పదవి సత్యం... పార్టీ మిథ్య!

Position Is True Party Is False This May Be Theory Of Goa MLAs - Sakshi

అవును... పదవి సత్యం... పార్టీ మిథ్య. దక్కిన అధికారం సత్యం... ఆడినమాట మిథ్య. గోవా రాష్ట్ర ఎమెల్యేల సిద్ధాంతం ఇదే కావచ్చు. కొన్నేళ్ళుగా ప్రతి అసెంబ్లీ కాలవ్యవధిలోనూ ఇదే తంతు. బుధవారం నాడు ఎనిమిది మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరిపోవడం అచ్చంగా అందుకు మరో ఉదాహరణ. గోవా సహా అనేక రాష్ట్రాల్లో కమలనాథులు సాగిస్తున్న అధికార అశ్వమేధంలో ఇది మరో అంకం. ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని తమలో కలిపేసుకొని, కాషాయ జెండా కప్పడం ఎనిమిదేళ్ళుగా అప్రతిహతంగా సాగుతున్నదే. గతంలో 2018లో అరుణాచల్‌ ప్రదేశ్, 2019లో కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021లో పశ్చిమ బెంగాల్‌... ఇలా ప్రతి చోటా అనర్హత వేటుకు దొరక్కుండా సాగుతున్న ఈ రాజకీయ ప్రహసనం పార్టీ ఫిరాయింపుల చట్టానికి పెద్ద వెక్కిరింత. మన రాజకీయ వ్యవస్థలోని లోపానికీ, ముందే తెలిసినా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ప్రతిపక్షాల అసమర్థతకూ పరాకాష్ఠ.

చిన్న చిన్న నియోజకవర్గాల గోవాలో ఒక పార్టీకీ, సిద్ధాంతానికే కట్టుబడే రాజకీయ పాతివ్రత్యం పట్ల ప్రజాప్రతినిధులకు పెద్దగా నమ్మకం కనిపించదు. కొద్ది వేల ఓట్లను చేతిలో పెట్టుకున్న నేతల చుట్టూనే ఆ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. దాంతో, ఇన్నిసార్లు పార్టీ రంగులు మారుస్తున్నా ఓటర్లు ఛీ కొడతారనే భయమూ వారికి లేదు. ఇక ఆరునూరైనా అధికారంలో ఉండాల్సిందేనన్న బీజేపీ అజెండా పుణ్యమా అని ‘ఆయా రామ్‌... గయా రామ్‌’ సంస్కృతి ఇటీవల ప్రబలింది. క్రితం అసెంబ్లీలో ఏకంగా మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చారు. ఈసారి గెలిచి ఆరు నెలలైనా కాక ముందే అధికార విరహం భరించలేక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి దూకారు. 
తాజా గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ పక్షాన గెలిచింది 11 మంది. వారిలో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువగా 8 మంది వెళ్ళి బుధవారం బీజేపీలో చేరడంతో సాంకేతికంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వీరికి వర్తించదు. కానీ, ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ఆలయాల్లో, దర్గాల్లో, చర్చిల్లో దేవుడి ఎదుట పార్టీ ఫిరాయించబోమంటూ ఇదే ఎమ్మెల్యేలు చేసిన ప్రమాణాలు ఏమైనట్టు? అదేమంటే, ‘గుడికి వెళ్ళి, దైవాజ్ఞ మేరకే పార్టీ మారాను’ అంటూ హస్తం గుర్తుపై గెల్చిన దిగంబర్‌ కామత్‌ లాంటి వాళ్ళు నైతికమైన ఈ తప్పును సమర్థించుకోవడమే అమితాశ్చర్యం. ఢిల్లీ నుంచి ఏ దేవుడు చెబితే వీళ్ళు మారినట్టు? మారకపోతే జాగ్రత్తంటూ ఏ సీబీఐ, ఈడీల బెత్తం చూపి బెదిరిస్తే, మారినట్టు? ఆ దేవుడు ఏ వరాలు ప్రసాదిస్తే మారినట్టు? ఇవన్నీ జవాబులు తెలిసిన ప్రశ్నలు. 

ప్యాకేజీలతోనో, పదవులతోనో, మాట వినకుంటే కేంద్ర సంస్థల దర్యాప్తులతోనో... ఎలాగైతేనేం ప్రతిపక్ష సభ్యుల్ని కంచె దాటి తమ వైపు వచ్చేలా చేసుకొనే కళలో కొన్నాళ్ళుగా ఆరితేరింది. బీజేపీ, దాని పెద్దలు అదే పనిగా ఇస్తున్న పిలుపు – ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’. కానీ, గత ఎనిమిదేళ్ళలో అనేక రాష్ట్రాల్లో వరుసగా సాగుతున్న ‘ఆపరేషన్‌ కమలం’ చూస్తుంటే, ఎక్కడా ఏ ప్రతిపక్షమూ లేని ‘ప్రతిపక్ష ముక్త్‌ భారత్‌’ కాషాయ పార్టీ మనసులో కోరిక అని అర్థమవుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా సాగే ఎన్నికల్లో ఒక పార్టీని ఓడించి, మరో పార్టీ గెలవాలనుకోవడం వేరు. కానీ, అసలు ప్రశ్నించే గొంతు, ప్రతిపక్షమే లేకుండా అంతా తామై ఏకపక్షంగా రాజ్యం చేయాలనుకోవడం వేరు. అప్పుడది ఏకస్వామ్యమే తప్ప ప్రజాస్వామ్యమైతే అనిపించుకోదు. వాజ్‌పేయి లాంటి నేతల హయాంలో కొన్ని విలువలకు పేరున్నపార్టీగా ఒకప్పుడు అందరూ అనుకున్న బీజేపీ దురదృష్టవశాత్తూ ఇప్పుడవన్నీ వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది.

ఈ వ్యవహారంలో బీజేపీతో పాటు ప్రతిపక్షాల తప్పూ లేకపోలేదు. కమలనాథుల అధికారపు ఆకలి తెలిసీ, తమ వర్గం వారిని ఒక కట్టుగా ఉంచుకోలేక పోవడం పూర్తిగా ప్రతిపక్ష వైఫల్యమే. గోవాలో ఇప్పుడు మిగిలిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా ఎన్నాళ్ళు ఈ గట్టునే ఉంటారో చెప్పలేం. మాజీ సీఎం కామత్, ప్రస్తుత ప్రతిపక్ష నేత మైఖేల్‌ లోబో – ఇద్దరూ వెళ్ళిపోవడంతో కాంగ్రెస్‌కు ఇప్పుడక్కడ నాయకత్వం లేకుండా పోయింది. నిజానికి, జూలైలోనే ఇదే కామత్‌ – లోబో జంట ఎమ్మెల్యేల మూకుమ్మడి వలసకు యత్నించింది. తీరా అంతా కలసి అయిదుగురే అవడంతో ఫిరాయింపుల నిరోధక వేటు పడుతుందని ఆఖరి నిమిషంలో అది ఆగింది. ఆ సంగతి తెలిసినా గత రెండు నెలల్లో ఈ ఎమ్మెల్యేల వేటను ఆపడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. సంక్షోభ నివారణలో ఆ పార్టీ నేతల అసమర్థతకు ఇదో మచ్చుతునక. 

రాహుల్‌ గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ చేపట్టి వారం తిరగక ముందే గోవా లాంటి ఘటన ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. యాత్ర మరిన్ని రాష్ట్రాల మీదుగా సాగే కొద్దీ మరిన్ని దొంగదెబ్బలను కాంగ్రెస్‌ కాచుకోవాల్సి ఉంటుంది. గత నెలలో జార్ఖండ్‌లో ఆఖరి నిమిషంలో ఆగిన ఫిరాయింపులపై బీజేపీ ఈసారి దృష్టి పెట్టవచ్చు. ఈ దుష్ట ఫిరాయింపుల సంస్కృతికి అడ్డుకట్ట ఎలా వేయాలన్నది ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ప్రజాప్రాతినిధ్య, ఫిరాయింపుల నిరోధక చట్టాలను నిర్వీర్యం చేస్తున్న లొసుగులను సరిదిద్దాలని పార్టీలన్నీ పట్టుబట్టాలి. పార్టీ మారే ప్రబుద్ధులను రీకాల్‌ చేసే అవకాశం లేనందున, తదనంతర ఎన్నికల్లో వారిని ఓడించి బుద్ధిచెప్పాలనే చైతన్యం ఓటర్లలో రావాలి. అలా కాక సరసంలో, రాజకీయ సమరంలో అంతా సమంజసమే అనుకొంటేనే కష్టం. ఏ గుర్తుపై గెలిచామన్నది కాదు.... ప్రభుత్వంలో ఉన్నామా లేదా అన్నది ముఖ్యం అన్న చందంగా రాజకీయాలు తయారైతే, ఎన్నికల ప్రజాస్వామ్యంలో అంతకు మించిన అపహాస్యం మరొకటి లేదు. గోవా ఉదంతం మరోసారి గుర్తు చేస్తున్న సంగతి అదే!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top