ప్రతిభ–సాంకేతికతలను విడదీయలేరు | Trump administration recently froze visas issued to foreign employees | Sakshi
Sakshi News home page

ప్రతిభ–సాంకేతికతలను విడదీయలేరు

Oct 15 2026 12:20 AM | Updated on Oct 15 2026 12:19 AM

Trump administration recently froze visas issued to foreign employees

‘పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌’ కార్య క్రమం కింద విదేశీ ఉద్యోగులకు జారీ చేసే వీసాలను ట్రంప్‌ ప్రభుత్వం ఇటీవల స్తంభింపజేసింది. ఆ నిర్ణయం ప్రసిద్ధ అమెరికన్‌ టెక్నాలజీ సంస్థలపైనే కాక, అగ్రశ్రేణి భారతీయ ఔట్‌ సోర్సింగ్‌ కంపెనీలపైన కూడా ప్రభావం చూపనుంది. అమెరికన్‌ల స్థానంలో విదేశీయులను తె చ్చుకునేందుకు ఈ ఉపాధి ఆధారిత కార్మిక పథకాలను (ఎంప్లాయ్‌మెంట్‌ బేస్డ్‌ లేబర్‌ ప్రోగ్రామ్స్‌) సాంకేతిక పరిశ్రమ దుర్వినియోగ పరుస్తోందనే కారణంపై అటువంటి నిర్ణయం తీసుకున్నట్లు అమెరికన్‌ ప్రభుత్వం సమర్థించుకుంది. 

అమెరికా ఇటువంటి స్వీయ సంరక్షణ చర్యలకు దిగడం ఇదే మొదటిసారేమీ కాదు. అమెరికా అధ్యక్ష పదవిని అలంకరిస్తున్న వారు దేశీయ రాజకీయ ప్రయోజనాల నిమిత్తం హెచ్‌–1బి వీసా లను ఒక తాయిలంలా వాడుకుంటూనే ఉన్నారు. విదేశాలలోని వారికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీలకు ఇస్తున్న పన్ను విరామాలకు స్వస్తి పలుకుతున్నట్లు 2008లో అప్పటి అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు. తర్వాత, జో బైడెన్‌ కూడా అదే పంథా అనుసరించారు. 

చవుక వనరులే అమెరికా చోదక శక్తి
తక్కువ వేతనాలకు లభించే సిబ్బంది సదుపాయాన్ని అమె రికన్‌ సాంకేతిక కంపెనీలు ఏనాటి నుంచో వినియోగించుకుంటు న్నాయి. సెమీకండక్టర్ల తయారీకి 1960లలో అవి ఆ వెసులుబా టును ఉపయోగించుకున్నాయి. అప్పట్లో ఆ పరిశ్రమకు పెద్ద సంఖ్య లో సిబ్బంది అవసరమయ్యేవారు. తర్వాత, సాఫ్ట్‌వేర్‌ సర్వీ సులు, ప్రోగ్రామింగ్‌లలోను అవి ఆ ప్రత్యేక ప్రయోజనాన్ని వదులు కోలేదు. ‘ఫెయిర్‌ చైల్డ్‌ సెమీకండక్టర్‌’ సంస్థ అధ్యక్షుడు రాబర్ట్‌ నాయస్, ఉత్పత్తి సదుపాయాలు నెలకొల్పేందుకు 1960 లలో భారత్, దాని చుట్టుపక్కల దేశాలను సందర్శించారు.

భారత్‌ అనుమతించకపోవటంతో హాంగ్‌కాంగ్‌లో వాటిని నెలకొల్పు కున్నారు. మరి కొద్ది ఏళ్ల తర్వాత ఆయన ‘ఇంటెల్‌’ను స్థాపించారు. ఎలక్ట్రానిక్స్, ఐసీ (ఇంటెగ్రేటెడ్‌ సర్క్యూ ట్స్‌) తయారీకి ఇతర అమెరికన్‌ కంపెనీలు సింగపూర్, మలేసియా, తైవాన్‌లను ఎంచు కున్నాయి. తదనంతర రెండు దశాబ్దాల్లో ఆయా దేశాలు సాంకేతిక వస్తూత్పత్తి కేంద్రాలుగా అవతరించాయి. సెమీకండక్టర్‌ డిజైన్, అమెరికన్‌ క్లయింట్లకు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులు, ప్రోగ్రామింగ్‌తో భారత్‌ 1970లు, 1980లలో ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేసింది. 

అమెరికన్‌ సాంకేతిక పరిశ్రమతో భారత్‌ ఒడంబడికలు వివిధ పునరావృతులకు లోనయ్యాయి. మార్కెట్‌ అవసరాలకు తగ్గట్లుగా అవి పరిణామం చెందుతూ వచ్చాయి. అమెరికన్‌ సంస్థల స్వల్పకాలిక లేదా మధ్యకాలిక అవసరాల నిమిత్తం భారతీయ సంస్థలు తమ         ఇంజనీర్లను అమెరికాకు పంపించడంతో ఇది చిన్నగా మొదలైంది. అమెరికాలో పని పూర్తికాగానే వారు స్వదేశానికి తిరిగి వచ్చేసేవారు. తదుపరి దశలో, అది ‘ఆన్‌సైట్‌’ మోడల్‌గా మారింది. అంటే, భారతీయ కంపెనీలు పంపిన ఉద్యోగులు అమెరికన్‌ కంపెనీల సిబ్బందిలో భాగమవుతారు. దీర్ఘకాలిక ప్రాజెక్టుల్లో పాలుపంచుకుంటారు. భారతీయ సంస్థలు అమెరికన్‌ క్లయింట్ల విశ్వాసాన్ని చూర గొని, కమ్యూనికేషన్‌ మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డ తర్వాత, ఆన్‌సైట్‌ పనిలో కొంత భాగం, భారతదేశం నుంచే చక్కబెట్టడం మొదలైంది. ఇది ‘ఆఫ్‌షోర్‌’ మోడల్‌ గా ప్రాచుర్యంలోకి వచ్చింది. 

భారత్‌ నుండి 10,000 కోట్ల డాలర్లు!
అమెరికాలో ఉంటున్న భారతీయులను నియోగించుకుని భారతీయ కంపెనీలపై ఆధార పడే బదులు, తామే భారతదేశంలో కొందరిని ఉద్యోగాల్లోకి తీసుకుని, అక్కడ నుంచే పని చేయించటం బాగుంటుందని  అమెరికన్‌ కంపెనీలు గ్రహించాయి. ఇది మరింత తక్కువ ఖర్చుతో కూడిన వ్యవహారంగా పరిణమించింది. మైక్రో సాఫ్ట్‌ 1990ల చివరలో దీనికి శ్రీకారం చుట్టింది. మరికొన్ని సంస్థలు కూడా అదే బాట పట్టాయి. బ్యాంకులు, బీమా సంస్థలు, లాజిస్టిక్స్‌ కంపెనీలు, విమానయాన సంస్థలు, న్యాయ సేవా సంస్థలు, గ్లోబల్‌ కన్సల్టింగ్‌–ఆడిటింగ్‌ దిగ్గజాలు తదితర సంస్థలు అదే తరహాననుసరించాయి. అవి తెర వెనుక చక్కబెట్ట వలసిన పనుల్లో చాలా వాటిని లేదా బిజినెస్‌ ప్రాసెస్‌లను బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, నోయిడా వంటి చోట్లకు తరలించాయి. 

ఔట్‌ సోర్సింగ్‌ వ్యాపారం గత ఇరవై ఏళ్లలో మరింత  వైవి« ద్యీ కరణకు లోనైంది. ఇంజనీరింగ్, ఆర్‌–డి, ప్రాడక్ట్‌ అభివృద్ధి వంటివి కూడా ఇందులో చేరాయి. అగ్ర సంస్థలు తమ ముఖ్య కార్య కలాపాల్లో కొన్నింటిని చక్కబెట్టేందుకు భారతదేశంలోనే విభాగా లను నెలకొల్పు కున్నాయి. ఇది పెద్ద మార్పు కింద లెక్క. కేవలం వ్యయాన్ని ఆదా చేసుకునేందుకుకాక, నవీకరణ, పరిశోధన, మేధా హక్కుల (ఐపి) సృష్టికి అవి భారత్‌లో నడుం బిగించాయి. ఈ రోజున, ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో దాదాపు ప్రతి కంపెనీకి దాని స్వీయ యాజమాన్య గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్‌ (జి.సి.సి.)లు     బెంగళూరు లేదా హైదరాబాద్‌ లలో ఉన్నాయి. అటువంటి సెంటర్లు 2025 నాటికి 2,100కి పైగా ఉన్నట్లు, అవి 23.6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు లెక్క తేలింది. అవి దాదాపు 10,000 కోట్ల  అమె రికన్‌ డాలర్ల రాబడులకు దోహద పడుతున్నాయి. 

విడదీయరాని సాంకేతిక బంధం
మెయిన్‌ ఫ్రేమ్‌ నుంచి మినీ, మైక్రో కంప్యూటర్‌ వరకు, ఇంట ర్నెట్, డాట్‌ కామ్, వై2కె, మొబైల్, సోషల్‌ మీడియా, క్లౌడ్, బిగ్‌ డేటా... ఇలా ప్రతి సాంకేతిక రూపాంతీకరణలోను భారతీయ టెక్నా లజీ కంపెనీలు కీలక పాత్ర వహించాయి. స్వయం ప్రతిపత్తితో వ్యవహరించగల కృత్రిమ మేధ (ఏఐ), వివిధ రంగాల్లో ‘డీప్‌ టెక్‌’ వాడకం మొదలవటంతో ఇపుడు కూడా అవి అదే పనిలో ఉన్నాయి. టెక్నాలజీ ఔట్‌సోర్సింగ్‌ ప్రక్రియ అమెరికా, భారత్‌లు రెండింటిలోను బాగా వేళ్లూనుకుపోయింది. దాన్ని వెనక్కి తిప్పడం అయ్యే పని కాదు. 

అమెరికా, ఇండియాలు పరస్పర ఆధారితమైనవి. వేగంగా అమలులోకి తెచ్చేందుకు, ప్రపంచవ్యాప్తంగా పనులు చేసేందుకు, స్థాయిని పెంచుకునేందుకు, ఇతర సానుకూలతలకు అగ్ర శ్రేణి టెక్‌ కంపెనీలకు భారతీయ ఇంజనీర్లు, ప్రతిభావంతుల అవసరం ఉంది. రాబడులను నిలబెట్టుకునేందుకు, యాక్సెస్‌ ఆపరేటింగ్‌ సిస్టం (విండోస్, యాపిల్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌)లకు, డెవలప్‌మెంట్‌ నిమిత్తం క్లౌడ్‌ మౌలిక వసతులకు అమెరికాతో వ్యాపారం చేయాల్సిన అవసరం భారతీయ కంపెనీలకు ఉంది. ఇది రాకపోకలు రెండింటికీ వీలున్న దారి.

ఔట్‌ సోర్సింగ్‌ బిజినెస్‌తో పాటు, అమెరికాలోని సాంకేతిక శక్తి కేంద్రం సిలికాన్‌ వ్యాలీని చాలా వరకు భారత్, చైనా, ఇతర దేశాల నుంచి వెళ్లిన ప్రతిభావంతులే నడిపిస్తున్నారు. అమెరికా, వీసాలను స్తంభింపజేసినప్పటికీ ఆ బండి నడవవలసింది ప్రతిభ, సాంకేతికతల జోడెడ్లతోనే!  

–వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత
- దినేశ్‌ సి. శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement