breaking news
Union Budget 2017
-
స్థిరాస్తి అమ్మితే పన్ను తగ్గుతోంది!!
హోల్డింగ్ పీరియడ్‌ను రెండేళ్లకు తగ్గించిన ఫలితం బేస్ ఇయర్‌ను మార్చటం వల్ల కూడా లాభమే కేంద్రం తాజా బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం స్థిరాస్తి విక్రయాల సందర్భంలో పన్ను భారం తగ్గబోతోంది. అది ఎలానో చూద్దాం.. దీర్ఘకాలిక వ్యవధి తగ్గింపు స్థిరాస్తి అమ్మే విషయంలో ప్రస్తుతం హోల్డింగ్ వ్యవధి కనీసం 3 సంవత్సరాలు ఉండాలి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వ్యవధి రెండేళ్లకు తగ్గించారు. దీని వలన కలిగే ఊరట ఎలా ఉంటుందో చూద్దాం. ఉద్యోగస్తులు బదీలీల వలన ఊరు మారవలసి వస్తుంటుంది. వ్యాపారస్తులు, వృత్తి నిపుణులు అవసరాన్ని బట్టి వలసపోతుంటారు. ఊరు మారకపోయినా ప్రతి కుటుంబంలో వాళ్ల వాళ్ల ప్రాధాన్యతలుంటాయి. పిల్లల పెళ్లి, చదువులు, అప్పలబారి నుంచి బయటపడటం ఇలా... ఇప్పుడు వ్యవధి తగ్గించడం వలన కొన్న తేదీ నుంచి రెండేళ్లు దాటితే విక్రయించి 30 శాతం బదులుగా 20 శాతం పన్ను భారంతో బయటపడొచ్చు. లేదా ప్లానింగ్ ద్వారా పన్ను భారం లేకుండా చూసుకోవచ్చు. బేస్ సంవత్సరం మారింది... ప్రస్తుతం 1981వ సంవత్సరం ఆదిగా లేదా బేస్‌గా తీసుకొని క్యాపిటల్ గెయిన్స్ లెక్కించేవారు. 1981కి ముందు ఏర్పడ్డ స్థిరాస్తుల వాల్యుయేషన్ విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సరైన కాగితాలు, రుజువులు లేక వాల్యుయేషన్ తక్కువకి సరిపెట్టుకోవలసి వస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరాన్ని 2001గా మార్చారు. దీని వలన పన్ను భారం తగ్గటమే కాకుండా కాగితాలు తదితర రుజువులు పొందొచ్చు. దీంతో అసెస్మెంట్లు సజావుగా జరుగుతాయి. ఈ కింది ఉదాహరణ చూడండి.. 1991లో కొన్న ధర రూ.10,00,000..... అప్పటి ద్రవ్యోల్బణ ఇండెక్స్ రేటు 199. 2017–18లో అమ్మకం ధర రూ.80,00,000.... 2017–18 ద్రవ్యోల్బణ ఇండెక్స్ రేటు 1,200 ఇండెక్స్‌ను పరిగణనలోకి తీసుకున్నాక స్థిరాస్థి కొనుగోలు వ్యయం.... కొన్న ధర ్ఠ అమ్మిన ఏడాది ఇండెక్స్ / కొన్న ఏడాది ఇండెక్స్ 10,00,000 ్ఠ 1,200 / 199 = 60,30,150; లాభం=రూ.19,69,850 ఈ లాభంపై మీ ఆదాయపు పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే మీరు గనక ఆ భూమిని అభివృద్ధి చేయటానికేవైనా ఖర్చులు పెట్టినట్లయితే వాటినీ మొత్తం వ్యయంలో చూపించొచ్చు. బేస్ సంవత్సరాన్ని 2001గా మారిస్తే కలిగే లాభమిదీ... 1991లో కొన్న ధర 2001లో రూ.30,00,000 అనుకోండి... 2001–02లో ద్రవ్యోల్బణ ఇండెక్స్ రేటు 426 2017–18లో అమ్మకం ధర రూ.80,00,000... 2017–18లో ఇండెక్స్ రేటు 1,200 రూ.30,00,000 1,200/426 = రూ.84,50,704 అవుతుంది. అమ్మిన ధర కన్నా కొన్న ధర ఎక్కువగా ఉంది కాబట్టి పన్ను భారం లేదు. ఇలా లబ్ధి పొందొచ్చు. జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇన్నాళ్లూ జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ సంతకం అయిన రోజునే భూమి యజమాని మీద క్యాపిటల్ గెయిన్స్ విధించేవారు. ఎన్నో సందర్భాల్లో ప్రాజెక్టు పూర్తి కాకపోవటం, డెవలపర్ పారిపోవడం, కనిపించకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఇల్లు చేతికి రాకముందే పన్ను భారం పడేది. ఇక నుంచి ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత మాత్రమే పన్ను భారం విధిస్తారు. -
రూ.3 లక్షలకు పైన నగదు తీసుకుంటే
ఇక జరిమానా బాదుడు! 100 శాతం జరిమానా విధింపు.. ∙ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి న్యూఢిల్లీ: రూ.3 లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరి మానా రూపంలో సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నిబంధన వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017–18 కేంద్ర బడ్జెట్ సందర్భంగా అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయమై అధియా ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... రూ.3 లక్షలకు మించి నగదు తీసుకుంటే, దానికి సమాన మొత్తంలో తీసుకున్న వారు జరిమానా చెల్లించాల్సి ఉంటుం దన్నారు. ఉదాహరణకు రూ.4 లక్షల నగదు లావాదేవీ జరిపితే జరిమానా రూ.4 లక్షలు చెల్లించాలని, రూ.50 లక్షల లావాదేవీ అయితే జరిమాన రూ.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా ఒకరు ఖరీదైన వాచీని నగదుపై కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడే పన్ను చెల్లించాల్సి ఉంటుందని అధియా తెలిపారు. ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు. డీమోనిటైజేషన్ నల్లధనం నిల్వల్ని లెక్కల్లోకి తీసుకొచ్చేలా చేసిందని, భవిష్యత్తులోనూ నల్లధన చలామణిని నియంత్రించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. భారీ నగదు లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం పట్టుకుంటుందని, అలాగే నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను కూడా మూసివేస్తుందన్నారు. లెక్కల్లో చూపని ఆదాయాన్ని ప్రజలు పర్యాటక సందర్శనలు, కార్లు, వాచీలు, ఆభరణాల వంటి సంపన్న వస్తువులు కొనుగోలుపై వెచ్చిస్తుంటారని, కొత్త నిబంధనల కింద ఇటువంటి మార్గాలకు చెక్ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకి పాన్ నంబర్ పేర్కొనాలన్న పాత నిబంధన ఇకపైనా కొనసాగుతుందన్నారు.