breaking news
Wicket-keeper
-
దొరకునా ఇటువంటి దోశ!
‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్–కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే కొశ్చెన్ వస్తుంది. ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే... పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు. కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి. ‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లు. -
‘వృద్ధి’మాన్‌భవ...
అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం జట్టులో స్థానం సుస్థిరం ఆరేళ్ల క్రితం తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడిన భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... ఇప్పటివరకూ ఆడిన టెస్టుల సంఖ్య కేవలం 17. ధోని టెస్టు క్రికెట్ నుంచి ఆకస్మికంగా 2014 డిసెంబరులో వైదొలిగే సమయానికి సాహా అనుభవం కేవలం రెండు టెస్టు మ్యాచ్‌లే. 2010లో మూడు వన్డేలు, 2014లో ఆరు వన్డేలు ఆడాడు. కారణం... మహేంద్ర సింగ్ ధోని. భారత వన్డే కెప్టెన్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా ఆడటంతో అవకాశాలు లేక ఎదురుచూసిన ఎంతోమంది వికెట్ కీపర్లలో ఒకడు సాహా. నిజానికి ధోనికి గాయమైతే తమకు అవకాశం దొరుకుతుందని ఎంతోమంది ఆశగా ఎదురుచూసిన రోజులవి. అవకాశాలు రాకపోచినా... సాహా నిరాశపడలేదు. తనకు ఏదో ఒక ‘మంచి’రోజు వస్తుందని ఆశగా ఎదురుచూశాడు. ఇంతకాలానికి 32 ఏళ్ల వయసులో అతనికి తగిన గుర్తింపు, గౌరవం లభించాయి. సాక్షి క్రీడావిభాగం సహనం... ఈ పదానికి పర్యాయపదం సాహా. జట్టులో పాతుకుపోయిన ధోని ఓ వైపు... ఒకవేళ ధోని విశ్రాంతి తీసుకున్నా దినేశ్ కార్తీక్, పార్థీవ్ పటేల్‌లాంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న వికెట్ కీపర్లతో పోటీ మరోవైపు. నిజానికి గత ఎనిమిదేళ్లలో భారత క్రికెట్లో వికెట్ కీపర్ల బాధ మాటల్లో చెప్పడం కష్టం. ఎంత మంచి ఇన్నింగ్స ఆడినా అవకాశం దొరికేది కాదు. కీపింగ్‌లో ఎంత నైపుణ్యం ఉన్నా ఫలితం దక్కేది లేదు. నిజానికి దీనికి ఎవరినీ తప్పు పట్టడానికి కూడా లేదు. పరిస్థితులు అలా ఉన్నాయి. అయినా సాహా ఓపికగా రంజీ మ్యాచ్‌లు ఆడుతూనే కాలం గడిపాడు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడాడు. అవకాశం వస్తుందో రాదో తెలియదు, భారత జట్టుకు ఆడతాడో లేదో అనే సందేహం... అయినా ఓపికగా ఎదురు చూశాడు. కీపర్‌గా ఉత్తమం ఓ పెద్ద క్రికెటర్ స్థానంలో మరో ఆటగాడు జట్టులోకి వస్తే కచ్చితంగా ఇద్దరినీ పోల్చి చూస్తారు. ధోని టెస్టుల నుంచి రిటైర్ కావడానికి ముందు లభించిన అరకొర అవకాశాలను సాహా అందిపుచ్చుకోలేకపోయాడు. నాలుగు ఇన్నింగ్సల్లో కలిపి 74 పరుగులు చేశాడు. నిజానికి ఓ కొత్త క్రికెటర్‌కు ఇది చెత్త ప్రదర్శనేం కాదు. కానీ ధోనితో పోలిక వల్ల ఈ 74 పరుగులు కనిపించలేదు. అయితే కీపర్‌గా మాత్రం సాహా అందరినీ ఆకట్టుకున్నాడు. ధోని కంటే ఎక్కువ వేగంతో వికెట్ల వెనక కదిలాడు. 2014లో కెప్టెన్ ధోని టెస్టుల నుంచి తప్పుకోవడంతో అవకాశం వచ్చినా... ఆస్ట్రేలియాలో ఆడిన రెండు టెస్టుల్లో ఓ మాదిరిగానే ఆడాడు. అయితే కీపర్‌గా మాత్రం వందకు వంద మార్కులు తెచ్చుకున్నాడు. నిజానికి ఉపఖండం బయట కంటే స్వదేశంలో కీపింగ్ చేయడం చాలా కష్టం. స్పిన్నర్లు వేసే బంతులు ఎప్పుడు ఎలా టర్న్, బౌన్స అవుతాయో తెలియదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలి. బ్యాట్స్‌మన్‌గా అంతంత మాత్రంగానే ఆడినా వికెట్ కీపింగ్‌లో పేరు తెచ్చుకోవడంతో సాహా జట్టులో కొనసాగాడు. మలుపు తిప్పిన విండీస్ పర్యటన తాజాగా వెస్టిండీస్‌లో భారత పర్యటనలో సాహా పరిస్థితి చాలా భిన్నం. నిజానికి అశ్విన్ బౌలర్, సాహా బ్యాట్స్‌మన్. కానీ బ్యాటింగ్ ఆర్డర్లో అశ్విన్ ముందుగా వచ్చేవాడు. కెప్టెన్, కోచ్‌లకు అశ్విన్‌పై ఉన్న నమ్మకం వల్ల ఇలా జరిగి ఉండొచ్చు. కానీ ఇదే సమయంలో సాహా పరిస్థితినీ అర్థం చేసుకోవాలి. అరుుతే ఏమాత్రం నిరాశ చెందని సాహా వెస్టిండీస్ పర్యటనలో చాలా బాగా ఆడాడు. అశ్విన్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. వరుసగా రెండు టెస్టుల్లో 40, 47 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే సాహా కెరీర్‌ను మలుపు తిప్పిన ఇన్నింగ్స మూడో టెస్టు (గ్రాస్ ఐలట్)లో వచ్చింది. సాహా క్రీజులోకి వచ్చే సమయానికి భారత్ 126 పరుగులకు ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అశ్విన్‌తో కలిసి ఓపికగా ఇన్నింగ్‌సను నిర్మించాడు. అశ్విన్ కంటే మెరుగైన స్టయిక్ రేట్ (45.81)తో సెంచరీ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ పేసర్లు కొత్త బంతితో విసిరిన సవాళ్లను అలవోకగా అధిగమించాడు. ఈ సెంచరీతో భారత టెస్టు జట్టులో ఒక రకంగా అతను పాతుకుపోయాడు. ఈడెన్‌లో ‘వండర్’ న్యూజిలాండ్‌తో కాన్పూర్ టెస్టు తొలి ఇన్నింగ్సలో సాహా డకౌట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్సలో బ్యాటింగ్ అవకాశం రాలేదు. ఇక కోల్‌కతాలో తన సొంతగడ్డపై మాత్రం సాహా వరుసగా రెండు ఇన్నింగ్సలోనూ అద్భుతం చేశాడు. బ్యాటింగ్ చేయడం చాలా క్లిష్టంగా ఉన్న పిచ్‌పై టెయిలెండర్ల సహాయంతో ఇన్నింగ్‌సను నిలబెట్టాడు. చివరి నాలుగు వికెట్లకు బౌలర్లతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 200 దగ్గర తడబాటుతో కనిపించిన భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. రెండో ఇన్నింగ్సలోనూ అర్ధసెంచరీతో భారత ఆధిక్యాన్ని పెంచాడు. భారత ప్రధాన బ్యాట్స్‌మెన్ ఆడటానికి తడబడ్డ పిచ్‌పై అతను అలవోకగా పరుగులు చేయడంతో పాటు రెండు ఇన్నింగ్సలోనూ నాటౌట్‌గా నిలిచాడు. లోయర్ ఆర్డర్లో బౌలర్ల సహకారంతో ఇన్నింగ్స నడిపే ఆటగాడి పాత్రను తను సమర్థంగా పోషించాడు. నిజానికి సాహా సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అయితే బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి క్రికెట్ అవకాశాల కోసం కోల్‌కతా వచ్చే వందలాదిమందిలో ఒకడిలా అతను కూడా వచ్చేశాడు. చిన్న వయసులోనే కోల్‌కతాలో స్థిరపడటం ద్వారా బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సాహా కెరీర్ మొత్తం ఎంతో సహనంతో సాగింది. కెరీర్లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, అవకాశాలు వచ్చినా రాకపోయినా అతను ప్రశాంతంగానే ఉండేవాడు. ఎందుకంటే అతని పూర్తి పేరు వృద్ధిమాన్ ప్రశాంత సాహా. -
అంతా సచిన్ పుణ్యమే...
* మాస్టర్ జోక్యంతోనే సారథినయ్యా * ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటా ఎంఎస్ ధోని వ్యాఖ్య నాటింగ్‌హామ్: ఎంఎస్ ధోని... భారత క్రికెట్ జట్టుకు అత్యంత విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న ఆటగాడు.. క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించే వంద కోట్లకు పైగా భారతీయుల ఆకాంక్షలను గత ఏడేళ్లుగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మోస్తున్న మిస్టర్ కూల్. జట్టును టెస్టుల్లో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే కాకుండా టి20, వన్డే ప్రపంచకప్‌లు, చాంపియన్స్ ట్రోఫీ అందించి అభిమానులను అలరించిన నాయకుడు. అయితే ఇన్ని విజయాలకు కారణం మైదానంలో అత్యంత సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకోవడమే కారణమని ధోని చెబుతున్నాడు. ప్రస్తుత స్థానం గురించి తనకే ఆశ్చర్యంగా ఉందని, వికెట్ కీపర్‌గా కొనసాగుతున్న తాను సచిన్ టెండూల్కర్ జోక్యంతోనే జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టగలిగానని చెప్పుకొచ్చాడు. ఆదివారం 33వ పుట్టిన రోజు జరుపుకున్న ధోని ఓ ఇంటర్వ్యూలో పలు అంశాల గురించి చెప్పిన విషయాలు అతడి మాటల్లోనే.... నేనేదీ ప్లాన్ చేసుకోను: వాస్తవానికి నేను ఏ విషయం గురించి ముందుగా ప్రణాళికలు రచించను. అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలపై నాకు నమ్మకముంటుంది. చాలామందికి ఈ విషయంలో తమ గురించి తమకు సరైన పరిజ్ఞానం ఉండదు. ఇప్పటిదాకా ఆడిన అన్ని రకాల క్రికెట్ కారణంగానే కాకుండా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాల వల్లే నాకీ స్వభావం వచ్చింది. సీనియర్ల సలహాలు విన్నాను: సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, గంగూలీలాంటి దిగ్గజాలున్న జట్టుకు నేను నాయకత్వం వహించాను. అయితే ఆ సమయంలో నేను వారి అనుభవాన్ని ఉపయోగించుకున్నాను. వారిచ్చే సలహాలను స్వీకరించాను. ఒకవేళ వారు చెప్పిన దాంతో విభేదిస్తే అప్పుడే వారికి ఆ విషయం చెప్పేవాణ్ణి. దీన్ని వారు కూడా అంగీకరించి కొద్ది సేపటికి మరో ఐడియాతో వచ్చి నిర్ణయాన్ని నాకు వదిలేసేవారు. ఇది నిజంగా వారి గొప్పతనం. నా నిజాయతీ, ముక్కుసూటి తనం నచ్చడం వల్లే వారు నాకు సహకరించగలిగారు. అంతా టెండూల్కర్ చలవే: నేను కెప్టెన్‌గా అయిన క్షణం చాలా ఆశ్చర్యపోయా. అసలు నేను ఏనాడూ ఆ లక్ష్యాన్ని పెట్టుకోలేదు. అంతకుముందు నేను సచిన్‌తో మాట్లాడిన తీరు వల్లే ఈ అవకాశం వచ్చి ఉండొచ్చు. బౌలింగ్‌లో సచిన్ చాలా వైవిధ్యమైన బంతులు వేయగలడు. అతడు బంతి తీసుకున్నప్పుడల్లా నా దగ్గరకు వచ్చి బ్యాట్స్‌మన్‌కు లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్, సీమ్ అప్‌లో ఎలాంటి బంతులు వేయాలి? అని అడిగేవాడు. నేనిచ్చిన సూచనల మేరకు... ఇతడు ఆటను బాగా అర్థం చేసుకోగలుగుతున్నాడని సచిన్ భావించి ఉంటాడు. రిటైరయ్యాక అదే పని చేస్తా: మ్యాచ్ గెలిచిన ప్రతీసారి స్టంప్‌ను తీసుకోవడం నాకు అలవాటు. ఓడిన మ్యాచ్ విషయంలో ఇది పట్టించుకోను. నేను ఆట నుంచి తప్పుకున్నాక నా మ్యాచ్‌ల వీడియోలన్నింటినీ చూస్తాను. స్టంప్స్ మీదున్న స్పాన్సర్ లోగోలను నిశితంగా పరీక్షిస్తే అది ఏ మ్యాచ్‌కు సంబంధించిన స్టంప్ అనేది తెలిసిపోతుంది. రిటైరయ్యాక ఇదే నా టైమ్ పాస్.