కీవ్: రష్యా శుక్రవారం ఉక్రెయిన్లోని తొమ్మిది ప్రాంతాలపై భీకర దాడులకు పాల్పడింది. ఇంధన, విద్యుత్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన ఈ దాడుల ఫలితంగా వేలాది నివాసాల్లో చీకట్లు అలుముకున్నాయి. దాడుల్లో కనీసం 15 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. పట్టణాలు, నగరాల్లో నీటి సరఫరా, హీటింగ్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.
ఇలా ఉండగా, గురువారం రాత్రి తమ భూభాలపై ఉక్రెయిన్ ప్రయోగించిన 644 డ్రోన్లను మధ్యలోనే అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. మాస్కోలోని విమానాశ్రయాల్లో డ్రోన్ల దాడుల కారణంగా కనీసం 200 విమానాలు ఆలస్యంగా నడిచాయని, సెయింట్ పీటర్స్బర్గ్ విమానాశ్రయంలో 46 విమానాలు రద్దవడమో లేక ఆలస్యంగా నడిచాయని తెలిపింది.


