కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్‌ వస్తుందా? రాదా? | maintenance after separation or divorce check details | Sakshi
Sakshi News home page

కొడుకు తనకు పుట్టలేదంటున్నాడు నా భర్త : మెయింటెనెన్స్‌ వస్తుందా? రాదా?

Apr 23 2025 9:48 AM | Updated on Apr 23 2025 10:14 AM

maintenance after separation or divorce check details

లీగల్‌ 

నేను ఒక ప్రైవేట్‌ స్కూల్లో 14 వేల జీతానికి పనిచేస్తున్నాను. నాకు ఒక పాప. నా భర్తకి నెలకు 70 వేల జీతం. నాకు నయం చేయలేని వ్యాధి ఉంది. కొన్ని కారణాల వల్ల మేం గత రెండు సంవత్సరాలుగా విడి విడిగా ఉంటున్నాము. భర్తనుంచి మనోవర్తి రాలేదు. మెయింటెనెన్స్‌ కేసు వేయాలి అనుకుంటున్నాను. ఐతే, నా వ్యాధి – ఉద్యోగ రీత్యా నేను మెయింటెనెన్స్‌కు అర్హురాలిని కాదు అంటున్నారు. ఇది నిజమేనా?  - సాధన (పేరు మార్చాం), హైదరాబాద్‌

హెచ్‌.ఐ.వి. లాంటి నయం చేయలేని వ్యాధి ఉన్నాగానీ మెయింటెనెన్స్‌కు మీరు అర్హులే! మీకే కాదు, మీ పాపకి కూడా  మెయింటెనెన్స్‌ వస్తుంది. భార్యను, పిల్లలను పోషించటం భర్త బాధ్యత. ఐతే మీ ఉద్యోగం రీత్యా మీ వరకు కొంత  మెయింటెనెన్స్‌స తగ్గవచ్చు తప్ప, మీ కూతురికి తనకి సరిపడేంత మెయింటెనెన్స్‌ వస్తుంది. సెక్షన్‌ 144 బీఎన్‌ఎస్‌ ( పా సీ.ఆర్‌.పీ. సీ 125) ప్రకారం కేసు వేయండి.
 

నాకు, నా మూడేళ్ల కొడుకుకి  మెయింటెనెన్స్‌ కోరుతూ నా భర్త పై కేసు వేశాను. అతనికి నామీద అనుమానం చాలా ఎక్కువ. కాన్పుకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని వెళ్ళలేదు. ‘‘కొడుకు కూడా నాకు పుట్టలేదు, నేను మెయింటెనెన్స్‌ కట్టను’’ అంటూ వాదిస్తున్నాడు. నా కొడుకు అతడికే పుట్టాడు అని రుజువు చేసుకోవాలి అని అంటున్నారు. నాకు ఏంటి ఈ పరీక్ష? పరిష్కారం చెప్పగలరు. ఒక సోదరి, కర్నూలు 


మీరు ఎటువంటి పరీక్షలు చేయించుకోవలసిన అవసరం లేదు. బాబును అనవసర పరీక్షలకు తీసుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అభియోగం అతను మోపుతున్నాడు కదా. అతనిని రుజువు చేసుకోమని చెప్పాలి. వివాహ బంధంలో, కాపురం చేస్తున్న సమయంలో పుట్టిన పిల్లలకి తండ్రి ఆ భర్తే అని ఎవిడెన్స్‌ చట్టం లోని సెక్షన్‌ 112 కచ్చితంగా చెప్తుంది. మీరు గర్భం దాల్చిన సమయానికి మీకు, మీ భర్తకు వివాహ సంబంధం ఉన్నది అంటే చాలు. ఇదే విషయాన్ని ఇటీవలే సుప్రీంకోర్టు కూడా తేల్చి చెప్పింది. ఇలాంటి ఉపయోగాలు చేసిన భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలను చేసింది. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కోర్టు వారికి మధ్యంతర మెయింటెనెన్స్‌ కావాలి అని దరఖాస్తు పెట్టి కేసు వాదించండి. మీకు ఉచితమైన న్యాయం దొరుకుతుంది. 

– శ్రీకాంత్‌ చింతల
హైకోర్టు న్యాయవాది
 

మీకున్నన్యాయపరమైన సమస్యలు, సందేహాలకోస akshifamily3@gmail.com మెయిల్‌ చేయ వచ్చు. 

 

Advertisement
 
Advertisement
Advertisement