1,800 మంది నిరసనకారుల అరెస్ట్
పారిస్: నిరసనలు, విధ్వంసం, హింసాకాండతో ఫ్రాన్స్ అట్టుడుకుతోంది. జీవన వ్యయం విపరీతంగా పెరగడం, పాఠశాలల్లో కనీస వసతుల లేమి, నిధుల కోతపై మొదలైన ఉద్యమం క్రమంగా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారుల ముసుగుల్లో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. దుండగులు గుంపులుగా తిరుగుతూ దుకాణాలను లూటీ చేస్తున్నారు. పోలీసులతో ఘర్షణకు దిగుతున్నారు.
ఇప్పటిదాకా 1,800 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముసుగులు ధరించిన గుంపులు పలు నగరాల్లో చారిత్రక కట్టడాలకు నిప్పుపెట్టాయి. నగర పాలక భవనాలతో సహా ప్రభుత్వ భవనాలపై దాడి చేశాయి. సెంట్రల్ ఫ్రాన్స్‌లోని లిమోజెస్ నగరంలో 19వ శతాబ్దపు నాటి చారిత్రక సిటీ హాల్‌ను మంటలు చుట్టుముట్టడంతో పైకప్పు కూలిపోయింది. ఈ భవనం చాలావరకు దహనమైంది. ఆదివారం నాటికి మంటలు అదుపులోకి వచ్చాయని అన్నారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఆదివారం ప్రభుత్వ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితిని సమీక్షించారు. అల్లరి మూకలను కఠినంగా అణచివేయాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. రాజధాని పారిస్‌తోపాటు మార్సెయిల్, లియోన్, బోర్డో, రెన్నెస్, స్ట్రాస్‌బర్గ్, గ్రెనోబుల్, నైస్, లిమోజెస్ నగరాల్లో వందలాది వ్యాపార సంస్థల్లో దోపిడీ జరిగింది. ఖరీదైన వస్త్రాలతోపాటు వస్తువులను పట్టపగలే దుండగులు దోచుకున్నారు. దేశంలో 8 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారని ఓ అంచనా.


