breaking news
poly technic college
-
వన్నెతగ్గుతోన్న .. పాలిటెక్నిక్ విద్య
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ విద్య వన్నె తగ్గుతోంది. ఓవైపు ఏటికేటికీ తగ్గుతోన్న ప్రవేశాలు..కళాశాలల్లో అధ్యాపకుల కొరత ...ఉపాధి సామర్థ్యాన్ని పెంచడంలో వెనుకబాటు..మరోవైపు కొత్త పుంతలు తొక్కుతోన్న అధునాతన ఇంజినీరింగ్ కోర్సులు..వెరసి పాలిటెక్నిక్ ఉనికికి సవాల్ విసురుతున్నాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కల్పించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రవేశపెట్టిన పథకాన్ని పరిశీలిస్తే విషయం స్పష్టమవుతోంది. ఈ స్వయం ప్రతిపత్తి విధానాన్ని రెండేళ్ల కిందట అమలు చేయగా...ఇప్పటిదాకా మహారాష్ట్ర, కర్నాటకలోని ఐదు కళాశాలలు మాత్రమే అర్హత సాధించడం గమనార్హం. 59 శాతం ప్రైవేటు యాజమాన్యాలే.. పాలిటెక్నిక్‌లో ప్రవేశాలు సైతం క్రమంగా తగ్గుతున్నాయి. దీనికి తోడు సీట్ల సంఖ్య కూడా క్షీణిస్తూ వస్తోంది. ముఖ్యంగా పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో ప్రైవేటు సంస్థలే కీలకంగా వ్యవహరిస్తున్నాయి. 2024–25లో ఏఐసీటీఈ ఆమోదించిన సంస్థల జాబితా ప్రకారం దేశంలో 3566 పాలిటెక్నిక్ కళాశాలలు ఉంటే వాటిలో 59 శాతం ప్రైవేటు యాజమాన్యాల చేతిలో ఉండటం గమనార్హం. ఆదర్శం..ఆ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాలిటెక్నిక్ విద్య ప్రారంభంలో ప్రభుత్వ హయాంలోనే నడిచేది. కాల క్రమేణా ప్రైవేటు పరం చేయడంతో కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. దీంతో పాలిటెక్నిక్ విద్య నాసిరకంగా మారింది. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పాలిటెక్నిక్ కళాశాలలను ప్రభుత్వమే నడిపిస్తోంది. వాటిలో గోవా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, లక్షద్వీప్, దాద్రా–నాగర్ హవేలీ ఉన్నాయి. ఇక్కడ పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ జరగలేదు. ఏటా క్షీణిస్తున్న ప్రవేశాలు..పాలిటెక్నిక్‌లో ఏటా సీట్ల భర్తీ కోసం కళాశాలలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే 2017–23 వరకు ఐదేళ్ల కాలంలో దాదాపు ఐదో వంతు (19.7 శాతం) సీట్లు తొలగించినట్టు తెలుస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు పూర్తయిన తర్వాత కూడా భారీ సంఖ్యలో సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటీవల అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పరిశ్రమలకు అనుగుణంగా పాఠ్యాంశాలు సవరించిన సంగతి తెలిసిందే. అయిననప్పటికీ తగిన ఫలితం కనిపించట్లేదు. మరోవైపు పాలిటెక్నిక్ విద్యను ఢిల్లీ మాదిరిగా కొన్ని రాష్ట్రాలు నైపుణ్య విశ్వవిద్యాలయాల కిందకు తీసుకురావాలని భావిస్తున్నాయి. మరోవైపు ఫీజులు కూడా భారీగా పెరగడంతో విద్యార్థులు ప్రత్యామ్నాయ కోర్సుల వైపు మరలుతున్నారు.మెరుగుపడాలంటే.. ⇒ పాలిటెక్నిక్ కళాశాలలకు స్వయం ప్రతిపత్తి అంశంలో ఏఐసీటీఈ, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి. ⇒ ప్రభుత్వాలు కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంచాలి. ⇒ స్వయం ప్రతిపత్తి హోదాకు నిర్దేశించిన అంశాలను సంతృప్తి పరచడంలో చాలా విద్యా సంస్థలు విఫలమవుతున్నాయి. దీన్ని అధిగమించాలి. ⇒ ముఖ్యంగా అధ్యాపకుల కొరత పాలిటెక్నిక్ విద్యను ప్రభావితం చేస్తోంది. ఈలోటును భర్తీ చేయాలి. ⇒ లైబ్రరీలు, ప్రయోగశాలలు, తగినన్ని వనరుల కల్పనపై దృష్టి సారించాలి. అలాగే వర్క్‌షాప్‌లు నిర్వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
పాలిసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్–2020 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిసెట్ పరీక్ష రాసేందుకు 72,920 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, ఈనెల 2న జరిగిన పరీక్షకు 56,945 మంది హాజరయ్యారు. అందులో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 46,207 మంది (81.14 శాతం) అర్హత సాధించగా, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 46,318 మంది (81.34 శాతం) అర్హత సాధించినట్లు (ఒకే విద్యార్థికి రెండు కేటగిరీల్లో ర్యాంకులు) కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. సాంకేతిక విద్యాభవన్‌లో గురువారం పాలిసెట్ ఫలితాలను నవీన్ మిట్టల్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందులో 120 మార్కులకు గాను 30 శాతం (36 మార్కులు) మార్కులను కనీస అర్హత మార్కులుగా నిర్ణయించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక మార్కును కనీస అర్హత మార్కులుగా నిర్ణయించామని, పరీక్షకు హాజరైన 9,510 మంది ఎస్సీ విద్యార్థుల్లో 9,508 మందికి, పరీక్షకు హాజరైన 4,715 మంది ఎస్టీ విద్యార్థులకు ర్యాంకులను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ పాలిటెక్నిక్‌లలో సీట్లను కేటాయిస్తామని వివరించారు. విద్యార్థులు ఈనెల 12 నుంచి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పాలిసెట్
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం బుధవారం నిర్వహించిన పాలిసెట్-2014 జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలోని 9 కేంద్రాల్లో 3,281 మంది అభ్యర్థులకు గాను 3,050 మంది పరీక్ష రాశారు. ప్రొద్దుటూరులో 11 కేంద్రాల్లో 3,004 మందికి గాను 2,875 మంది, రాజంపేటలో 3 కేంద్రాల్లో 458 మందికి గాను 429 మంది హాజరయ్యారు. పరీక్షా సమయానికి గంట ముందుగానే విద్యార్థులను అనుమతించడంతో ఎక్కడా ఆలస్యంగా వచ్చిన కేసులు నమోదు కాలే దు. పరీక్ష ఉదయం 11 నుంచి 1 గంట వర కు సాగింది. పరీక్షాకేంద్రాలను అధికారు లు పర్యవేక్షించారు.