పోలింగ్‌ బాక్స్‌ల తరలింపునకు తాత్కాలిక రోడ్డు | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బాక్స్‌ల తరలింపునకు తాత్కాలిక రోడ్డు

Published Sat, Nov 11 2023 1:36 AM

గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎస్సై కృష్ణప్రసాద్‌ - Sakshi

ఏటూరునాగారం: ఏటూరునాగారం మండలం కొండాయి–దొడ్ల మధ్యలోని జంపన్నవాగు వద్ద బ్రిడ్జి కూలిపోగా నవంబర్‌ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఐలాపురం, కొండాయి, మల్యాల గ్రామాలకు పోలింగ్‌ బాక్స్‌లను వాహనాల్లో తరలించేందుకు వాగుపై తాత్కాలిక రోడ్డు నిర్మాణం కోసం ఆర్‌అండ్‌బీశాఖ నుంచి రూ.20లక్షలు మంజూరయ్యాయి. గత వర్షాకాలంలో వరద ఉధృతికి రెండు గ్రామాలు, బ్రిడ్జి కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది గ్రామస్తులు వరదలో కొట్టుకుపోయి మృతిచెందారు. ఈ నేపథ్యంలో జంపన్నవాగు నుంచి 150 మీటర్ల మేర రోడ్డు నిర్మించడానికి ఆర్‌అండ్‌బీ రూ.20లక్షలు ఖర్చు చేయనుంది. వాగులో 60 మీటర్ల నిర్మాణం, మిగతా ఇరువైపుల రోడ్డును నిర్మించనున్నారు. నవంబర్‌ 30 ఎన్నికలకు బ్యాలెట్‌ బ్యాక్సులు, పోలింగ్‌ సిబ్బంది తరలించడానికి ఈ రోడ్డును వేగంగా నిర్మించనున్నారు. అంతేకాకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాలను సైతం ఈ రోడ్డుపై నుంచి నడిపించాలనే ఉద్దేశంతో ఈ రోడ్డును డిజైన్‌ చేస్తున్నారు. ఇటు ఎన్నికలు సమయం దగ్గరపడడంతో ఆర్‌అండ్‌బీశాఖ పనులను వేగవంతం చేయడానికి తగిన చర్యలు చేపడుతోంది. ఈ మేరకు శుక్రవారం స్థానిక ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఏఈఈ రాకేష్‌లు జంపన్నవాగు నీటి లోతు, రోడ్డు నిర్మించే ప్రాంతాలను పరిశీలించారు. గ్రామస్తులతో కలిసి రోడ్డు నిర్మించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎంత మేర ఎత్తు, వెడల్పుపై అధికారులు చర్చించారు.

ఆర్‌అండ్‌బీ నుంచి

రూ.20 లక్షలు మంజూరు

జంపన్నవాగును

పరిశీలించిన అధికారులు

Advertisement
Advertisement