కొత్త కళ
చిరిగిన బట్టనైనా తొడుక్కో
ఓ మంచి పుస్తకం కొనుక్కో.. అన్నది పాత సామెత...
‘పాతబట్టలైనా ఉంచుకో...
ఓ మంచి డిజైన్‌తో మళ్లీ కొత్తగా మలుచుకో’
అన్నది ఈతరం వినిపిస్తున్న కొత్త సామెత.
ఎంత ఇష్టమైన దుస్తులైనా పాతబడక తప్పదు కాని సృజనకు పదును పెడితే కొత్త హంగులు అద్దవచ్చు... ఆ పాత జ్ఞాపకాన్ని మరోసారి నెమరేయవచ్చని చెబుతోంది మన హైదరాబాద్‌కు చెందిన చిత్రకారిణి, ప్రీతి సంయుక్త.
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రీతి సంయుక్త. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో ఇటీవలే జరిగిన ‘అంతర్జాతీయ కాంటెంపరరీ ఆర్ట్ బియెన్నాలే’లో తన వినూత్న కళా రీతితో తృతీయ విజేతగా నిలిచింది. ఈనెల 16న పురస్కారం అందుకుని నగరానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఆమె గురించి ఆమె మాటల్లోనే విందాం.
కలంకారీ అంటే ఇష్టం...
హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి 2001లో పెయింటింగ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాను. చదువుకునే రోజుల నుంచి కలంకారీ అంటే బాగా ఇష్టం. కలంకారీ, బాతిక్ పెయింటింగ్‌లపై డాక్టరేట్ కూడా చేశాను. అమెరికాలోని అలబామా వర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నప్పుడు ఒకసారి ఆఫ్రికావాసుల జీవనశైలిని దగ్గర నుంచి పరిశీలించాను. వారు వినియోగించే బొంతలు కేవలం బొంతలు కావు... వారి జీవితాలకు దిశానిర్దేశం చేసే దిక్సూచీలని తెలిసిన తర్వాత కాస్ట్యూమ్ ఆర్ట్ ఆలోచన వచ్చింది.
పాత బట్టలే రంగులుగా...
వస్త్రకళ ద్వారా మన జ్ఞాపకాలు, వ్యక్తిగత అనుభవాలకు రూపమివ్వడమే నా ఆలోచన. తాష్కెంట్‌లో నేను సమర్పించిన ఆర్ట్ సిరీస్‌ను స్టిచ్చింగ్ మెమోరీస్‌గా పేర్కొనడానికి కారణం ఇదే. ఈ ఆర్ట్ వర్క్‌లో పెయింటింగ్‌కు ఉపయోగించే కాన్వాస్‌లలో కలర్లు ఏవీ ఉండవు. వాటికి బదులుగా గుడ్డ ముక్కలు ఉంటాయి. ఓ రకంగా ఇది కూడా కుట్టుపనే. ఇప్పటికి 40కిపైగా కళాకృతులు నా దగ్గర ఉన్నాయి అన్నారు ప్రీతి.
– సత్యబాబు, సాక్షి


