breaking news
Pratapsingaram
-
ప్రతాప సింగారంలో హెచ్ఎండీఏ భారీ వెంచర్
హైదరాబాద్‌కు తూర్పున ఉన్న ప్రతాప సింగారం (pratap singaram) ‘రియల్’శోభ సంతరించుకోనుంది. దీనికిగాను హెచ్ఎండీఏ (HMDA) నడుంబిగించింది. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. భారీ వెంచర్‌కు ఫైనల్ లేఅవుట్ (lay out) సిద్ధం చేసింది. నగరం నలుదిక్కులా శివారు ప్రాంతాలు శరవేగంతో అభివృద్ధి చెందాలన్న ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఇది కార్యరూపం దాల్చబోతోంది. ఉప్పల్ భగాయత్ (uppal bhagayath) తరహాలో వెంచర్ రూపుదిద్దుకోనుంది. దాదాపు 150 మంది రైతుల నుంచి ఇప్పటికే 133 ఎకరాల పట్టాభూమితోపాటు మరో 18 ఎకరాల అసైన్డ్ భూమిని అధికారులు ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా సేకరించారు. అసైన్డ్ భూమిని రైతులు ఇచ్చినప్పటికీ కలెక్టర్ ఆమోదముద్ర పడాల్సి ఉంది.వెంచర్ అభివృద్ధికి రూ.120 కోట్లు వెంచర్‌ను అన్ని రకాల మౌలిక వసతులతో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏకు ప్రభుత్వం రూ.120 కోట్లను ఈ ఏడాది జనవరి 7న విడుదల చేసింది. 60:40 నిష్పత్తిలో ప్లాట్ల విస్తీర్ణాన్ని విభజించి ఎకరాకు 1,741 చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్లను రైతు వాటాగా కేటాయిస్తారు. హెచ్ఎండీఏకు మొత్తం 30 ఎకరాల వాటా వస్తుంది. దీని విలువ సుమారు రూ. 270 కోట్లు ఉంటుందని అంచనా. ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తున్నందున ప్రతాపసింగారానికి రూ. 10 కోట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించి తమ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ ల్యాండ్ ఇచ్చిన రైతులకు చట్ట ప్రకారం అభివృద్ధి చేసిన లేఅవుట్లో ఎకరాకు 600 చదరపు గజాలు కేటాయించాలి. కానీ, వెయ్యి చదరపు గజాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ప్లాట్ల కేటాయింపు.. వెంచర్ ప్రతిపాదనలు సిద్ధం చేసి మూడేళ్లు అవుతోంది. కొద్ది మంది రైతులు భూములను స్వాధీనం చేయడంలో జాప్యం కారణంగా లేఅవుట్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగలేదు. నిర్ణీత గడువులోగా లెంచర్ అభివృద్ధి చేయలేకపోతే రైతులకు భూమి విలువలో ఏటా 5 శాతం పరిహారంగా హెచ్ఎండీఏ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే వెంచర్లో రోడ్లు నిర్మించి, మార్కింగ్ చేసిన ప్లాట్లను రైతులకు కేటాయించారు. ఉప్పల్ భగాయత్ నుంచి ఓఆర్ఆర్ వరకు 150 అడుగుల వెడల్పుతో వెళ్లే రేడియల్ రోడ్ నెంబర్ 20 మణిహారంలా ఈ వెంచర్‌కు ఆనుకునే ఉంది.త్వరలో ప్లాట్ల రిజిస్ట్రేషన్ షురూ.. ఇరిగేషన్ అధికారులు వెంచర్‌ను పరిశీలించి ఎన్వోసీ జారీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగియగానే రైతులకు ప్లాట్లను రిజిస్టర్ చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేవిధంగా 110, 130, 190, 200, 220, 300, 400, 600, 1,200, 1,300, 1,500, 2,000 గజాల చొప్పున, ఒక ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలుగా ప్లాటింగ్ చేశారు. ఐటీ, వర్క్ స్టేషన్లు, డేటా సెంటర్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయి.చదవండి: నీకోసం ఈ లోకం బహుమానం చేసేస్తా..డేటా సెంటర్ కోసం కృషి ప్రతాప సింగారంలోని హెచ్ఎండీఏ వెంచర్లో డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరాం. రూ.10 కోట్లను ప్రత్యేకంగా కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశాం. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు సహకరించడాన్ని శుభపరిణామంగా భావిస్తున్నా. – మలిపెద్ది సుభాష్‌రెడ్డి, ప్రతాపసింగారంతూర్పు వైపు అభివృద్ధికి దోహదం.. హెచ్ఎండీఏ వెంచర్ల వల్ల తూర్పు హైదరాబాద్‌లో ఆస్తులకు డిమాండ్ పెరుగుతోంది. నగరంతో అద్భుతమైన అనుసంధానం ఏర్పడుతోంది. వ్యక్తిగతంగా భూములను అభివృద్ధి చేసుకోవడం అనేక ఖర్చులతో కూడుకున్న పని, కష్టసాధ్యం. అందుకే ల్యాండ్ పూలింగ్ను సమ్మతించాం. ఈ వెంచర్‌ను సకాలంలో అభివృద్ధి చేసి, మరో వెంచర్‌కు శ్రీకారం చుట్టాలని కోరుతున్నాం. – జున్ను నరేష్, భూ యజమాని, ప్రతాపసింగారం -
‘ల్యాండ్‌పూలింగ్’కు చిక్కులు!
ప్రతాప్‌సింగారం మెగా వెంచర్‌కు అడ్డంకులు సర్వే దశలోనే చతికిలబడ్డ హెచ్ఎండీఏ సరిహద్దులు తేలక ప్రాజెక్టు పక్కదారి.. సాక్షి, సిటీబ్యూరో: భూ అభివృద్ధి పథకం ద్వారా నగర శివార్లలో మరోసారి రియల్ బూమ్‌ను సృష్టించాలనుకొన్న హెచ్ఎండీఏకు చుక్కెదురైంది. భూములిచ్చేందుకు రైతులు ముందుకొచ్చినా...వాటిని అభివృద్ధి చేసేందుకు సవాలక్ష ఆంక్షలను సాకుగా చూపుతూ హెచ్ఎండీఏ వెనుకడుగు వేస్తోంది. ముఖ్యంగా భూముల సరిహద్దులు తేలడం లేదంటూ... సర్వే దశలోనే చతికిలబడ్డ అధికారులు తమ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఏకంగా ‘ల్యాండ్ పూలింగ్ స్కీం’కే తిలోదకాలిచ్చేందుకు పూనుకొన్నారు. ఫలితంగా శివారు ప్రాంతాల్లోని భూముల్లో సిరులు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. భూ అభివృద్ధి పథకం (ల్యాండ్ పూలింగ్ స్కీం) కింద నగరం చుట్టుపక్క ప్రాంతాల్లోని రైతుల నుంచి భూమిని సేకరించి కొత్త లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలని ఏడాది క్రితం హెచ్ఎండీఏ నిర్ణయించింది. రైతులకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేసిన లేఅవుట్లో 40 శాతం భూమి (ప్లాట్లు) తిరిగి అప్పగించాలనుకొంది. ఆయా లేఅవుట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక అవసరాలకు కొంత భూమిని మినహాయించి అభివృద్ధి చేసినందుకు గాను మిగతా భూమిని హెచ్ఎండీఏ తీసుకొంటుంది. ఇదీ... ల్యాండ్ పూలింగ్ స్కీం ఉద్దేశం. ఈ మేరకు ఉప్పల్‌కు సమీపంలోని ప్రతాప్‌సింగారం వద్ద మూసీని ఆనుకొని ఉన్న 300ల ఎకరాల భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు వచ్చారు. ఇక్కడ కొత్త లేఅవుట్ అభివృద్ధికి భూ సర్వే నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపిన హెచ్ఎండీఏ ఆ తర్వాత మనసు మార్చుకొంది. ప్రతాప్‌సింగారం వద్ద 300 ఎకరాల భూముల్లో రెవిన్యూ, హెచ్ఎండీఏ ఇంజనీరింగ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే నిర్వహించారు. అయితే, క్షేత్రస్థాయిలో ఉన్న భూములకు, రికార్డుల్లోని భూములకు పొంతనే లేదని, పైగా సరిహద్దులు కూడా పక్కాగా తేలడం లేదంటున్నారు. రికార్డుల్లో ఉన్న భూ యజమాని పేర్లు, ప్రస్తుతం పొజిషన్లో ఉన్న యజమాని పేర్లకు సంబంధం లేకుండా ఉందని, వీటిని సేకరిస్తే కోర్టు వివాదాలు ఉత్పన్నమవుతాయన్న కారణాన్ని సాకుగా చూపుతూ ఆ ప్రాజెక్టును పక్కకు పెట్టేసినట్లు సమాచారం. ఆశ అడియాసే... తమ భూములను హెచ్ఎండీఏకు ఇస్తే (60-40 ప్రాతిపదికన) అభివృద్ధి చేసిన ప్లాట్లు వస్తాయని ఆశించిన చిన్న, సన్నకారు రైతులకు నిరాశే మిగిలింది. అర ఎకరం భూమినిస్తే వెయ్యి చదరపు గజాల అభివృద్ధి చేసిన ప్లాట్ దక్కుతుందని, దీన్ని అమ్ముకోవడం ద్వారా ఆర్థికంగా సమస్యలను నుంచి బయటపడవచ్చని పేద రైతులు ఆశించారు. కాగా, ఆయా భూముల్లో సర్వే నిర్వహించిన అధికారులు ఇక్కడ మొత్తం 450 మంది రైతులకు చెందిన భూములున్నట్లు గుర్తించారు. ఎక్కడ భూమి తీసుకొంటే అక్కడే ప్లాట్ ఇవ్వాలన్నది నిబంధన. ఒకేచోట నాలుగైదు ఎకరాల భూమి ఉన్నరైతులకు ఇది సాధ్యమే. అయితే... మొత్తం రైతుల్లో 1/2 ఎకరా భూమి ఉన్నవారే ఎక్కువగా ఉండటంతో రోడ్లు, పార్కు వంటి వాటి కి భూములు పోయిన వారికి అక్కడే ప్లాట్లు ఇవ్వడం అసాధ్యంగా మారింది. ఇదే విషయమై చివర్లో రైతులు మెలికపెడితే చిక్కులు ఎదురవుతాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ప్రాజెక్టును పక్కకు పెట్టినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులో జాప్యంపై సంబంధిత అధికారిని వివరణ కోరగా ఫిజికల్ సర్వేలో ఆయా భూములు రెవిన్యూ రికార్డుల్లోని సరిహద్దుతో మ్యాచ్ కావట్లేదని, ఇప్పుడు వీటిని సరిచేసే పనిలో నిమగ్నమయ్యామని సమాధానం ఇచ్చారు.