కసాపురంలో ఉగాది ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

కసాపురంలో ఉగాది ఉత్సవాలు

Published Mon, Apr 8 2024 1:25 AM

ఉత్సవాలకు సిద్ధమైన ఆలయం - Sakshi

రేపటి నుంచి ప్రారంభం

గుంతకల్లు రూరల్‌: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం ఉగాది ఉత్సవాలకు ముస్తాబైంది. మంగళవారం నుంచి క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఆలయ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్ధీపాలతో అలంకరించారు. బెంగుళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలతో ప్రాంగణం మొత్తం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణం, గంగా నిలయం వద్ద చలువ పందిళ్లు వేశారు. ప్రధాన గోపురం ఎదుట ఉన్న రెండు పార్కులను సుందరీకరించారు. గుంతకల్లు మున్సిపాలిటీ నుంచి నిరంతరంగా నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. మూడు రోజుల పాటు ఆలయ ప్రాంగణలో వేర్వేరుగా రెండు మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యూలైన్లతో పాటు అదనపు ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

9న గ్రామోత్సవం..

ఉగాది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 9న తొలిరోజు గ్రామోత్సవం ఉంటుంది. సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి గ్రామంలోని శమీ వృక్షం వరకూ గ్రామోత్సవం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ ముఖ మంటపం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆలయ వేద పండితులు పంచాంగాన్ని చదివి క్రోధి నామ సంవత్సర ఫలాలను వినిపించనున్నారు.

10న రథోత్సవం..

ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10వ తేదీ స్వామివారి రథోత్సవం ఉంటుంది. అలాగే ఈ నెల 11న లంకాదహనం కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. దాదాపు రెండు గంటల పాటు జరిగే లంకాదహనం ఉత్సవాన్ని చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు హాజరు కానున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేసిట్లు ఆలయ ఈఓ భద్రాజీ తెలిపారు.

నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌
1/1

నెట్టికంటి ఆంజనేయస్వామి మూలవిరాట్‌

Advertisement
Advertisement