నెట్టింట బిక్కవోలు లక్ష్మీగణపతి | Sakshi
Sakshi News home page

నెట్టింట బిక్కవోలు లక్ష్మీగణపతి

Published Fri, Mar 29 2024 2:20 AM

-

అనపర్తి: చెవిలో చెప్పగానే భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దైవంగా అనపర్తి నియోజకవర్గంలోని బిక్కవోలు గ్రామంలో స్వయంభూగా వెలసిన శ్రీలక్ష్మీ గణపత్తి ప్రసిద్ధికెక్కారు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు...జిల్లాలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అనేకమంది అభ్యర్థులు, ఆశావహులు ఈ స్వామిని దర్శించి తమ కోర్కెలు విన్నవించుకోవడం పరిపాటి. అయినే 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రారంభం కాకముందే లక్ష్మీ గణపతి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు. బుధవారం రాత్రి బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటిచగానే స్వామి వారు ఒక్కసారిగా మళ్లీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశారు. సుమారు రెండు సంవత్సరాల క్రితం ప్రస్తుత అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిల మధ్య చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిరువురూ బిక్కవోలు లక్ష్మీగణపతి సమక్షంలో చేసుకున్న సత్య ప్రమాణాలు అప్పట్లో వార్తల్లోకి ఎక్కాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ విడుదల చేసిన మొదటి జాబితాలో నల్లమిల్లి పేరు ప్రకటించి కూడా చివరకు టికెట్‌ హుష్‌కాకి కావడంతో అప్పట్లో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి స్వామి సమక్షంలో చేసిన (అ)సత్య ప్రమాణం ఫలితమే ఇదని, లక్ష్మీగణపతి మహిమే అంటూ నెట్టింట జోరుగా పోస్టులు వెలిశాయి. దేవుడు ఉన్నాడని మరోసారి రుజువైందని పోస్టులు, కామెంట్లతో సోషల్‌ మీడియాలో హోరెత్తించారు.

Advertisement
Advertisement