breaking news
sanaga
-
శనగ ఎన్‌బీఈజీ–452 విత్తనం విడుదల
నంద్యాల(అర్బన్): శనగలో ఎన్‌బీఈజీ–452 అనే కొత్త రకం విత్తనం విడుదలైందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జయలక్ష్మి తెలిపారు. స్థానిక పరిశోధన స్థానం కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జేజీ–11కు ప్రత్యామ్నాయంగా ఎన్‌బీఈజీ–452 రకాన్ని విడుదల చేశామని చెప్పారు. ఈ రకం ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుందన్నారు. ఎండు తెగులును తట్టుకుంటుందన్నారు. ఇది గింజ నాణ్యతలో జేజీ–11ను పోలి ఉంటుందని పేర్కొన్నారు. నాణ్యమైన ఫౌండేషన్, టీఎల్ విత్తనాలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పొందవచ్చని ఆమె తెలిపారు. టీఎల్ విత్తనం ధర కిలో రూ.95 ఉండగా, ఫౌండేషన్ విత్తనం కిలో రూ.100 చొప్పున లభిస్తుందని చెప్పారు. విత్తనాల కోసం రామరాజు (9866884486), లోకేశ్వరరెడ్డి (9996477936)ని సంప్రదించాలని సూచించారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
అక్టోబర్‌లో విత్తన పప్పుశనగ పంపిణీ
40 శాతం రాయితీతో అందజేయనున్న ప్రభుత్వం రైతు చెల్లించాల్సింది రూ.4,813 అనంతపురం అగ్రికల్చర్: రబీలో పప్పుశనగ సాగు చేసే రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ధర కూడా నిర్ణయించారు. పూర్తి ధర, రాయితీ, రైతు వాటా ఎంతనే వివరాలు బుధవారం కమిషనరేట్ నుంచి జిల్లా వ్యవసాయశాఖకు ఉత్తర్వులు అందాయి. క్వింటా విత్తన పప్పుశనగ పూర్తి ధర రూ.8,021 కాగా అందులో 40 శాతం అంటే రూ.3,208 రాయితీ వర్తింపజేశారు. రైతులు తమ వాటాగా క్వింటాకు రూ.4,813 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది జిల్లాకు 75 వేల క్వింటాళ్లు విత్తనం కేటాయించిన విషయం తెలిసిందే. అయితే అదనంగా 25 వేల క్వింటాళ్ల పప్పుశనగ విత్తనాలు కేటాయించాలని ఇటీవల వ్యవసాయశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. అక్టోబర్ మొదటి వారంలో పంపిణీ మొదలుపెట్టే అవకాశం ఉందని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపారు. పది రోజుల్లో సీజన్ ప్రారంభం జిల్లాలో రబీ అక్టోబర్ నుంచి ప్రారంభం కానుంది. రబీలో వర్షాధారంగా పప్పుశనగ ప్రధానపంట కాగా నీటి వసతి కింద వేరుశనగ, వరి, మొక్కజొన్న వర్షాధారంగా జొన్న, ధనియాలు, పొద్దుతిరుగుడు, ఉలవ తదితరలు పంటలు మొత్తమ్మీద 1.50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు వేసే అవకాశం ఉంది. అందులో కేవలం పప్పుశనగ సాధారణంగా 70 నుంచి 80 వేల హెక్టార్లలో వేస్తుండగా ఈ సారి ఎంతలేదన్నా లక్ష హెక్టార్ల వరకు సాగులోకి రావచ్చని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖరీఫ్‌లో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా వేరుశనగ, పత్తి, ఆముదం, ఇతరత్రా ప్రత్యామ్నాయ పంటల విస్తీర్ణం తగ్గిపోవడంతో రబీ విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పప్పుశనగ వేయడానికి నల్లరేగడి భూములు కలిగిన ప్రాంతాల్లో పొలాలు ఇప్పటికీ ఖాళీగానే పెట్టుకున్నారు. పప్పుశనగ సాగుకు అక్టోబర్ అనూకుల సమయమని శాస్త్రవేత్తలు చెబుతున్నా... వర్షాలపై నమ్మకం లేని రైతులు సెప్టెంబర్ చివరి వారంలోనే విత్తనం వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. 27 మండలాల్లో పంపిణీ జిల్లా వ్యాప్తంగా నల్లరేగడి భూములు కలిగిన 30 నంచి 34 మండలాల్లో పప్పుశనగ సాగులోకి వస్తుంది. అందులోనూ ఉరవకొండ, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం ప్రాంతాల్లో ఎక్కువ విస్తీర్ణంలో వేయనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది 27 మండలాల్లో విత్తన పంపిణీకి వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో అనంతపురం, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, తాడిపత్రి, పెద్దపప్పూరు, పుట్లూరు, యల్లనూరు, గుత్తి, యాడికి, శింగనమల, పెద్దవడుగూరు, పామిడి, బెళుగుప్ప, గుంతకల్లు, విడపనకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు, కణేకల్లు, బొమ్మనహాళ్, డి.హీరేహాళ్, రామగిరి, కనగానపల్లి, రొద్దం, పెనుకొండ, హిందూపురం, పరిగి, లేపాక్షి మండలాలు ఉన్నాయి. ఈ సారి కూడా ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతిలోనే విత్తనాలు పంపిణీ చేయనున్నారు. నల్లరేగడి భూములున్న రైతులకు విస్తీర్ణంను బట్టి గరిష్టంగా ఒకటిన్నర క్వింటాళ్లు విత్తనం ఇవ్వనున్నారు. ఒక ఎకరాలోపుంటే 25 కిలోలు కలిగిన ఒక బస్తా, రెండు ఎకరాల్లోపు భూమి ఉన్న వారికి రెండు బస్తాలు, మూడు ఎకరాల్లోపున్న రైతులకు మూడు బస్తాలు, నాలుగు ఎకరాల్లోపున్న రైతులకు నాలుగు, ఐదు అంతకు మించి ఉన్న రైతులకు ఐదు బస్తాల విత్తనం ఇస్తారు. ఇలా గరిష్టంగా ఒకటిన్నర క్వింటాళ్లు ఇవ్వనున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.