అక్టోబర్ 28 కేబినెట్ భేటీపైనే అందరి చూపు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యం (డీఏ) పెంపు ప్రకటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు ఏటా రెండుసార్లు (జనవరి, జులైల్లో) సవరించే డీఏ పెంపునకు సంబంధించి ఈసారి నిర్ణయం ఆలస్యం కావడంతో ఉద్యోగ వర్గాలన్నీ తదుపరి కేంద్ర కేబినెట్ సమావేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.
వచ్చే మంగళవారం, అక్టోబర్ 28, 2026న జరగనున్న కేంద్ర మంత్రివర్గ సమావేశంలో డీఏ పెంపునకు అధికారిక ఆమోదం లభిస్తుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేబినెట్ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో డీఏ, డీఆర్ పెంపునకు ఆమోదం లభించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే ఈ ప్రకటన వస్తుందని భావించినప్పటికీ తదుపరి కేబినెట్ సమావేశం వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అక్టోబర్ 28 నాటి భేటీలో దీనికి ఆమోదం లభిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగ సీజన్‌లో భారీ ఊరట లభించడంతో పాటు బకాయిలతో సహా అదనపు ప్రయోజనాలు అందనున్నాయి. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఉద్యోగులు మరికొన్ని రోజులు నిరీక్షించక తప్పదు.
డీఏ ఎంత పెరుగతుందంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈసారి కరవు భత్యం 3 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ గణాంకాల ఆధారంగా ఈ పెంపును లెక్కిస్తారు. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులకు డీఏ 60 శాతంగా ఉంది. ఒకవేళ ప్రభుత్వం 3 శాతం పెంపునకు ఆమోదం తెలిపితే మొత్తం డీఏ రేటు 63 శాతానికి చేరుకుంటుంది. ఈ పెంపుదలను ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి తెస్తారు కాబట్టి, జులై నుంచి అక్టోబర్ వరకు ఉన్న నాలుగు నెలల కాలానికి సంబంధించిన బకాయిలు కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.
ఈ 3 శాతం పెంపు వల్ల ఉద్యోగుల బేసిక్ పేని బట్టి జీతం పెరుగుతుంది. ఉదాహరణకు, బేసిక్ పే రూ.18,000 ఉన్న ఉద్యోగికి నెలకు రూ.540 అదనంగా వస్తుంది. అలాగే బేసిక్ పే రూ.44,900 ఉన్నవారికి నెలకు రూ.1,347, రూ. 50,000 బేసిక్ పే ఉన్నవారికి నెలకు రూ.1,500 వరకు జీతం పెరుగుతుంది. అయితే, ఈ పెంపుపై ఇంకా కేంద్ర కేబినెట్ అధికారిక ఆమోదం తెలపాల్సి ఉంది.
ఇదీ చదవండి: స్వల్ప వ్యవధిలోనే వెండి రూ.30,000 డౌన్!


