breaking news
Osmania biscuits
-
భాగ్యనగర్.. బిస్కెట్ కా ఘర్..
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ.. అంటే హైదరాబాద్.. ఈ రెండింటికీ మధ్య విడదీయరాని బంధం అలాంటిది. ఈ విషయం భాగ్యనగర వాసులతోపాటు ప్రపంచమంతా తెలిసిందే.. ఎందుకంటే దశాబ్దాల తరబడి బిర్యానీకి హైదరాబాద్ నగరం కేరాఫ్ అన్నట్టుగా మారింది. అయితే మన చవులూరించే చరిత్ర కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. దీంతోపాటు పలు రకాల బిస్కెట్లకు కూడా గుర్తింపు ఉందని అంటున్నారు నగరానికి చెందిన బేకరీ నిర్వాహకులు. ఈ బిస్కెట్స్‌లో ఇరానీ చాయ్‌తో జోడీ కట్టేవి కొన్నయితే.. క్రిస్మస్ లాంటి పండుగల సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే గిఫ్ట్ ప్యాకెట్స్గా మారేవి మరికొన్ని. అలాంటి కొన్నింటిపైనే ఈ కథనం.. నాటి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాస్త సాల్ట్, కాస్త స్వీట్ కలగలిసిన రుచికరమైన ఈవెనింగ్ స్నాక్స్ కోసం చేసిన అన్వేషణే ఉస్మానియా బిస్కెట్‌కి ఊపిరిపోసిందని చరిత్ర చెబుతోంది. ఆయనే నిర్మించిన ఉస్మానియా ఆస్పత్రిలో రోగులకు అల్పాహారంగా కూడా ఇది వినియోగించారని చరిత్రకారులు చెబుతుంటారు. దేశంలోనే రాజ ప్రాసాదం నుంచి వచి్చన రాయల్ గుర్తింపు కలిగిన తొలి బిస్కెట్‌గా దీన్ని చెప్పొచ్చు. వెన్న, పంచదార, కస్టర్డ్ పౌడర్, సోడా, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, పాల మేళవింపుతో ఈ బిస్కెట్ అప్పుడు రోగుల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తయారైందట. తొలి రాయల్ బిస్కెట్.. కాగా ఈ రాయల్ బిస్కెట్‌ని నగర మార్కెట్‌కి పరిచయం చేసింది మాత్రం సుభాన్ బేకరీ. ఉస్మానియా బిస్కెట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ బిస్కెట్‌ను ఒక కప్పు ఇరానీ చాయ్‌తో ఆస్వాదించడం అప్పుడు.. ఇప్పుడూ.. ఎప్పుడూ హైదరాబాదీలకు నిత్యకృత్యం. హిస్టారికల్ టూటీ ఫ్రూటీ.. పురాతన హైదరాబాదీ బిస్కెట్‌గా గుర్తింపు పొందిన మరొకటి ఫ్రూట్ బిస్కెట్. ఇది రోజువారీ వినియోగం కన్నా.. ఇచ్చి పుచ్చుకునే బహుమతిగా టూటీ ఫ్రూటీ ప్యాక్ బాగా పేరొందింది. నగరవాసులు విదేశీ పర్యటనకు వెళ్లడానికి ముందుగా కరాచీ బేకరీ నుంచి పుట్టిన ఫ్రూట్ బిస్కెట్‌ను ప్యాక్ చేయించుకోవడం చాలా మందికి అలవాటు.వెనీలా రుచుల చంద్రవంక.. చంద్రవంక ఆకారంతో ఉంటుంది కాబట్టి ఈ బిస్కెట్‌కి ఆ పేరు పెట్టారు. ఇది తేలికపాటి తీపితో మధ్యకు విరిగిన ఆకృతి కలిగి ఉంటుంది. ఈ బిస్కెట్లను తరచూ వెనిలా లేదా పాలతో బేక్ చేసి, వాటికి సున్నితమైన, లలితంగా ఉండే రుచిని అందజేస్తారు. వీటినే టూటీ ఫ్రూటీ బిస్కెట్స్ అని కూడా అంటారు. వీటి ధరలు సుమారు కిలో రూ.400 నుంచి రూ.500 మధ్యలో ఉన్నాయి. చాయ్‌తో.. ఫైన్ బిస్కెట్.. నగరంలోని బేకరీలలో దీర్ఘకాల వారసత్వం కలిగిన మరొక హైదరాబాదీ ట్రీట్‌గా దీన్ని చెప్పొచ్చు. దీనిని పలుచని పొరలుగా వేయడం అనేది కొంత శ్రమతో కూడిన ప్రక్రియగా తయారీదారులు చెబుతారు. ఈ బిస్కట్లో పంచదార పాకం, కొద్దిగా మంచిగా పెళుసైన క్రస్ట్ ఉంటుంది. ఇది ఇరానీ చాయ్‌తో మరో చక్కని కాంబినేషన్. చాయ్‌లో ముంచినప్పుడు మెత్తగా మారి దానికి సరికొత్త తీపిని జోడిస్తుంది. ఇది కిలో రూ.300 నుంచి ఆపైన అందుబాటులో ఉన్నాయి. రుచికి దాసోహం ‘కారా’.. ఇది నగర టీ సంస్కృతి ప్రత్యేకతకు దోహదం చేసే మరో రుచికరమైన బిస్కెట్ ఖారా.æ వీటిని పిండి, వెన్నతో పాటు మరికొన్ని సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. తరచుగా జీలకర్ర లేదా నువ్వులు కూడా ఈ మేళవింపులో చోటు చేసుకుంటాయి. ఇవి చాయ్ రుచికి మసాలాని జోడించి వైవిధ్యభరితమైన ఆస్వాదనను అందిస్తాయి. ఇది కిలో రూ.350 నుంచి రూ.400 మధ్య అందుబాటులో లభిస్తుంది.ఛాయ్ అండ్ ‘టై’.. సూపర్ భాయ్.. ప్రత్యేకమైన విల్లు–టై ఆకృతి ద్వారా ప్రసిద్ధి చెందిన ఈ బిస్కెట్లు కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి ఒక కప్పు ఇరానీ చాయ్‌కి అద్భుతమైన కాంబినేషన్‌గా చెప్పొచ్చు. వీటి తేలికైన, పొరలతో కూడిన రుచి తియ్యటి బిస్కెట్ల నుంచి వేరు చేస్తుంది. కిలో రూ.300 నుంచి రూ.350 వరకూ ఉంటుంది.బిస్కెట్ల చరిత్ర అ‘పూర్వం’.. బిర్యానీ కన్నా అతి పురాతన చరిత్ర కలిగిన బిస్కెట్లు మన నగరానికి ఉన్నాయి. అయితే చాలా మందికి వాటి విశేషాలు తెలియవు. బిస్కెట్స్‌లో మేం పరిచయం చేసిన ఉస్మానియా బిస్కెట్ విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంది. చాంద్ బిస్కెట్, టై బిస్కెట్ వంటివి ఇప్పటికీ పలువురు రాజకీయ ప్రముఖులు సైతం రెగ్యులర్‌గా ఆర్డర్ చేస్తుంటారు. ముఖ్యంగా వింటర్ సీజన్లో ఛాయ్‌కి డిమాండ్ ఎక్కువ.. దీంతో పాటే ఖారా వంటి బిస్కెట్స్‌కి డిమాండ్ పెరుగుతుంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే.. ఈ బిస్కెట్ల ఒరిజినల్ టేస్ట్‌ని ఎంజాయ్ చేయాలంటే కొంత ఎంక్వయిరీ చేసుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే.. కొన్ని పాత బేకరీలు మాత్రమే వాటిని పాత పద్ధతిలో తయారు చేస్తున్నాయి. ‘1951లో మా తాత మొహమ్మద్ యాసీన్ ఖాన్ బేకరీని ప్రారంభించినప్పుడు, జనాదరణ పరంగా అగ్రస్థానంలో ఉస్మానియా బిస్కెట్ ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఖారా బిస్కెట్, చాంద్ బిస్కెట్, ఫైన్ బిస్కెట్, టై బిస్కెట్ ఉండేవి. ఇవి అప్పట్లో ఎంతగా ప్రాచుర్యం పొందాయంటే, అవి లేకుండా అల్పాహారం, టీ సమయం మాత్రమే కాదు, పెళ్లి విందులు సైతం ఉండేవి కావు. ఇప్పటికీ వీటిని రెగ్యులర్‌గా వినియోగించేవాళ్ల వల్ల తగినంత డిమాండ్ ఉంది’ అని రోజ్ బేకరీ యజమాని ముజాఫర్ ఖాన్ అంటున్నారు. కాగా సోషల్ మీడియా ట్రెండ్స్‌తో మమేకమవుతున్న నేటి యువతకు హైదరాబాద్ సంప్రదాయ బిస్కెట్ల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది అంటున్నారు నగరంలోని పలువురు బేకరీల నిర్వాహకులు. -
కమ్మని ఇరానీ చాయ్
హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది కమ్మని ఇరానీ చాయ్, ఉప్పగా ఉండే ఉస్మానియా బిస్కెట్లు, సమోసా విత్ మిర్చి. ఇప్పటివరకు ఇరానీ కేఫ్‌లకే పరిమితమైన ఈ మెనూని స్టార్ హోటల్స్ సైతం యాడ్ చేసుకున్నాయి. శుక్ర, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 3.30గంటల నుంచి 5.30వరకు ‘ది గ్రిల్’ పేరుతో హైటీ అందిస్తోంది తాజ్ వివంత. ఎగ్జిక్యూటివ్ చెఫ్ అర్జున్ యాదవ్ దీని రుచి చూపిస్తున్నారు. హ్యాపీగా పూల్‌సైడ్ కూర్చుని దర్జాగా నిజాం నాటి మ్యూజిక్ వింటూ హైదరాబాద్ స్పెషల్ హైటీని ఆస్వాదించొచ్చు. అయితే ఇంగ్లిష్ డిషెస్ ఫ్లేవర్స్ యాడ్ చేయడం వల్ల రుచిలో ఇరానీ టీ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని చెబుతున్నాడు చెఫ్ అర్జున్. దీనికోసం డికాషన్‌ను మూడు నుంచి నాలుగు గంటల పాటు మరిగించి అందులోనే చక్కెర కలిపి కేటిల్లో ఉంచుతారు. చివరకు చిక్కని పాలను యాడ్ చేయగా మిల్కీ ఫ్లేవర్‌తో ఘుమఘుమలాడుతుంది. కచ్చితంగా మీకు నోరూరిస్తుందని అంటున్నాడాయన. ఈ చాయ్‌తోపాటు ఉస్మానియా బిస్కట్లు, ఆరంజ్ చాక్లెట్స్, ఇంగ్లిష్ టీ కేక్స్, పిన్ వీల్ శాండ్విచెస్... ఇలా 15 రకాల స్నాక్స్ కూడా ఉంటాయి. దీని ధర వెయ్యి రూపాయలు. -
మనది ఔదార్యాబాద్!
ఔదార్యం అంటే హైదరాబాద్ వారి నుంచే నేర్చుకోవాలి. నిజానికి మన పీపుల్ సిటీ పేరును ఔదార్యాబాద్ అంటూ ఉచ్ఛరించడం కొంచెం కష్టమైపోయి హైదరాబాద్ అని పలుకుతున్నారేమో అని నా అనుమానం. మనం నలుగురం కలసి ఇరానీ హోటల్‌కు చాయ్ తాగడానికి వెళ్తాం. ‘దో చాయ్... ఔర్ దో కప్ ఎంప్టీ’ అని జబర్దస్తీతో అడుగుతాం. ఇంకేదైనా ఊళ్లో ఇలా ఎంప్టీ కప్పులు అడిగితే షాపువాడు ఏమనుకుంటాడో అని భయపడాలి. కానీ హైదరాబాద్‌లో మాత్రం చాయ్‌తో పాటూ ఖాళీ కప్పులూ ఉదారంగా ఇచ్చేస్తాడు. అలాగే నలుగురి కోసం ఏ పన్నెండో పదహారో ‘ఉస్మానియా బిస్కెట్లు’ ఆర్డర్ చేస్తాం. ఆ తర్వాత ఏ ఆరో, ఎనిమిదో తింటాం. మిగతా వాటిని గౌరవంగా తీసుకెళ్తాడు వెయిటర్. మనం తిన్నదానికే చార్జ్ చేస్తాడు తప్ప... తినని వాడివి వాటిని ఎందుకు ఆర్డర్ చేశావంటూ దబాయించడు. మళ్లీ ఇది మరో రకం ఔదార్యం. మన దార్లో మనం వాహనం మీద వెళ్తుంటాం. అవతలివాడు రాంగ్ సైడ్‌లో మనకు అడ్డంగా వస్తుంటాడు. అయినా మనం గౌరవంగా అడ్డం తొలగి వాడికి దారిస్తాం. పాపం... వాడెంత అవసరం కొద్దీ ఇలా రాంగ్ సైడ్‌లో వెళ్తున్నాడో... రేపు మనం మాత్రం అలా వెళ్లమా ఏంటి అని ఔదార్యం ప్రకటిస్తాం. పైగా విశాలంగా చిర్నవ్వు నవ్వి... ‘రూల్స్ ఉందే బ్రేక్ చేయడానికి కద్సార్. విదేశాల వాళ్లు రికార్డులు బ్రేక్ చేస్తారు. మనం రూల్స్ బ్రేక్ చేస్తాం’ అంటూ అవతలివాడిలోని అపరాథ భావన ఏదైనా ఉంటే దాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తూ... వాడి ‘రాంగ్’ సైడు వాదననూ మనమే ఓ స్థితప్రజ్ఞుడిలా ప్రవచిస్తాం. ట్రాఫిక్‌లో అదీ మన ఔదార్యం. ఇక మనం తిరిగే రూట్లలో ఎవరెవరో వాళ్ల వాళ్ల ఇళ్ల ముందు ఏదో ఫంక్షన్ చేసేసుకుంటుంటారు. ఈ సందర్భంగా ఆ రోడ్డు రోడ్డునంతా బ్లాక్ చేసేస్తారు. ఫంక్షన్ చేసే వాడి ఇల్లు ఆ ఇళ్ల వరసలో ఎక్కడో మధ్యన ఉంటుంది. కానీ అతడుండే వీధికి... కనెక్టింగ్ రోడ్డు చివరన ఒక షామియానాను అడ్డు గోడగా నిర్మాణం చేసేసి, అవతలి రోడ్డు చివరకూ అదే భాగ్యం కల్పిస్తూ మరో షామియానాను దడిలాగా కట్టేస్తాడు. అలా ఆ రోడ్డు రోడ్డునంతా ఓ అనధికారిక ఫంక్షన్ హాల్ చేసేసి, ఇరానీ హోటల్లోని ఎంప్టీ కప్పులా వాడుకుంటుంటాడు. మనం కూడా సదరు ఫంక్షన్ నిర్వాహకుడికి పరోక్ష మద్దతు పలుకుతాం. అతడు నిర్వహించే ఆ వేడుకకు మనవంతు సహకారం ఇస్తూ మనం ఆనందంగా ‘పక్కదార్లు’ పడుతూ ఉంటాం. అంతేగానీ... రోడ్డును ఇలా బ్లాక్ చేసి ఎందరో ప్రయాణికులకు అసౌకర్యం ఎలా కలిగిస్తావంటూ అడగని సౌజన్యం మనది. ఇక గల్లీ క్రికెట్ అన్నది మన నగర సంస్కృతి. ఇవాళ ప్రముఖులైన ఎందరెందరో ఈ గల్లీ క్రికెట్ ఆడినవాళ్లే. ‘అంతా మన పిల్లలేలెద్దూ. అసలే నగరంలో ఖాళీ స్థలాలకు తీవ్రమైన కొరత ఉంటే పిల్లలెక్కడ ఆడుకుంటారు’ అనుకుంటూ సదరు బౌలర్గారి ఒరవడినీ, ఇటు బ్యాట్స్‌మన్ గారి ధాటినీ నేర్పుగా తప్పుకుంటూ, రోడ్డుపై గల పిల్లల మినీ ప్లేగ్రౌండును ప్రాణాలకు తెగించి దాటేస్తుంటాం. ఇదీ మరో రకం ఔదార్యమే. అందుకే ఇలాంటి సౌజన్యాలూ, ఔదార్యాల నగరంలో నివసిస్తున్నందుకు గర్వపడుతూ మన ఓపికనూ, ఔదార్యాలనూ మరింతగా అభివృద్ధి చేసుకుంటూ మన మహానగరం పేరు హైదరాబాద్.. సారీ ఔదర్యాబాద్ పేరును సార్థకం చేసుకుందాం.