పిడుగు పడి మేకల కాపరి మృతి | Sakshi
Sakshi News home page

పిడుగు పడి మేకల కాపరి మృతి

Published Tue, May 7 2024 11:55 PM

పిడుగ

తాళ్లపూడి: మండలంలోని బల్లిపాడులో పిడుగు పడి మేకల కాపరి మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బల్లిపాడుకు చెందిన కవల నాగేశ్వరరావు(55) ఎప్పటి లాగే లంక భూముల్లో మేకలు మేపుతూ చెట్టు కింద ఉన్న సమయంలో పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కొవ్వూరు పోలీసులు తెలిపారు.

ఓటు వేసిన 12,329 మంది ఉద్యోగులు

కాకినాడ సిటీ: జిల్లాలో మూడు రోజులుగా నిర్వహించిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో 12,329 మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. కాకినాడ పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న తొలి రోజు జిల్లా స్థాయి పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ సరళిని ఆయన మంగళవారం పరిశీలించారు. ఫెసిలిటేషన్‌ సెంటర్‌లోని పోలింగ్‌ బూత్‌లను సందర్శించి, పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకుంటున్న ఉద్యోగులతో మాట్లాడారు. జిల్లాలో ఓటు హక్కు ఉండి, ఇక్కడే ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఆయా నియోజకవర్గాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించామన్నారు. పొరుగు జిల్లాలో ఓటుహక్కు కలిగి, కాకినాడ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 4,179 మంది ఉద్యోగులకు మంగళ, బుధవారాల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పిస్తున్నామన్నారు. వీరి కోసం జిల్లా ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 13 పోలింగ్‌ బూత్‌లు, 11 వెరిఫికేషన్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో పోలింగ్‌ బూత్‌ను సుమారు 70 మంది ఓటర్లకు కేటాయించామని కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ డి.తిప్పేనాయక్‌, జిల్లా పోస్టల్‌ బ్యాలెట్‌ నోడల్‌ అధికారి జి.శ్రీనివాసరావు, సీపీఓ పి.త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం

యువకుడి పరిస్థితి విషమం

అన్నవరం: విశాఖ జిల్లా గాజువాకకు చెందిన ఒక ప్రేమ జంట స్థానిక లాడ్జిలో అత్మహత్యాయత్నం చేసింది. అయితే లాడ్జి యాజమాన్యానికి విషయం తెలిసి సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ జంటను తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా గాజువాకలోని ఒక షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తున్న హర్షవర్ధన్‌, రాములమ్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. హర్షవర్ధన్‌ కు మరో అమ్మాయితో వివాహం అయింది. రాములమ్మ అవివాహిత. కాగా, వీరు సోమవారం రాత్రి అన్నవరంలోని లాడ్జికి వచ్చి తాము భార్యాభర్తలమని నమ్మించి గదిలో అద్దెకు దిగారు. మంగళవారం ఉదయం సిబ్బంది గదులు శుభ్రం చేస్తుండగా ఆ ప్రేమజంట ఉన్న గది తలుపు తీసి ఉంది. దాంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది గది లోపల చూడగా ఆ జంట మంచంపై అపస్మారక స్థితిలో ఉన్నారు. వారి పక్కన పురుగు మందు సీసా ఉండడంతో వెంటనే 108 అంబులెన్స్‌, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వీరిని అంబులెన్స్‌లో తుని ప్రభుత్వాసుపత్రికి తరలించగా వారికి అక్కడ వైద్యులు చికిత్స చేశారు. వీరిలో హర్షవర్ధన్‌ పరిస్థితి విషమంగా ఉందని అన్నవరం ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు. ఎలాగా వివాహం చేసుకోలేదు, కలిసి చనిపోవాలని భావించి పురుగు మందు తాగినట్లుగా రాములమ్మ తెలిపినట్లు అన్నవరం ఎస్‌ఐ చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

పిడుగు పడి మేకల కాపరి మృతి
1/1

పిడుగు పడి మేకల కాపరి మృతి

Advertisement

తప్పక చదవండి

Advertisement