బ్యూటీ ప్యాంట్స్...
మొన్నటివరకు వదులుగా ఉండే సల్వార్, నిన్నటి వరకు మరీ కుచ్చులుగా ఉండే పటియాల, ఈ మధ్యలో వచ్చి కాళ్లను అతుక్కుపోయిన లెగ్గింగ్, జెగ్గింగ్... ఇవన్నీ మనకు తెలిసినవే. ఇక వీటి కాలం పూర్తయింది. వీటి స్థానంలో పలాజో, సిగరెట్, కెప్రీ, పెన్సిల్ స్టైల్ ప్యాంట్స్ వచ్చేశాయి. ఈ యేడాది స్టైల్లో కొత్తపుంతలు తొక్కుతూ ఇవే అతివల హాట్ ఫేవరేట్ అయ్యాయి.
పెన్సిల్దే ఫస్ట్ ప్లేస్
స్లిమ్ ప్యాంట్స్ అనీ, స్కిన్నీ ప్యాంట్స్ అనీ పెన్సిల్ ప్యాంట్‌కు మారుపేర్లు. దీంతోనే నిన్నమొన్నటి సల్వార్ కమీజ్ను పెన్సిల్ సూట్ అనే పేరు మార్చేసినంతటి ఘనత ఈ ప్యాంట్స్‌కు వచ్చింది. ఇటీవలి ట్రెండ్‌లో నిలిచిన ఘనత దీనిదే. సల్వార్కి వదులుగా, ఫిట్‌గా ఉండే ప్యాంట్స్‌ని వాడతారు. పెన్సిల్ సూట్ అయితే కేవలం టైట్‌గా ఫిట్‌గా ఉండే ప్యాంట్స్నే ధరిస్తారు. వీటినే లేడీస్ లెగ్ అని కూడా అంటారు. పెన్సిల్ సూట్లో అద్భుతమైన బీడ్స్, అద్దకం, జర్దోసీ, జరీ వర్క్స్ కూడా ఉపయోగిస్తున్నారు. రోజూ క్యాజువల్‌గా ధరించే సింపుల్ సూట్స్ కూడా ఇందులో వస్తున్నాయి. పెన్సిల్ ప్యాంట్స్‌లో నడుము భాగం చక్కగా అమరుతుంది. నాజూకు శరీరానికి చక్కగా అమరేలా ఎక్కడా అదనపు క్లాత్ కనిపించనట్టుగా ఉంటుంది. ఈ పెన్సిల్ ప్యాంట్స్ మీదకు రెగ్యులర్ కుర్తాలు కూడా ధరించవచ్చు.
పలాజో ఓ రివాజు
బెల్‌బాటమ్ ప్యాంట్స్ నుంచి పుట్టుకొచ్చిన స్టైల్ 1960, 1970ల కాలం నాటిదే! 1960లో ఈవెనింగ్ వేర్ అంటే స్కర్ట్ మోడల్ పలాజో ఉండాల్సిందే! కిందటేడాది నుంచే పలాజో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ ఈ యేడాది మరీ ఊపందుకుంది. నడుము నుంచి వంటిని అతుక్కున్నట్టు ఉన్నా, పాదం దగ్గర వెడల్పుగా రావడం (వైడ్-లెగ్గ్డ్ కఫ్డ్ ట్రౌజర్) అప్పటి స్టైల్. ఆ మోడల్లోనే డిజైనర్లు ఎన్నోమార్పులు తీసుకువచ్చారు. పలాజో ప్యాంట్స్ నడుము దగ్గర నుంచి కాలి మడమల వరకు ఒక క్రమబద్ధమైన ఫ్లెయిర్ ఉంటుంది. ఆ తర్వాత మోకాళ్ల దగ్గర లెంగ్త్ పెంచారు. హారమ్ ప్యాంట్స్ మాదిరి నడుము కింది నుంచి మడమల వరకు లూజ్‌గా ఉంటాయి.
కెప్రీస్ అల్వేస్!
వీటినే లాంగ్/ త్రీ క్వార్టర్/ కామ్ డిగ్గర్స్/ మిడ్ కాఫ్/అని రకరకాల పేర్లున్నాయి. మోకాళ్ల కింద వరకు ఉండే ఈ ప్యాంట్లను ఆడ-మగ ఇద్దరూ ధరిస్తున్నారు. ఈ ప్యాంట్ 1948లో ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ వెలుగులోకి తెచ్చారు. 1960 మొదటి రోజుల్లో గ్రేస్ కెల్లీ అనే అమెరికన్ యాక్టర్ సినిమాల్లో ధరించింది. అటు నుంచి అన్ని దేశాల వారికీ ఫేవరేట్‌గా మారింది. దీంట్లో ఉండే సౌకర్యం, స్టైల్ వల్ల లింగ భేదం లేకుండా ఆకట్టుకుంటూనే ఉంది. కొద్దిపాటి మార్పులతో కుర్తాకు బాటమ్‌గా సంప్రదాయంగా ఒదిగిపోయింది. టీ షర్ట్స్ వంటి ఆధునిక దుస్తులకూ హంగులు అద్దింది.
సిగరెట్ ప్యాంట్
కెప్రీ ప్యాంట్‌కు పుట్టిన ఈ డిజైన్ లెగ్గింగ్ తర్వాత వచ్చిన జెగ్గింగ్కి అడ్వాన్డ్స్ అని చెప్పవచ్చు. డెనిమ్ జీన్స్ నుంచి మంచి ఫాల్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నింటితోనూ వీటిని డిజైన్ చేస్తున్నారు. గొట్టంలా పై నుంచి కింద వరకు ఒకే విధంగా కనిపించడం వల్లే ఆ పేరు వచ్చి ఉంటుంది. వీటిలోనే కొద్దిగా వదులుగా ఉండే ప్యాంట్స్ రావడం ఈ యేటి ఫ్యాషన్. వీటిలోనే జిప్పర్, బటన్ స్టైల్‌వి వచ్చాయి.
- ఎన్.ఆర్
డిజైనర్ టిప్స్
యూరప్, ఇటలీ ఫ్యాషన్ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని సరికొత్త డిజైన్స్‌తో ఆకట్టుకుంటున్నారు విదిష. ఫ్యాషన్ డిజైనర్‌గా నేటికాలానికి తగ్గట్టుగా ప్యాంట్స్ వాడకంలో మెలకువలు చెబుతున్నారు. ఫ్యాబ్రిక్: ప్యాంట్స్‌ను ఎంచుకునేటప్పుడు సరైన క్లాత్, రంగు.. దృష్టిలో పెట్టుకోవాలి. స్త్రీ స్వభావానికి దగ్గరగా ఉండే పట్టు, షిఫాన్.. వంటి మంచి ఫ్లెయిర్ ఉన్న ఫ్యాబ్రిక్స్ పలాజో ప్యాంట్స్‌కు నప్పుతాయి. లినెన్, కాటన్ వంటి ఫ్యాబ్రిక్స్ కెప్రీస్, పెన్సిల్, సిగరెట్ ప్యాంట్స్కైతే బాగుంటాయి. ఈ తరహా ఫ్యాబ్రిక్స్‌లో మీరు తెలివివంతులుగా, షార్ప్‌గా కనిపిస్తారు.
టాప్స్: మంచి రంగు, ఫ్యాబ్రిక్ ప్యాంట్స్ ఎంచుకోగానే సరికాదు, దానికి సరైన టాప్ ధరించినప్పుడే లుక్ కరెక్ట్‌గా కనిపిస్తుంది. మంచి ఫిటింగ్‌తో టాప్, పైన ఓవర్‌కోట్ ఉన్నది ధరిస్తే హుందాగా కనిపిస్తారు. పలాజో ప్యాంట్‌కు ఫ్లోవీ టాప్ (స్లీవ్‌లెస్) ధరిస్తే అందంగా కనిపిస్తారు.
నడుముకు సరైన ఎంపిక: పలాజో లేదా ఇతర ప్యాంట్స్ ధరించినప్పుడు మీ నడుము లెంగ్త్‌పైన దృష్టి వెళుతుంది. అందుకని, నడుముభాగం విశాలంగా ఉంటే పొట్టిగా ఉండే టాప్స్ అస్సలు వేసుకోకూడదు. అలాగే టాప్స్‌ని టక్ చేయకూడదు. లో-వెయిస్ట్ ప్యాంట్ ఎంచుకొని, వాటి మీదకు పొడవాటి కుర్తా ధరించాలి.
ఇతర అలకంరణ: పలాజో ప్యాంట్ చాలా వైవిధ్యమైనది. అందుకని సందర్భానుసారం ధరిస్తేనే బాగుంటుంది. క్యాజువల్ పలాజోకి అయితే బ్యాలెట్ ప్లాట్స్ ఎంచుకోవాలి. ఫార్మల్ అయితే ఆకట్టుకునే టాప్, ఒక క్లచ్, హీల్స్ ధరిస్తే చాలు. ఇతర ప్యాంట్స్ ధరించినప్పుడూ పైన టాప్‌ను దృష్టిలో పెట్టుకొని దానిని డామినేట్ చేయని అలంకరణ వస్తువులు ఉపయోగించాలి.
మేకప్: చాలా సహజంగా ఉండాలి. మేకప్ మీరు ధరించిన డ్రెస్‌ను అధిగమించేలా అస్సలు ఉండకూడదు.
ప్రింట్లు: పెద్ద పెద్దవి, అస్సలు ప్రింట్లు లేని పలాజోలు, కెప్రీస్, సిగరెట్, పెన్సిల్ ప్యాంట్స్ ఎంచుకోవాలి. మంచి రంగు గల లైట్ షేడ్స్ ప్యాంట్స్ ఎప్పుడూ బెస్ట్.
- విదిష, ఫ్యాషన్ డిజైనర్