– విశ్వక్ సేన్
‘‘కల్ట్’కి నా యాక్టింగ్ గురువుల్లో ఒకరైన తాజుద్దీన్గారిని డైరెక్షన్ చేయమని అడిగాను. కానీ ఈ మధ్య నా నుంచి వచ్చిన కొన్ని సినిమాలు అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఒక సినిమా వర్కవుట్ కాకపోవడానికి చాలా కారణాలుంటాయి. అయితే నేను ఒడ్డున ఉంటేనే మిమ్మల్ని (తాజుద్దీన్) ఒడ్డుకు లాగగలనని చెప్పి, ఈ సినిమాకు నేనే దర్శకత్వం వహిస్తానని చెప్పాను. ఈ సందర్భంగా ఆయనకు క్షమాపణలు చెబుతున్నాను.
‘లైలా’ సినిమా రిలీజ్ తర్వాత నేను కొంచెం డల్గా ఉన్నాను. అప్పుడు మా అన్న నాతో ‘నీ వెపన్ నీ చేతిలోనే ఉంది’ అని చెప్పారు. అప్పుడు నా కోసం మళ్లీ నేనే నిలబడాలని అర్థమైంది. ‘ఫలక్నుమా దాస్’ సినిమాకి నా కోసం నేను నిలబడ్డాను. సో... ‘కల్ట్’ సినిమాకు నేనే దర్శకత్వం వహించాలని నిర్ణయించుకున్నాను’’ అని విశ్వక్ సేన్ అన్నారు. విశ్వక్ సేన్ కథ–స్క్రీన్ ప్లే అందించి, దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రం ‘కల్ట్’.
గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. సందీప్ కాకరాల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది. ఆదివారం జరిగిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం మొదలైన ఐదు నిమిషాలకే ప్రేక్షకులందరినీ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది. ఇందులోని యాక్షన్ కంటే డ్రామాకు ప్రేక్షకులు ఎక్కువగా కనెక్ట్ అవుతారు.
నేను ప్రయోగాలు చేసిన ప్రతిసారీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. అదే నమ్మకంతో ఈ సినిమా చేశాను. ఇది గ్లోబల్ కంటెంట్. అందుకే జపనీస్, స్పానిష్ భాషల్లో డబ్ చేశాం. ఇది భాషను దాటి వెళ్లే సినిమా’’ అని చెప్పారు. ‘‘ఈ చిత్రంలో యాక్టర్గా విశ్వక్ విశ్వరూపం చూస్తారు’’ అని అన్నారు సందీప్. తారక్ పొన్నప్ప, ఈజీ, అనిరుధ్, కార్తికేయ తదితరులు మాట్లాడారు.


