజ్జనత్వం, సద్గుణసంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అంతే కాకుండా దీపావళి అమావాస్య రోజున మహా లక్ష్మిపూజకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. సహస్రనామాలతో, అష్టోత్తరాలతో, దండకాలతో, భక్తీ ప్రపత్తులతో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూజిస్తారు. అనంతరం మహిళలంతా సాయంత్రం సంధ్యా సమయంలో మట్టిప్రమిదల్లో దీపాలు వెలిగించడం ఆనవాయితీ.

హరిత దీపావళి కోసం పిలుపు...

దీపావళి వచ్చిందంటే చిన్నా, పెద్ద తేడా లేకుండా టపాసులు కాల్చేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఒక్క నిమిషం ఆగండి అంటున్నారు. పర్యావరణ ప్రేమికులు. పెద్ద శబ్దాలు, విపరీతమైన పొగ విడుదల చేసే టపాసుల జోలికి వెళ్లొద్దని కోరుతున్నారు. కాగా ప్రస్తుతం టపాసులు కాల్చకుండా హరిత దీపావళి జరుపుకోవాలని పిలుపునిస్తున్నారు.

సందడిగా మార్కెట్లు..

జిల్లా కేంద్రంతో పాటు కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌ పట్టణాలు, మండల కేంద్రాల్లో బాణాసంచా దుకాణాలు, ప్రమిదలు, పూల దుకాణాలు సందడిగా మారాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ప్రత్యేక బాణాసంచా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, టపాసులు కొనుగోలు చేస్తున్నారు. మాములు రోజుల్లో కిలో బంతి పూలు రూ.40 నుంచి రూ.50 ఉండగా.. ప్రస్తుతం రూ.150 పైనే విక్రయిస్తున్నారు.

జాగ్రత్తలు.. అవసరం

దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. టపాసులు కాల్చే సమయంలో ఎంతో మంది ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. పండుగను కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్యన జరుపుకోవాలని, టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, చేతిలో పట్టుకుని టపాసులు కాల్చవద్దని వైద్యులు, పోలీసులు సూచిస్తున్నారు. అత్యవసరం ఉంటే కింది నంబర్లకు ఫోన్‌ చేయాలని చెబుతున్నారు.

Advertisement
Advertisement