మల్కాజిగిరి పరిధిలో కానరాని నైట్ పెట్రోలింగ్
సాక్షి, సిటీబ్యూరో
గల్లీ గల్లీలో గస్తీ. విజిబుల్ పోలీసింగ్‌తోనే నేరాల నియంత్రణ. నేరస్తుల కదలికలపై నిఘా పెడితేనే ప్రజలకు రక్షణ, శాంతి భద్రతలు అదుపులో ఉంటాయి. కానీ.. మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్‌లో గస్తీ వ్యవస్థకు సుస్తీ చేసింది. పోలీసు కమిషనర్ సుమతీ డెకాయ్ ఆపరేషన్‌తో కమిషనరేట్‌లో డొల్లతనం బయటపడింది. రాత్రి వేళలో స్వయంగా సీపీనే నడి రోడ్డుపై మూడు గంటల పాటు నిల్చున్నా.. ఒక్క పెట్రోలింగ్ వాహనం అటు వైపు కనిపించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన కమిషనర్ సంబంధిత ఠాణా పరిధిలోని అధికారులపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలిసింది. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రయాణికులతో రద్దీగా ఉండే దిల్‌సుఖ్‌నగర్ వంటి కీలకమైన ప్రాంతంలోనే పెట్రోలింగ్ పోలీసుల నిఘా లేకపోవడం మల్కాజిగిరి కమిషనరేట్ గస్తీ తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రోడ్లపై రౌడీషీటర్ల వీరంగం..
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో మిళితమై ఉంటుంది. పట్టణ ప్రాంతాలకు పోలీసులు చేరుకోవడం కాస్త సులువే అయినా, శివార్లకు చేరుకోవడం కష్టమే. పెట్రోలింగ్ వాహనాలను, బ్లూ కోల్ట్ సిబ్బంది పెంపుతో శివార్లలోనూ గస్తీ పెట్టవచ్చు. కానీ, ఆమేరకు ఆశించినంత చర్యలు కనిపించడం లేదు. ప్రస్తుతం మల్కాజిగిరిలో 75కు పైగా పెట్రోలింగ్ వాహనాలు, రోజుకు 3 వేలకు పైగా బ్లూ కోల్ట్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య భారీగా తగ్గింది. పోలీసుల గస్తీ తగ్గడంతో రాత్రి వేళల్లో వసతి గృహాలు, పని ప్రదేశాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, మెట్రో స్టేషన్లు తదితర ప్రాంతాలలో రౌడీ షీటర్లు, డ్రగ్స్ పెడ్లర్లు వీరంగం సృష్టిస్తున్నారు. కర్మన్‌ఘాట్‌లో ఓ హోటల్‌లో బిల్లు కట్టమని అడిగిన యజమానిపై రౌడీ షీటర్లు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడమే ఇందుకు నిదర్శనం.
విమెన్ పెట్రోలింగ్ ఎక్కడ?
నిర్మానుష్య ప్రాంతాలు, మహిళా వసతి గృహాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసులు నిరంతరం తిరుగుతూ గస్తీ కాస్తుంటారు. 24/7 మహిళలకు భద్రత, రక్షణ కల్పించాలనే లక్ష్యంతో బ్లూ కోల్ట్, పెట్రోలింగ్ వాహనాల్లోనూ మహిళా సిబ్బందిని నియమించారు. బ్లూ కోల్ట్ అనేది అత్యవసర సమయంలో స్పందించే బృందం. 24/7 బైక్‌లపై తిరుగుతూ వేధింపులు, చెయిన్ స్నాచింగ్, రోడ్డు ప్రమాదాల వంటి నేరాలు జరిగినప్పుడు వేగంగా స్పందించి, ఘటనా స్థలికి చేరుకుంటారు. కానీ, కమిషనరేట్‌లో ఈ వ్యవస్థ అటకెక్కింది. అలాగే స్థానిక మహిళలు, యువతతో పాటు గేటెడ్ కమ్యూనిటీ సంఘాలతో గూఢచారి వ్యవస్థను బలోపేతం చేసుకోవడం గతంలో ప్రారంభించిన సైకిల్ పెట్రోలింగ్ వ్యవస్థ క్రమంగా తగ్గింది. పోలీసు సిబ్బంది సైకిళ్లపై గల్లీల్లో తిరుగుతూ గస్తీ కాస్తుండేవారు. ఇప్పుడా వ్యవస్థ కనిపించడంలేదు.
మాటలకే పరిమితం.. విజిబుల్ పోలీసింగ్
రాత్రిపూట రోడ్లపై రౌడీషీటర్ల వీరంగం
చిన్నారులు, మహిళల భద్రతకూ సవాళ్లు
మూలకు పడిన బైసైకిల్ పెట్రోలింగ్ వ్యవస్థ
కమిషనర్ డెకాయ్ ఆపరేషన్‌లో వెల్లడైన డొల్లతనం


