భారతి ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతి మిత్తల్‌కు ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ ''షెవాలియర్ డె ల్ ఓర్డ్రే నేషనల్ డే లా లెజియన్ డి ఆనర్'' (Knight of the National Order of the Legion of Honour) గౌరవంతో సత్కరించనున్నట్లు ప్రకటించారు.
ఇది 1802లో నెపోలియన్ బోనపార్ట్ స్థాపించిన.. లెజియన్ ఆఫ్ ఆనర్ ఫ్రెంచ్ రిపబ్లిక్ ప్రదానం చేసే అత్యున్నత పౌర పురస్కారం. భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చూపిన దీర్ఘకాలిక నిబద్ధతకు, అలాగే టెలికమ్యూనికేషన్స్ అండ్ డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సాధించిన విశిష్ట విజయాలకు గుర్తింపుగా ఈ గౌరవాన్ని మిత్తల్‌కు ప్రకటించారు.
ఈ సందర్భంగా భారత్‌లో ఫ్రాన్స్ రాయబారి థియెరీ మాథూ మాట్లాడుతూ.. "సునీల్ భారతి మిత్తల్ ముప్పై ఏళ్లకుపైగా కాలంగా ఫ్రాన్స్‌కు నిజమైన స్నేహితుడిగా ఉన్నారు. 1992లో ఎయిర్‌టెల్ ప్రారంభ దశ నుంచే ఆయనకు ఫ్రాన్స్‌తో అనుబంధం ఉంది. ఈ సంబంధాలను ఆయన ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తూ, ఇండియా - ఫ్రెంచ్ వ్యాపార భాగస్వామ్యంతో ఎంతటి విజయాలు సాధించవచ్చో చూపించారు. ప్రస్తుతం ఆయన యూటెల్‌సాట్ ఉపాధ్యక్షునిగా కొనసాగుతూ.. శాటిలైట్ అండ్ డిజిటల్ సాంకేతిక రంగాల్లో భారత్-ఫ్రాన్స్ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ లెజియన్ ఆఫ్ ఆనర్ పురస్కారం ద్వారా ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశంలో ఫ్రాన్స్‌ను దీర్ఘకాలిక భాగస్వామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేసిన ఒక గొప్ప వ్యాపార నాయకుడిని సత్కరిస్తున్నారు" అని అన్నారు.
ఈ గౌరవంపై స్పందించిన సునీల్ భారతి మిత్తల్ మాట్లాడుతూ.. ''ఫ్రాన్స్ రిపబ్లిక్ అందించిన ఈ విశిష్ట గౌరవానికి నేను ఎంతో కృతజ్ఞుడిని. 1992లో ఎయిర్‌టెల్ ప్రారంభమైనప్పుడు.. భారతదేశంలో మొబైల్ టెలిఫోనీని ప్రవేశపెట్టినప్పటి నుంచి నా ఫ్రాన్స్ అనుబంధం ప్రారంభమైంది. ప్రస్తుతం యూరోపియన్ శాటిలైట్ సంస్థ యూటెల్‌సాట్ సహాధ్యక్షునిగా ఆ బంధం కొనసాగుతోంది. ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి నా కట్టుబాటును మరోసారి పునరుద్ఘాటిస్తూ ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నాను'' అని పేర్కొన్నారు.
ఈ పురస్కారానికి సంబంధించిన అధికారిక చిహ్నాన్ని 2026 అక్టోబర్ 28, బుధవారం, న్యూఢిల్లీలోని ఫ్రెంచ్ రాయబార కార్యాలయంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు. కాగా ఇప్పటికే 2007లో మిత్తల్ గారికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ పురస్కారం లభించింది. 2024లో ఆయన బ్రిటిష్ సామ్రాజ్యంలోని అత్యున్నత గౌరవాల్లో ఒకటైన "నైట్ కమాండర్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (KBE)" బిరుదును కింగ్ చార్ల్స్ III చేత స్వీకరించిన తొలి భారత పౌరుడిగా గుర్తింపు పొందారు.


