మేడిగడ్డ ప్రాజెక్టును మూసెయ్యాలి | Sakshi
Sakshi News home page

మేడిగడ్డ ప్రాజెక్టును మూసెయ్యాలి

Published Thu, Nov 9 2023 1:52 AM

మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీని సందర్శించిన రిటైర్డ్‌ కలెక్టర్‌ మురళి బృందం    - Sakshi

మహదేవపూర్‌: సీఎం కేసీఆర్‌ అహంకారంతో నిర్మి ంచిన ప్రాజెక్టు మేడిగడ్డని, దీంతో రైతులకు ఎలాంటి లాభం లేదని, వెంటనే దీనిని మూసేయ్యాలని రిటైర్డ్‌ కలెక్టర్‌ ఆకురూరి మురళి డిమాండ్‌ చేశారు. ‘జాగో – మేలుకో తెలంగాణ’ ఓటరు చైతన్య బస్సుయాత్రలో భాగంగా మహదేవ్‌పూర్‌ మండలంలోని అంబట్‌పల్లి వద్ద గల మేడిగడ్డ (లక్ష్మి)బ్యారేజీని బుధవారం మురళి బృందం సందర్శించింది. అనంతరం మహదేవపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడిగడ్డ బ్యారేజీ రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు గుదిబండగా మారుతుందన్నారు. నీటిని ఎత్తిపోయడంతో విద్యుత్‌ వ్యయం పెరుగుతుందని, ప్రాజెక్టును రిపేర్‌ చేసినా మళ్లీ కుంగిపోయే అవకాశం ఉందన్నారు. అందువల్ల మొత్తం ప్రాజెక్టును మూసివేయడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఆయన వెంట ప్రొఫెసర్లు జానయ్య, వినాయకరెడ్డి, హైకోర్టు న్యాయవాదులు ఉన్నారు.

అధికార పార్టీలకు ఓటుతో బుద్ది చెప్పాలి

కాటారం: ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఐఏఎస్‌ అధికారి, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (టీఎస్‌డీఎఫ్‌) నాయకుడు ఆకునూరి మురళి అన్నారు. బుధవారం కాటారం మండల కేంద్రంలో టీఎస్‌డీఎఫ్‌ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని అనుకున్నామని, కానీ అందుకు భిన్నంగా ఉందన్నారు. కేజీ టు పీజీ విద్య అమలు హామీ అటుకెక్కిందన్నారు. మోదీ ప్రభుత్వం బడా సంపన్నులకే సేవ చేస్తుందన్నారు.

రేగొండలో..

రేగొండ: అసమర్థ ప్రభుత్వాలను గద్దె దింపాలని రిటైర్డ్‌ కలెక్టర్‌ ఆకునూరి మురళి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఓటు హక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే నాయకులకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు వినాయకరెడ్డి, లక్ష్మీనారాయణ, పద్మజా, రమా, గోవర్ధన్‌, శంకర్‌, మహేష్‌, రాందాస్‌, వెంకట్‌, నారాయణ, తదితరులు పాల్గోన్నారు.

రిటైర్డ్‌ కలెక్టర్‌ ఆకునూరి మురళి

Advertisement
Advertisement