breaking news
Old tariff
-
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్‌లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
పన్ను భారం తగ్గేదెలా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రిటర్నులు దాఖలు చేసే వారికి నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. పాత పన్ను వ్యవస్థతోనే కొనసాగాలనుకుంటే విధిగా దానిని ఎంపిక చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త విధానం అమలవుతుంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తక్కువ. కానీ, పాత విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఎక్కువ. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కనుక కొత్త విధానంతో పోలిస్తే గణనీయమైన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించే పన్ను తగ్గిపోతుంది. మరి వీటిల్లో తమకు ఏది అనుకూలమో తేల్చుకోవాలంటే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆదాయపన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని కోరుకునే వారికి.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక కీలకం అవుతుంది. చట్టప్రకారం మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంటే, అప్పుడు విధిగా రిటర్నులు దాఖలు చేసి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత, కొత్త పన్ను రేట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండు వ్యవస్థల్లోనూ కొంత పన్ను రాయితీ ఉంది. పాత విధానంలో నికరంగా రూ.5 లక్షలు, నూతన విధానంలో నికరంగా రూ.7 లక్షలు మించకుండా పన్ను వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల ప్రయోజనాన్ని కూడా కలిపి చూస్తే వేతన జీవులు పాత విధానంలో రూ.5.50,000 ఆదాయం, కొత్త విధానంలో రూ.7,50,000 మించని ఆదాయంపై రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోలేని వారికి నూతన విధానమే అనుకూలం. పాత విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 24 ఇలా పలు సెక్షన్ల కింద పన్ను తగ్గింపులు, మినహాయింపులను వినియోగించుకుంటే, రూ.5 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు సైతం గణనీయమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇంతకుమించి ఆదాయం కలిగిన వారు ఈ రెండింటిలో ఏది లాభదాయకమో తేల్చుకోవాలంటే కొంత కసరత్తు అవసరం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి దీని కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా ఈ సెక్షన్ కింద చూపించుకోవచ్చు. గృహ రుణం తీసుకుని, ఒక ఆర్థిక సంవత్సరంలో దీనికి చేల్లించే అసలును (ప్రతి ఈఎంఐలో అసలు, వడ్డీ భాగం ఉంటుంది) సెక్షన్ 80సీ కింద చూపించి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లలోపు వయసున్న వారు రూ.25,000 వరకు, అంతకుమించిన వయసు వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇదే సెక్షన్ కింద హెల్త్ చెకప్‌లకు చేసే వ్యయం రూ.5,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. విరాళాలు ఇస్తే.. అర్హత కలిగిన సంస్థలకు విరాళాలు ఇస్తే, ఆ మొత్తంపై సెక్షన్ 80జీ కింద పన్ను భారం ఉండదు. ఇక సెక్షన్ 80టీటీఏ కింద సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఆర్జించే వడ్డీ రూ.10,000 మొత్తంపై పన్ను లేదు. అదే 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ ఆదాయం రూ.50,000పై పన్ను లేదు. ఇవన్నీ పాత పన్ను విధానంలో ఉన్న చక్కని పన్ను మినహాయింపు ప్రయోజనాలు. పన్ను ఆదా, పెట్టుబడులు పాత వ్యవస్థలో ఉన్న పన్ను ఆదా ప్రయోజనాలను ఉపయోగించుకుంటే, మరింతగా పన్ను ఆదా చేసుకోవచ్చని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శడగోపన్ పేర్కొన్నారు. వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవైపు పెట్టుబడులపై రాబడిని, మరోవైపు పన్ను ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో పెట్టుబడులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే ఇది పెట్టుబడులను నిర్బంధం చేయదు. ఎన్పీఎస్ వేతన జీవులు, స్వయం ఉపాధిలోని వారు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఎన్పీఎస్పై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వేతన జీవులు అయితే తమ మూలవేతనం, డీఏలో 10 శాతం మేర ఎన్పీఎస్కు చందా జమ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ మొత్తం ఆదాయంలో 20 శాతంపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ సెక్షన్ కింద ఈ రెండు వర్గాలకు గరిష్ట ప్రయోజనం రూ.1.5 లక్షలు. ఇక 80సీసీడీ (1బి) కింద వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పైన చెప్పుకున్న రూ.1.5 లక్షలకు ఇది అదనం. 80సీసీడీ(2) కింద వేతన జీవులకు అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో సంస్థ చేసే జమలు దీనికింద వస్తాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులు అయితే తమ మూలవేతనం, డీఏలో 14 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 10 శాతం మేర యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు. ఈపీఎఫ్ జమలు కూడా ఈ పరిమితిలో భాగమే. హెచ్ఆర్ఏ అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతుంటే అప్పుడు కూడా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారు తమ మూల వేతనం, డీఏలో 50 శాతం మేర సెక్షన్ 10(13ఏ) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నాన్ మెట్రోల్లోని వారికి ఈ పరిమితి 40 శాతంగా ఉంది. అలాగే, హెచ్ఆర్ఏ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం.. మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తీసివేయగా వచ్చే మొత్తం.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పనిచేసే ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉండే వారికి హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు రాదు. పనిచేసే చోట అద్దె ఇంట్లో ఉంటూ, వేరే ప్రాంతంలో సొంతిల్లును అద్దెకు ఇచి్చన వారు సైతం హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును పొందొచ్చు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రయాణాలకు చేసిన ఖర్చును చూపించి, పన్ను భారం తొలగించుకోవచ్చు. గృహ రుణం/విద్యా రుణం రుణంపై ఇంటిని కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఇప్పుడు యువత సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటున్నారు. ఈ రుణానికి చేసే అసలు చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మేర సెక్షన్ 24(బి) కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను కట్టక్కర్లేదు. సొంతగా నివాసం ఉన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే ఈ ప్రయోజనానికి అర్హులే. విద్యా రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నా సరే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకుని పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు. మీకు ఏది అనుకూలం? పాత విధానంలో ఇక్కడ పేర్కొన్న మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే.. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలు, 80 సీసీడీ (1బి) కింద రూ.50,000 (ఎన్పీఎస్), స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణం వడ్డీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.9.5 లక్షలపై పన్ను లేనట్టే. అలాగే, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాకు గరిష్టంగా రూ.7.5 లక్షల మేర జమ చేయించుకుంటే అప్పుడు మొత్తం రూ.17 లక్షలపై పన్ను లేనట్టు అవుతుంది. కొత్త విధానంలో రూ.7 లక్షల మొత్తంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కలి్పంచారు. దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే రూ.7.5 లక్షలపై పన్ను లేదు. ఆదాయం రూ.7,50,001 ఉన్న వారికి 87ఏ రాయితీ వర్తించదు. వారు తమ ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి. మొదటి మూడు లక్షలపై పన్ను లేదు. 3–6 లక్షలపై 5 శాతం ప్రకారం రూ.15,000. రూ.6.–7.51 లక్షలపై 10 శాతం ప్రకారం రూ.15,000 కలిపి మొత్తం రూ.30,000, దీనికి సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 7.51 లక్షల ఆదాయంపై పాత విధానంలో రిటర్నులు వేసుకునేట్టు అయితే.. 87ఏ రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.5 లక్షల వరకు పన్ను లేదు. 80సీ సాధనంలో 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని, దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రూపాయి పన్ను లేకుండా చూసుకోవచ్చు. విధానాన్ని మార్చుకోవచ్చు.. పాత పన్ను నుంచి కొత్త పన్నుకు.. తిరిగి పాత పన్నుకు మారడంపై ఆంక్షలు ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం పొందని వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపారం నుంచి ఆదాయం పొందుతున్న వారు సెక్షన్ 115బీఏసీ కింద నూతన పన్ను విధానం నుంచి వైదొలిగే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పుడు తిరిగి నూతన పన్ను విధానానికి ఒక్కసారి మాత్రమే మారే అవకాశం ఉంటుంది. ‘‘తక్కువ పన్ను శ్లాబుల పరిధిలో ఆదాయం కలిగిన వారికి నూతన పన్ను విధానమే మెరుగైనది. అధిక రేటు శ్లాబుల్లో ఉన్నవారు, అన్ని రకాల మినహాయింపులు వినియోగించుకుంటే వారికి పాత విధానం అనుకూలం’’అని రైట్ హారిజాన్స్ సీఈవో అనిల్ రెగో సూచించారు. -
రూపాయి తీస్కో.. పండగ చేస్కో!
* జెండావందన వేడుకల నిర్వహణ అయోమయం * అరకొర నిధులతో ఉపాధ్యాయుల అవస్థలు * స్వీట్ కోసం ప్రతీ విద్యార్థికి ఒక్క రూపాయే.. * ఏళ్లనాటి పాత టారిఫ్‌లే అమలవుతున్న వైనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఇంద రూపాయి తీసుకో.. నోరు తీపి చేసుకొని పండగ చేసుకో పో’.. అంటోంది ప్రభుత్వం. ‘ఏంటీ రూపాయికి ఏం వస్తుంది, పీచు మిఠాయి కూడా రాదు.. అనుకుంటున్నారా? అది నిజమే కానీ, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది మరి. వివరాలలోకి వెళ్తే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయా పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మిఠాయిలు పంచుతారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతిరోజూ ఇచ్చే మెనూకు అదనంగా పండుగల రోజున మిఠాయి కూడా ఇస్తారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు అన్ని కలుపుకొని 168 వరకు ఉన్నాయి. వీటిలో 16 వేల మంది వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న వారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఇచ్చేది మాత్రం కేవలం రూ.1 మాత్రమే. దాదాపు 35 ఏళ్ల కిందట, అంటే ఒక్క రూపాయికి పావుకిలో నెయ్యి, పావుకిలో చెక్కర, ఇతర పదార్ధాలు వచ్చే సమయంలో తీసుకున్న నిర్ణయం అన్న మాట. తరాలు మారినా ఈ టారిఫ్ మాత్రం మారలేదు. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. రూపాయి పెడితే బజార్లలో సైకిల్ మీద అమ్మే పీచు మిఠాయి కూడా రావడం లేదు. కనీసం 20 గ్రాముల స్వీటు, 5 గ్రాముల కార తీసుకోవాలన్నా కనీసం రూ.10 ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన ప్రతీ హాస్టల్లో రూ.1,500 వరకు, పాఠశాలలో రూ.4 నుంచి 6.వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక పాఠశాలల్లోనైతే మిఠాయిల కోసం ప్రత్యేకంగా ఆ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో చిన్న, పెద్ద స్కూళ్లు కలుపుకుని దాదాపు 1,568 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లకు కూడా జెండా వందనం రోజున స్వీట్ ఇస్తున్నారు, కానీ స్వీట్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో పాఠశాల గోడలకు సున్నం వేయడం కోసమో, రిపేర్ కోసమో ఇచ్చే స్కూల్ మెయింటనెన్స్ నుంచి గాని, స్టేషనరీ ఖర్చుల కోసం స్కూల్ గ్రాంటు నిధుల నుంచి గాని ఆయా పాఠశాలల హెచ్ఎంలు మిఠాయిల కోసం ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా బూజుపట్టిన పాత టారిఫ్‌ను తొలగించి.. కొత్త టారిఫ్‌ను అమల్లోకి తేవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.