పోలింగ్‌కు ముందు అప్రమత్తంగా ఉండాలి | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు ముందు అప్రమత్తంగా ఉండాలి

Published Fri, May 10 2024 4:15 PM

పోలింగ్‌కు ముందు అప్రమత్తంగా ఉండాలి

● కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ ● అధికారులతో సమీక్ష సమావేశం

మంచిర్యాలటౌన్‌: ఈ నెల 13న జరిగే పోలింగ్‌కు ముందు 72 గంటల సమయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గురువారం నస్పూరులోని సమీకృత కలెక్టరేట్‌లో డీసీపీ అశోక్‌కుమార్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతీలాల్‌తో కలిసి జిల్లా ఇంటెలిజెన్స్‌ కమిటీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని అన్నారు. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఈ నెల 11న సాయంత్రం 4 గంటల నుంచి జిల్లాలోని వైన్‌షాపులను మూసి ఉంచాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆబ్కారీ, మద్యనిషేధ శాఖ అధికారి జి.నందగోపాల్‌, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ తిరుపతి, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి శివప్రసాద్‌, కేంద్రీయ జీఎస్టీ అధికారి శుభంకర్‌, ఆదాయపన్ను శాఖ అధికారి సూర్య భగవాన్‌, జిల్లా రవాణా శాఖ అధికారి సంతోశ్‌కుమార్‌, ప్రధాన తపాలా కార్యాలయ పర్యవేక్షకులు సంజయ్‌కుమార్‌, నోడల్‌ అధికారి హనుమంతరెడ్డి పాల్గొన్నారు.

రాజకీయ పార్టీలు సహకరించాలి

మంచిర్యాలటౌన్‌: పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్‌ సంతోష్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం డీసీపీ అశోక్‌, ఆర్డీవో వి.రాములుతో కలిసి గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలింగ్‌ కేంద్రాల సమీపంలో గుంపులుగా ఉండవద్దని, లౌడ్‌ స్పీకర్లు, ఇతరత్రా ప్రచార అంశాలను నిషేధించామని పేర్కొన్నారు. ఎన్నికల తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం

మంచిర్యాలటౌన్‌: జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అంతా సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ సంతోష్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 741 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాలెట్‌ యూనిట్‌లో 42 మంది అభ్యర్థులు, 1 నోటా గుర్తులు ఉంటాయని, ఒక కంపాట్‌మెంటులో 3 బ్యాలెట్‌ యూనిట్లు, 1 కంట్రోల్‌ యూనిట్‌, 1 వీవీ ప్యాట్‌లను అందుబాటులో ఉంచామని తెలిపారు. 13న ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. డీసీపీ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 3 సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ బలగాలు వచ్చాయని, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆర్డీవో రాములు, జిల్లా పౌరసంబంధాల అధికారి జే.శారద పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement