నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గం
గూండాలను తెచ్చి పుంగనూరులో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం
పుంగనూరు: రాష్ట్రంలో రెడ్బుక్ పేరుతో చంద్రబాబు, లోకేశ్ అరాచకాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వకుండా వైఎస్సార్సీపీ అభ్యర్థులను టీడీపీ గూండాలు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అభ్యర్థులను నామినేషన్ కేంద్రానికి తీసుకెళ్లిన ఎంపీ మిథున్రెడ్డిపై టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో దాడులు చేసి, విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.
శాంతియుతమైన పుంగనూరుకు బయట ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకొచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. టీడీపీ ప్రజావిశ్వాసం కోల్పోయిందని.. దీనిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.


