breaking news
pew report
-
డిజిటల్ ఇండియా ఎక్కడా?
మనం పదే పదే వల్లెవేసే డిజిటల్ ఇండియాలో ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 2017 లో అతి తక్కువ మంది వయోజనులు ఇంటర్నెట్ వినియోగంలో భారత్‌దే ప్రథమ స్థానమని ప్యూ(పీడబ్ల్యూ) పరిశోధనా సంస్థ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అత్యధికంగా 96 శాతం మంది మేజర్లు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న దేశంగా దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో ఉన్నట్టు 37 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న మేజర్లు 2013 లో12 శాతం ఉంటే, 2017లో పదిశాతం పెరిగి 22 శాతానికి చేరింది. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 8 శాతం నుంచి గత యేడాది 12 శాతానికి పెరిగి ప్రస్తుతం 20 శాతానికి చేరింది. దీనర్థం మన దేశంలో 78 శాతం మంది మేజర్లు స్మార్ట్ఫోన్లు కలిగిలేరు. 80 శాతం మందికి ఫేస్బుక్, ట్విట్టర్ గురించి అవగాహన లేదు. అభివృద్ధి చెందుతోన్న, చెందిన దేశాలకూ మధ్య ఇంటర్నెట్ వాడకంలో ఉన్న వ్యత్యాసం కొంత తగ్గినప్పటికీ, ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగించని ప్రాంతాలు ఇంకా అనేకం ఉన్నట్టు అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
గ్రీన్ కార్డు కోసం వేచిచూడాల్సిందే
అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులు గ్రీన్ కార్డు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. గ్రీన్ కార్డును దరఖాస్తు చేసుకున్న భారతీయులు దాదాపు 12 ఏళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి. కాగ, ప్రతేడాది గ్రీన్‌కార్డులను పొందుతున్న టాప్ దేశాల్లో భారత్‌లో ఒకటిగా ఉంది. 2015లో 36,318 మంది భారతీయులు తమ స్టేటస్‌ను శాశ్వత పౌరసత్వంగా మార్చుకోగా, 27,289 మంది భారతీయులు గ్రీన్ కార్డు రూపంలో చట్టబద్దత శాశ్వత పౌరసత్వం పొందినట్టు ప్యూ రీసెర్చ్ తెలిపింది. '' ఎంప్లాయిమెంట్‌కు సంబంధించిన కేటగిరిలో శాశ్వత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు, వారు నిపుణవంతులైన ఉద్యోగులైనప్పటికీ ప్రస్తుతం 12 ఏళ్లు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 2005 మేలో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్ల ప్రక్రియను ప్రభుత్వం ఇప్పుడు చేపడుతోంది'' అని రిపోర్టు తెలిపింది. ప్యూ డేటా ప్రకారం 2010 నుంచి 2014 వరకు ఎంప్లాయిమెంట్‌కు చెందిన గ్రీన్‌కార్డులు 36 శాతం అంటే 2,22,000పైగా హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కే అందించినట్టు తెలిసింది. అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండటానికి, పనిచేయడానికి గ్రీన్ కార్డు ఎంతో అవసరం. గ్రీన్ కార్డు హోల్డర్లు ఐదేళ్ల నివాసం తర్వాత అమెరికా సిటిజన్‌షిప్ కూడా అప్లయ్ చేసుకోవచ్చు.