‘మరింత అప్రమత్తంగా ఉండాలి’ | Sakshi
Sakshi News home page

‘మరింత అప్రమత్తంగా ఉండాలి’

Published Thu, May 9 2024 9:20 AM

-

కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి పోలింగ్‌కు ముందు 48 గంటల నిశ్శబ్ధ కాలం(సైలెన్స్‌ పీరియడ్‌) అత్యంత కీలకమని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ విషయమై ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 న సాయంత్రం 6 గంటలకు పోలింగ్‌ ముగుస్తుందని, అంతకు ముందు 48 గంటలనుంచి పోలింగ్‌ సమయం ముగిసే వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్‌ నిషేధించిందని తెలిపారు. ప్రచార సమయం ముగిసిన వెంటనే ఇతర నియోజకవర్గాలకు చెందిన వారు వెళ్లిపోవాలని సూచించారు. ఫంక్షన్‌ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, లాడ్జీలు, అతిథి గృహాలు తదితర ప్రాంతాలలో ఇతర నియోజకవర్గాలవారుంటే గుర్తించి పంపించివేయాలని అధికారులను ఆదేశించారు. సహాయ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, ఆదాయ పన్నుల శాఖల అధికారులు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు, వ్యయ నియంత్రణ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డబ్బు, మద్యం, కానుకలు లాంటివి అక్రమ రవాణా జరగకుండా ముమ్మరంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. సి–విజిల్‌, 1950 ద్వారా వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

Advertisement
Advertisement