breaking news
Priya Software
-
ఆన్లైన్లో ‘పంచాయతీ’
సాక్షి, మంచిర్యాల : గ్రామ పంచాయతీలను గాడిలో పెట్టేందుకు తెలంగాణ సర్కారు క్రియాశీల కార్యాచరణ రూపొందించింది. ఆన్లైన్ ద్వారా పంచాయతీలను ఇంటర్నెట్తో అనుసంధానించి వన్‌స్టాప్ సర్వీస్ సెంటర్లుగా తీర్చిదిద్దే కసరత్తు సాగుతోంది. ఆయా గ్రామ పంచాయతీలలో కొత్త సేవలను ప్రవేశపెట్టడంతోపాటు ఆదాయ, వ్యయాలను సమీక్షించేందుకు రంగం సిద్ధం చేసింది. తాజాగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె.తారాకరామారావు గ్రామ పంచాయతీల ఆన్లైన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని ఆదేశించడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. పంచాయతీ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్(ప్రియా) సాఫ్ట్‌వేర్‌తో 2011-12 నుంచి తాజా ఏడాది వరకు జరిగిన లావాదేవీలన్నీ ఆన్లైన్లో పొందుపర్చాలని ప్ర భుత్వం ఆదేశించింది. ఇటీవలి కాలం వరకు మందకొడిగా సాగిన ఈ ప్రక్రియ తాజాగా మంత్రి సమీక్ష నేపథ్యంలో వేగం అందుకుంది. పంచాయతీల ఆన్లైన్ ప్రక్రియ జిల్లాలో మూడు దశల్లో అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా జిల్లాలోని 866 గ్రామపంచాయతీలను 580 క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్లో జనాభా, కనెక్టివిటీ ఆధారంగా 2 లేదా 3 గ్రామపంచాయతీలు ఉంటాయి. 580 క్లస్టర్లకు గాను 145 క్లస్టర్లకే కంప్యూటర్లు అందజేశారు. మండలానికి ఒకటి చొప్పున 52 మండలాలకు, మిగతావి క్లస్టర్ గ్రామపంచాయతీలకు అందజేశారు. దీంతోపాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒకటి, డీపీవో కార్యాలయంలో ఒకటి, ముగ్గురు డీఎల్పీవోలకు ఒకటి చొప్పున మరో మూడు కంప్యూటర్లు ఆన్‌లైన్‌తో అనుసంధాన వివరాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేశారు. విధులు, నిధులన్నీ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధుల వివరాలన్నీ ఈ సాఫ్ట్వేర్ ఆధారంగా ఆన్లైన్లో పొందుపరచాలని ఆదేశించింది. కేంద్రం నుంచి వచ్చే వివిధ పథకాల నిధులు, రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నిధులు, బీఆర్జీఎఫ్, ఎంపీ లాడ్స్, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఆర్డబ్ల్యూఎస్ నిధులు, పైకా, వృద్ధాప్య నిధులు, పారిశుధ్య నిధులు, గ్రామ పంచాయతీకి వచ్చిన ఇతర ఆదాయాలు వంటివన్నీ పొందుపర్చాల్సి ఉంటుంది. ఈ విధంగా పాత వివరాలన్నీ అప్డేట్ చేస్తేనే కొత్తవి మంజూరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామపంచాయతీ ఉద్యోగులు, ఆపరే టర్లు ఈ పనుల్లో కుస్తీ పడుతున్నారు. మరోవైపు పూర్తిస్థాయి ఆన్లైన్ చేయడం వల్ల అవినీతి తగ్గే అవకాశం ఉంది. ప్రతీ పైసా కేటాయింపు, ఖర్చు చేయడానికి లెక్క ఉండడంతో జ వాబుదారీతనం పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. గతంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించి తెలంగాణ పేరుతో తెచ్చేందుకు సంబంధిత శాఖ ఇప్పటికే చర ్యలు ప్రారంభించింది. -
‘ప్రియా’.. లెక్కలు చెప్పాలా..!
- ‘ఆన్లైన్’లోనే పంచాయతీల జమా ఖర్చులు - ‘సాఫ్ట్వేర్’లో పూర్తిచేస్తేనే నిధులు - రేయింబవళ్లు కుస్తీపడుతున్న ఆపరేటర్లు - లెక్కలు సరిచూసుకుంటున్న అధికారులు బాన్సువాడ : గ్రామ పంచాయతీలు ఇక గాడిలో పడాల్సిందే. తమకు వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. అయితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరవుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దీంతో జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు ఆన్‌లైన్‌తో కుస్తీ పడుతున్నాయి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంటింగ్(ప్రియా) సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన కేంద్రం 2011-12 నుంచి 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన జమాఖర్చుల వివరాలను ఇందులో పొందుపర్చాలని ఆదేశించింది. తలకు మించిన భారం దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లోనూ ప్రియా సాఫ్ట్వేర్ ద్వారా గ్రామ పంచాయతీల జమా ఖర్చుల వివరాలు నమోదు చేయడం మూడేళ్ల కిందటే ప్రారంభమైంది. అనేక రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ గ్రామ పంచాయతీ సిబ్బందికి రోజువారీ విధు ల్లో ఒకటిగా మారింది. కానీ మనరాష్ట్రంలో గ్రామపంచాయతీలు పూర్తిస్థాయిలో జమాఖర్చుల వివరాలను పొందుపర్చలేదు. దీంతో ఇప్పుడు ఒకేసారి నాలుగేళ్లకు సంబంధించిన జమాఖర్చుల వివరాలను నమోదు చేయడం సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. గత మూడేళ్లుగా గ్రామ పంచాయతీలకు సం బంధించి పాలకవర్గాలు లేకపోవడం, పంచాయతీ ఎన్నికలను నిర్వహించకపోవడం వల్లే నేడు ప్రియా సాఫ్ట్‌వేర్‌లో పూర్తిస్థాయి వివరాల ను నమోదు చేయడంలో మిగితా రాష్ట్రాల కంటే వెనుకబడినట్లు తెలుస్తోంది. దీనికి తోడు గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేనందున కేంద్రం ప్రత్యేక నిధులు, గ్రాంట్లను విడుదల చేయలేదు. పంచాయతీలపై కనీస పర్యవేక్షణ లేకపోవడం, ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ పాలన గాడితప్పడం, జమాఖర్చులకు సంబంధించి సరైన వివరాలను నమోదు చేకపోవడం వల్ల పరిస్థితి ఇప్పుడు ఇబ్బందిగా మారింది. ‘ప్రియా’తోనే నిధులు కేంద్రం విడుదల చేసే నిధులకు సంబంధించిన ఖర్చుల వివరాలు పూర్తిగా ‘ప్రియా’ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయాలి. గ్రామ పంచాయతీల్లో ఆపరేటర్లు రేయింబవళ్లు జమాఖర్చులతో కుస్తీపడుతున్నారు. సరైన అకౌంట్లు లేనందున నిధుల ఖర్చు వివరాలను నమోదు చేయడం ఇబ్బందిగా మారింది. పంచాయతీల్లో నిధుల గోల్మాల్ జరగడం, ఖర్చులకు సంబంధించిన వివరాలు లేకపోవడం వల్ల ప్రియా సాఫ్ట్‌వేర్‌లో బయటపడుతుంది. లెక్కలను సరిచేసుకునేందుకు పంచాయతీ అధికారులు తలమునకలవుతున్నారు. జిల్లాలోని 718 పంచాయతీలకు సంబంధించిన వివరాలు ఆయా మండల పరి షత్ కార్యాలయాల కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఇందులో నమోదు చేస్తేనే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫైనాన్స్ నిధులు, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు, వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్స్, ఎంపీ నిధులు, ఆ ర్‌డబ్ల్యూఎస్, వృద్ధాప్య ఫించన్ల నిధులు, పైకా, సర్వశిక్షా అభియాన్, స్టేట్ ఫైనాన్స్ నిధులు, పారిశుధ్య తదితర నిధులు విడుదలవుతాయి. ఈ నిధులను ఎలా ఖర్చు చేశారో.. దానికి సంబంధించిన రసీదుల వివరాలను ప్రియాలో నమోదు చేయాలి. ఈ వివరాల ఆధారంగానే తదుపరి నిధులను విడుదల చేస్తారు. నిధుల గోల్‌మాల్‌కు చెక్ గ్రామ పంచాయతీల్లో తప్పుడు బిల్లులు పెట్టి రూ.వేలు, లక్షల్లో డబ్బులను డ్రా చేసే విధానానికి ఆన్లైన్ వల్ల చెక్ పడనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతీ పైసాకు ఈ సాఫ్ట్‌వేర్‌లో లెక్క చెప్పాల్సి ఉంటుంది. అలా నమోదు చేస్తేనే తదుపరి నిధులు మంజూరవుతాయి. స్థానికంగా ఇళ్ల పన్నులు, ఇతరత్రా ఆదాయాల వివరాలను సైతం ఇందులో పొందుపర్చాలి. చిన్న చిన్న ఖర్చులు తప్పా, పూర్తిస్థాయి వివరాలు ఇందులో ఉంచాలి. సామాన్యులు సైతం ఈ విధానం ద్వారా గ్రామ పంచాయతీల జమా, ఖర్చుల వివరాలను చూసే సౌలభ్యం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ పేరుతోనే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడినా మూడేళ్ల క్రితం రూపొందించిన ప్రియా సాఫ్ట్‌వేర్‌లో ఆంధ్రప్రదేశ్ పేరిటనే అకౌంటింగ్ సిస్టం కొనసాగుతోంది. సంబంధిత అధికారులు ఈ సాఫ్ట్‌వేర్‌లోనూ మార్పులు చేయాల్సి ఉంది.