అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు

Published Thu, May 9 2024 9:25 AM

అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు

తేల్చిచెప్పిన హైకోర్టు

సాక్షి,హైదరాబాద్‌: అక్రమ నిర్మాణాల తొలగింపులో జోక్యం చేసుకునే అధికారం లోకాయుక్తకు లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. అంతకుముందు లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. లోకాయుక్త చట్టం 1983లోని సెక్షన్‌ 29(ఏ)..అక్రమ నిర్మాణాల తొలగింపునకు సంబంధించి చర్యలు తీసుకునే, జోక్యం చేసుకునే అధికారం ఇవ్వలేదని ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. నిర్మాణాలను తొలగించాలంటూ 2015లో లోకాయుక్త జారీ చేసిన ఆదేశాలను హైదరాబాద్‌కు చెందిన హనుమంతరావు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పునిచ్చింది. లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలు చెల్లవని నొక్కిచెప్పింది.

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ చీఫ్‌ కమిషనర్‌గా కవిత తొలగింపు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ది భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌ పదవి నుంచి తొలగిస్తున్నట్లు.. ది భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి బుధ వారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ నేషనల్‌ డైరెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కవితపై పలు అభియోగాల ఆధారంగా ఈ నెల 3 నుంచి ఆమెను తొలగిస్తున్నట్లు ప్రక టించారు. 2021లో పదవీ బాధ్యతలు చేపట్టిన కవిత ఏప్రిల్‌ 2026 వరకు కొనసాగాల్సి ఉండగా మధ్యలోనే తప్పించారు.

10న నాలుగు వేల డప్పులతో ర్యాలీ

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ రక్షణ పేరుతో ఈనెల 10న సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు నాలుగు వేల డప్పులతో ర్యాలీ ఉంటుందని కాంగ్రెస్‌ నేతలు గజ్జెల కాంతం, సతీశ్‌మాదిగ తెలిపారు. ఆయన బుధవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ బాబూ జగ్జీవన్‌రాం విగ్రహం నుంచి 125 అడుగుల డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ ఉంటుందని చెప్పారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే దేశాన్ని మోదీ రాజ్యంగా మార్చుతారని ఆరోపించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లను కాపాడేది కాంగ్రెస్‌ ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు.

క్లుప్తంగా...

Advertisement
Advertisement