breaking news
weaving works
-
చేనేత సంఘాలకు అవినీతి మరక!
సాక్షి, రామన్నపేట(నల్గొండ) : చేతివృత్తులలో ప్రధానమైనది చేనేత. దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమంది కార్మికులకు ఉపాధి కల్పి స్తోంది చేనేత పరిశ్రమే. అటువంటి చేనేత పరిశ్రమను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సహకార వ్యవస్థను రూపొందించింది. చేనేత పరిశ్రమ అభివృద్ధి కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు ఎనలేని కృషి చేయారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఆ చేతివృత్తి పరిశ్రమ ఇప్పుడు అవినీతి ఆరోపణల్లో కొట్టుమిట్టాడుతోంది. ఎంతో సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన చేనేత సహకార సంఘాలు చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో.. యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత జౌళిశాఖ ఆధ్వర్యంలో మొత్తం 24 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాల్లో కలిపి 3600మంది వాటాదారులు ఉన్నారు. సహకారేతర రంగంలో మరో 3600మంది చేనేత కార్మికులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 5600 జియోట్యాగ్ వేయబడిన మగ్గాలు ఉన్నాయి. జియోట్యాగ్ వేయబడిన మగ్గాల ద్వారా 16,800మంది అనుబంధ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. కానీ ఇటీవలి కాలంలో చేనేత సహకార వ్యవస్థ క్రమేపి నిర్వీర్యమై పోతుంది. చేనేత సహకార సంఘాల నిర్వహణపై అవినీతి ఆరోపణలు రావడం, ఆరోపణలు వచ్చిన సంఘాల పాలక వర్గాల బాధ్యతలను నిలిపి వేసి విచారణల పేరుతో స్పెషలాఫీసర్లను నియమించడంతో ఆ సంఘాలు పూర్తిగా కుదేలు అవుతున్నారు. ఆర్డర్ ఫారాల ద్వారా పని కల్పించవలసిన సంఘాలకు అవినీతి మరక అంటుకోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు. సగం సంఘాలపై ఆరోపణలు జిల్లాలో 24 చేనేత సహకార సంఘాలు ఉండగా వాటిలో సగం సంఘాలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఐదు చేనేత సంఘాలు సెక్షన్ 51 విచారణను ఎదుర్కొంటుండగా మ రో నాలుగు సంఘాలలో పిటిషన్ ఎంక్వయిరీ నడుస్తోంది. పోచంపల్లి, సిరిపురం, ఇంద్రపాలనగరం, నేలపట్ల, వెలువర్తి సంఘాలపై సెక్షన్ 51 ఎంక్వయిరీ నడుస్తోంది. ఆలేరు, పుట్టపాక, రామన్నపేట సిల్క్, చౌటుప్పల్ సంఘాలపై పిటిషన్ ఎంక్వయిరీ కొనసాగుతోంది. మరో నా లుగు సంఘాలలో సాధారణ విచారణ జరుగుతోంది. సెక్షన్ 51 ఎంక్వయిరీ నడుస్తున్న సంఘాల పాలకవర్గాల స్థానంలో చేనేత జౌళిశాఖకు చెందిన డవలప్మెంట్ అధికారులను పర్సన్ ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. విచారణను ఎదుర్కొంటున్న సంఘాలలోని వాటా దారులకు సరైన ఉపాధి దొరకడం లేదు. తాము నేసిన వస్త్రాలను ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. పైగా ఆ సంఘాల్లోని వస్త్రాలను కొనుగోలు చేయడానికి టెస్కో ప్రోక్యూర్మెంట్ అధికారులు సైతం ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. అవినీతి ఆరోపణలకు కారణాలు.. సాధారణంగా పాలకవర్గాలు బ్యాంకులు ఇచ్చే క్యాష్క్రెడిట్ను డ్రా చేసి సొంతంగా వాడుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడం ద్వారా, వాటాదారుడికి ఆర్డర్ ఫారంపై అతడికి తెలియకుండానే వస్త్రాలు అమ్మినట్లు రికార్డ్‌చేసి వచ్చే లాభంను వాడుకోవడం, ప్రభుత్వ సబ్సిడీలను దుర్వినియోగపరచడం వంటి సందర్భాల్లో ఆరోపణలు వస్తుంటాయి. అటువంటి ఆరోపణలు తీవ్రంగా వచ్చినప్పుడు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 లోని 51 సెక్షన్ ప్రకారం విచారణ జరుపుతారు. 51 సెక్షన్ ప్రకారం విచారణ.. సంఘాల నిధులు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో, సంఘం నిర్వహణపై 2/3వంతు సభ్యులు విచారణ కోరినప్పుడు లేదా సంఘం నిర్వహణపై రిజిస్ట్రార్ అసంతృప్తిగా ఉన్న సందర్భంలో తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964లోని 51వ సెక్షన్ ప్రకారం విచారణ జరపాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో జిల్లా చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు విచారణ అధికారిగా వ్యవహరిస్తారు. ఆరోపణలు తీవ్రంగా ఉన్న సందర్భంలో కమిషర్చే నియమించబడిన అధికారిచే విచారణ కొనసాగుతుంది. విచారణ నివేదికను సర్వసభ్య సమావేశాల్లో చర్చించి బాధ్యులపై చర్యలకు తీర్మానం చేస్తారు. చేనేత పరిశ్రమలో ఉమ్మడి జిల్లా ప్రసిద్ధి.. ఉమ్మడి నల్లగొండ జిల్లా చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందింది. పోచంపల్లి, పుట్టపాక పట్టు చీరలు, సిరిపురం బెడ్షీట్లు, మోత్కూరు, గుండాలలో ఉత్పత్తి అయ్యే దోవతులు, టవళ్లు, కొయ్యలగూడెం, వెల్లంకి, బోగారం, ఆలేరు, భువనగిరి ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే డ్రెస్ మెటీరియల్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. విచారణ కొనసాగుతోంది అవినీతి ఆరోపణలు వచ్చిన సంఘాల పనితీరుపై విచారణ కొనసాగుతోంది. ఐదు సంఘాలపై సెక్షన్ 51 ఎంక్వయిరీ జరుగుతోంది. ఇప్పటి వరకు ఒక సంఘం విచారణ పూర్తయింది. నాలుగు సంఘాలపై ఇంకా పిటిషన్ ఎంక్వయిరీ నడుస్తోంది. విచారణ నడుస్తున్న సంఘాలలోని సభ్యులకు పని కల్పించడానికి ప్రత్యేక అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం త్రిఫ్డ్స్కీం, నూలు సబ్సిడీ పథకాలు అమలు అవుతున్నాయి. – వెంకటేశ్వర్లు చేనేత జౌళిశాఖ సహాయ సంచాలకుడు, యాదాద్రిభువనగిరి -
చేనేత కార్మికులకు బీమా యోజన
ఏలూరు : జిల్లాలో ఐదువేల మంది చేనేత కార్మికులకు మహాత్మాగాంధీ బంకర్ బీమా యోజన పథకాన్ని అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ వెల్లడించారు. తన చాంబర్లో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో చేనేత కార్మికుల కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలు తీరుపై ఆయన సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీమా యోజనకు ఇప్పటివరకూ 3,390 మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పా రు. చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులందరినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల్లో భాగస్వాముల్ని చేయాలని చేనేత, ఔళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో 3,094 మంది వృద్ధ చేనేత కార్మికులు పింఛను పొందుతున్నారని, 569 మంది ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. అంత్యోదయ అన్నయోజన కింద 160 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందుతుండగా, మరో 164 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే వారికి ఆ పథకాన్ని వర్తింప చేస్తామన్నారు. పాలకొల్లు మండలం దగ్గులూరులో 340 మంది చేనేత కార్మికులు సంఘంగా ఏర్పడి చేనేత వస్త్రాలను ఉత్ప త్తి చేసేందుకు ముందుకొచ్చారన్నారు. వా రికి ప్రభుత్వం రూ.49 లక్షలు మంజూరు చేసిందని కలెక్టర్ తెలిపారు. మొదటి విడతగా యంత్రాలకు రూ.16.32 లక్షలు విడుదల చేసినట్టు చెప్పారు. ఉత్పత్తి ప్రారంభించిన తరువాత మిగిలిన సొమ్ము మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో 15 చేనేత ప్రాథమిక సహకార సంఘాల ద్వారా రూ.62.64 లక్షలను సాయంగా అందించామని పేర్కొన్నారు. 2013-14 సంవత్సరానికి సంబంధించి వీవర్స్ సొసైటీలకు సబ్సిడీపై నూలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 800 చేనేత కార్మిక కుటుంబాలకు వ్యక్తిగత రుణాలు అందించేందుకు వీవర్స్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నామన్నారు. 2014-15 సంవత్సరానికి 300 మందికి హ్యాండ్లూమ్ వీవర్స్ త్రిఫ్ట్ ఫండ్ అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఆధునాతన డిజైన్లలో శిక్షణ తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లులో ఏర్పాటు చేసిన నైపుణ్యం అభివృద్ధి కేం ద్రాల్లో 250 మంది చేనేత కార్మికులకు శిక్షణ అందించనున్నట్టు కలెక్టర్ చెప్పారు. సంప్రదాయ వస్త్రాలతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధునాతన డిజైన్లతో వస్త్రాలు ఉత్పత్తి చేసేవిధంగా శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ, చేనేత, ఔళి శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డి.పవన్‌కుమార్, వీవర్స్ సొసైటీ సెంటర్ ఉప సంచాలకులు వి.నాట్యాల్, డీసీఏవో వి.త్రిమూర్తులు, ఆప్కో సహాయ మార్కెటింగ్ అధికారి టి.కోటేశ్వరరావు, ఎల్ఐసీ విజ యవాడ సీనియర్ బ్రాంచి మేనేజర్ బి.గోపీప్రసాద్, ఐసీఐసీఐ కో-ఆర్డినేటర్ ఐ.ఏడుకొండలు పాల్గొన్నారు.