ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్‌ చేసుకోండి.. | House Rent Allowance component of your salary that helps cover the cost of renting a home Here key rules and conditions | Sakshi
Sakshi News home page

ఇంటి అద్దె చెల్లిస్తున్నారా.. ప్లాన్‌ చేసుకోండి..

Jan 20 2025 8:42 AM | Updated on Jan 20 2025 10:11 AM

House Rent Allowance component of your salary that helps cover the cost of renting a home Here key rules and conditions

మీరు ఉద్యోగస్తులైతే, మీకిచ్చే జీతభత్యాల్లో బేసిక్, డీఏ, ఇంటద్దె అలవెన్సులు, ఇతర అలవెన్సులు ఉంటాయి. గవర్నమెంటు, పబ్లిక్‌ సంస్థల్లో అయితే, వారివారి రూల్స్‌/ఒప్పందం ప్రకారం ఉంటాయి. అలాగే చెల్లిస్తారు. మీ ప్రమేయమే ఉండదు. ఇచ్చింది.. ఇచ్చినట్లు తీసుకోవాలి. ప్రైవేట్‌ సంస్థల్లో కొంచెం వెసులుబాటు ఉండొచ్చు. అక్కడ కూడా బలమైన ఉద్యోగ సంస్థలుంటే మన పప్పులుడకవ్‌! మీరు ఆ సంస్థలో ఎంతో ముఖ్యమైన వ్యక్తులైతే, ఉద్యోగిగానే కొనసాగుతుంటే బేరసారాలతో పాటు అలవెన్సుల సంగతిలోనూ వెసులుబాటు అడగవచ్చు. ఆ గొడవలన్నీ పక్కన పెడితే, యజమాని ఇచ్చే ‘ఇంటద్దె అలవెన్సు’ జీతంలో ఒక అంశం. మొత్తం జీతభత్యాలతో కలిసి ఉంటుంది. ఈ అలవెన్సును ఆదాయంగా పరిగణిస్తారు. పన్నుకి గురి అవుతుంది. అయితే, అద్దె ఇంట్లో ఉంటూ, మీరు అద్దె ఇచ్చినట్లయితేనే చట్టప్రకారం మినహాయింపు లభిస్తుంది. ఈ అలవెన్సు ఉద్దేశం, మీరు ఆ మొత్తం ఇచ్చి అద్దె ఇంట్లో ఉండటం. అద్దె కోసం ఆ మొత్తాన్ని వినియోగించడం జరగాలి.  

  • ఈ మినహాయింపు పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి.

  • మీరు ఆ సంస్థలో ఉద్యోగిగానే ఉండాలి.

  • మీరు అద్దె ఇంట్లోనే ఉంటూ అద్దె చెల్లిస్తుండాలి.

  • అద్దె చెల్లిస్తున్నట్లు కాగితాలు, రుజువులు ఉండాలి.

  • సొంత వ్యాపారస్తులకు, వృత్తి ఉన్నవారికి ఇది వర్తించదు.

  • అద్దె అంటే వసతి కోసం ఇచ్చే అద్దె, నిర్వహణ ఖర్చులు మాత్రమే. కరెంటు చార్జీలు, నీటి చార్జీలు మొదలైనవి కావు.

  • సొంత ఇంట్లో ఉంటూ ఈ మినహాయింపు పొందకూడదు. కుటుంబ సభ్యులతో ఉంటూ అద్దె చెల్లించకపోతే ఈ మినహాయింపు ఇవ్వరు.

  • ఇచ్చే జీతభత్యాల్లో ఈ అలవెన్సు లేకపోతే ఎటువంటి మినహాయింపు ఇవ్వరు.

  • ఈ మూడింట్లో తక్కువ దాన్నే మినహాయిస్తారు. 
    (a) వచ్చిన అలవెన్సు 
    (b) చెల్లించిన అద్దెలో నుంచి 10 శాతం జీతం తీయగా, మిగిలిన మొత్తం 
    (c) మెట్రో నగరాల్లో జీతంలో 50 శాతం, ఇతర ప్రాంతాల్లో జీతాల్లో 40 శాతం

  • చెల్లించినట్లు రుజువు కావాలి. అవసరమైతే అగ్రిమెంటు, మీ బ్యాంకు అకౌంటు, ఓనర్‌ పాన్‌ కార్డు, ఓనర్‌ బ్యాంకు అకౌంటు, రశీదులు మొదలైనవి కావాలి.

  • ఆ ప్రాంతంలో సొంత ఇల్లు ఉండకూడదు.  

  • మీరు ఎక్కడ పని చేస్తున్నారో ఆ ప్రాంతంలో అద్దె చెల్లించాలి.

ఈ విధంగా మీరు ప్లాన్‌ చేసుకోవచ్చు

  • భార్యభర్తలు ఒకే ఇంట్లో కాపురం ఉంటూ ఇద్దరూ మినహాయింపు పొందకండి. ఇద్దరూ వేర్వేరు అగ్రిమెంటు ద్వారా పెద్ద ఇల్లు తీసుకుంటే ఎక్కువ అద్దె అయితే, అగ్రిమెంట్లు వేరు, చెల్లింపులు వేరు, రశీదులు వేరు, లెక్కలు వేరు.

  • ఒక్కరే ఉద్యోగి అయి, మిగతావారు ఓనర్‌ అయితే, అగ్రిమెంటు రాసుకోండి. చెల్లింపులు సక్రమంగా చేయండి. పాన్‌ తీసుకోండి. అటు పక్క వ్యక్తికి సంబంధించిన ఇన్‌కంట్యాక్స్‌ లెక్కల్లో ఆదాయంగా చూపించండి.

  • అలాగే తల్లిదండ్రుల దగ్గర ఉన్నా, మావగారింట్లో చూరు పట్టుకు వేళ్లాడుతున్నా.. అగ్రిమెంట్లు ముఖ్యం. చెల్లింపులు, రశీదులు, లెక్కలు పక్కాగా ఉండాలి.

  • దొంగ ఇంటి నంబర్లు వేసి క్లెయిమ్‌ చేయకండి.

  • మీ ఇంటికి మీరే ఓనర్‌ అని ఎడమ చేత్తో సంతకం పెట్టి క్లెయిమ్‌ చేయకండి.

  • హైదరాబాదులాంటి మహానగరంలో స్వంత ఇల్లు ఉండగా అద్దె ఇంట్లో ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. స్వంత ఇల్లు మీద అద్దె ఆదాయంగా చూపిస్తూ, క్లెయిమ్‌ చేయండి.

కె.సి.హెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, కె.వి.ఎన్‌.లావణ్య, ట్యాక్సేషన్‌ నిపుణులు

Advertisement
 
Advertisement
Advertisement