breaking news
Nilgiri Mountain Railway Line
-
గంటకు 9 కిలోమీటర్లు.. మనదేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు ఇదే!
Nilgiri mountain train: బిజీ జీవితాన్ని పక్కనపెట్టి.. అత్యంత నెమ్మదిగా ప్రయాణం చేయాలని ఉందా? ప్రకృతిని ఆస్వాదిస్తూ కన్నుల పండుగ చేసుకోవాలనిపిస్తోందా? అయితే మీకు పర్ఫెక్ట్ ఛాయిస్ ఈ రైలు. ఇది గంటకు 9 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఇంత ఆలస్యంగా వెళ్లే రైలునెవరైనా ఎక్కుతారా? అని సందేహించకండి. పూర్తిగా తెలుసుకుంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనుకుంటారు.మనదేశంలో విస్తృతమైన రైల్వే నెట్వర్క్ గురించి తెలిసిందే. కానీ అత్యంత నెమ్మదిగా వెళ్లడానికి ప్రసిద్ధి పొందిన ఈ రైలు తమిళనాడులోని నీలగిరి మౌంటైన్ రైల్వేలో ఉంది. ఇది అంత నెమ్మదిగా నడిచినా మీకు ఏమాత్రం బోర్ కొట్టదు. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని అత్యద్భుతంగా మలుస్తుంది అక్కడి ప్రకృతి. మెట్టుపాలెం నుంచి ఊటీ వరకు.. దట్టమైన అడవులు, పచ్చని తేయాకు తోటలు, ఎప్పుడూ నిలువెల్లా తడిసి మెరిసే రాతి కొండలు అబ్బుర పరుస్తాయి. ఇదంతా ఓకే.. కానీ ఆలస్యానికి కారణం మాత్రం.. అక్కడ ఉన్న వంతెనలు, సొరంగాలు. 100కు పైగా వంతెనల మీదుగా, 16 సొరంగాలలోంచి వెళ్తుంది. అత్యంత తీవ్రమైన ములుపులు వందకు పైనే ఉన్నాయి. మధ్యలో ఐదు స్టేషన్లు కూడా ఉన్నాయి. అందుకే 46 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఐదు గంటలు పడుతుంది. ఇది మనదేశంలో అత్యంత వేగవంతమైన రైలు కంటే సుమారు 16 రెట్లు నెమ్మది. కానీ మీరు దారి పొడవునా నీలగిరి కొండల అందాలను ఆస్వాదించవచ్చు. ఊటీ నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం గంట తక్కువ సమయం తీసుకుంటుంది.రైలు ప్రయాణానికే కాదు.. ఈ మార్గం నిర్మాణానికో చరిత్ర ఉంది. ఈ మార్గాన్ని 1854లో ప్రతిపాదించారు. కానీ ఎత్తైన పర్వతాలు ఉండటంతో ట్రాక్ నిర్మాణం చాలా కష్టమైంది. 1891లో మొదలుపెట్టి.. 1908లో పూర్తి చేశారు. ఇంతటి గొప్ప ట్రాక్‌మీద ప్రయాణించే రైలుకెంత ప్రత్యేకత ఉండాలో కదా! అందుకే ఈ రైలునూ అలాగే తయారు చేశారు. బోగీలన్నింటినీ కలపతో తయారు చేశారు. చదవండి: బాలపిట్టలూ బయటికెగరండిమేఘాలను ప్రతిబింబించే నీలి రంగు వేయడంతో వింటేజ్ భావన కలిగిస్తుంది. రైలులో నాలుగు బోగీలుంటాయి. ఫస్ట్ క్లాస్ బోగీలో 72 సీట్లు, సెకండ్ క్లాస్‌లో 100 సీట్లు ఉంటాయి. మొదట మూడు బోగీలే ఉండేవి. పర్యాటకులు పెరగడంతో అదనపు బోగీ ఏర్పాటు చేశారు. సెలవులు, వారాంతాల్లో బిజీగా ఉండే రైలులో ప్రయాణించాలంటే ముందే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
రైలు మొత్తానికి వారిద్దరే..!
ఉదకమండలం (ఊటి) : లాహిరి లాహిరి లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా.. తూగెనుగా అన్నట్టు సాగింది యూకేకు చెందిన గ్రాహం విలియం లిన్, సిల్వియా ప్లాసిక్ హనీమూన్ ట్రిప్. యునెస్కో గుర్తింపు పొందిన తమిళనాడులోని నీలగిరి పర్వతాల అందాలను ఈ జంట ప్రత్యేక రైలు (చార్టర్డ్ సర్వీసెస్)లో వీక్షించింది. 2.5 లక్షల రూపాయలు చెల్లించి ప్రత్యేక రైలులో.. ప్రత్యేక ప్రయాణం చేసిన ఇంగ్లిస్ కపుల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రసిద్ద నీలగిరి పర్వతాల పర్యటన కోసం దక్షిణ రైల్వే ‘నీలగిరి మౌంటేన్ రైల్వే’పేరిట చార్టర్డ్ రైల్వే సర్వీసులను నడుపుతుండేది. అయితే, 1997లో మొదలైన ఈ సర్వీసులు 2004లో ఆగిపోయాయి. అధునాతన కోచ్‌లు, లోకోమోటివ్స్‌ను అందుబాటులోకి తెచ్చి రైల్వే శాఖ నీలగిరి మౌంటేన్ సర్వీసులను ఈ శుక్రవారం మళ్లీ పునఃప్రారంభించింది. లక్కీగా యూకే దంపతులు విలియం, సిల్వియాకు నీలగిరి మౌంటేన్ సర్వీసుల మొదటి ట్రిప్‌లో ప్రయాణించే అవకాశం వచ్చింది. దాంతో మూడు కోచ్‌ల ప్రత్యేక చార్టర్డ్‌లో.. పచ్చని ప్రకృతి నెలవైన నీలగిరి అందాలను ఆస్వాదిస్తూ.. 13 సొరంగాల గుండా పయనించి తమ జీవితంలో మరపురాని సంతోషాల్ని సొంతం చేసుకున్నారు. 143 సీట్ల సామర్థ్యం గల రైలు మొత్తాన్ని అద్దెకు తీసుకుని ఈ యూకే జంట హనీమూన్ ట్రిప్‌ను గ్రాండ్‌గా డిజైన్ చేసుకుంది. మెట్టుపాలెం నుంచి ఊటి వరకు 48 కిలోమీటర్లు సాగిన ఈ ప్రయాణం అయిదున్నర గంటల పాటు కొనసాగింది. -
విహారం: నీలగిరులు.. పడమటి పూలబుట్ట
కూ... చుక్... చుక్... టాయ్ ట్రైన్ నీలగిరుల పర్యటనలో టాయ్‌ట్రైన్ ప్రయాణం మధురానుభూతి. మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు నడిచే ఈ లైన్‌ను నీలగిరి మౌంటెయిన్ రైల్వే లైన్ అంటారు. ఉదయం ఏడు గంటలకు మెట్టుపాలయంలో బయలుదేరి మధ్యాహ్నానికి ఊటీ చేరుతుంది. అదే రైలు తిరిగి మూడింటికి బయలుదేరి ఆరున్నరకు మెట్టుపాలయం చేరుతుంది. వేసవిలో రెండు రైళ్లు తిరుగుతాయి. ఈ రైలు ఎంత నెమ్మదిగా ప్రయాణిస్తుందంటే... ‘కూర్చుని కూర్చుని కాళ్లు పట్టేశాయనిపిస్తే రైలు దిగి నాలుగడులు వేసి తిరిగి రెలైక్కవచ్చు’ అని జోకులేస్తారు ఇందులో ప్రయాణించిన వాళ్లు. ఈ రెలైక్కడంలో ఉద్దేశం త్వరగా ఊటీ చేరడం కాకూడదు. కొండలు, సన్నని మలుపులు, పచ్చదనాలలోని లాలిత్యాలను ఆస్వాదిస్తూ చల్లదనంతో సేదదీరడమే అయి ఉండాలి. నీలగిరులు... ఈ కొండలు పన్నెండేళ్లకోసారి నీలాలను ఒలకబోస్తాయి. పుష్కర కాలానికోసారి ఈ కొండల మీద నీలం రంగులో మెరుపులీనే కురింజి పూలు ఈ కొండలకు నీలగిరులు అనే పేరుని తెచ్చిపెట్టాయి. నీలగిరులు అనగానే మనకు గుర్తొచ్చే పర్యాటక ప్రదేశం ఊటీ. అయితే అంతకంటే సుందరమైన ప్రదేశం ఊటీకి 17 కిలోమీటర్ల దూరాన ఉన్న కూనూర్. డెబ్బై, ఎనభైలలో సినిమా షూటింగులన్నీ ఇక్కడే జరిగేవి. లాంబ్స్ రాక్, డాల్ఫిన్స్ నోస్, లేడీ కేనింగ్ సీట్, లాస్ ఫాల్స్, డ్రూంగ్ హిల్స్, సిమ్స్ పార్క్, టీ తోటలు, టీ ఫ్యాక్టరీలు... ఊటీ, కూనూర్, కోటగిరి వేసవి విడుదుల్లో పర్యాటకులను అలరించే విశేషాలు. సిమ్స్ పార్కు అప్పర్ కూనూర్‌లో ఉంటుంది. ముప్పై ఎకరాల్లో విస్తరించిన సిమ్స్ పార్కులో ఉన్న పూలమొక్కలు, పైన్ లాంటి వృక్షజాతులు, ఫెర్న్ వంటి గుబుర్లు వెయ్యి రకాలు ఉంటాయి. ఏటా మే నెలలో ఈ పార్కులో పండ్లు, కూరగాయల ప్రదర్శన నిర్వహించడం సంప్రదాయం. ఈ పార్కుకి ఆ పేరు ఎలా వచ్చిందంటే... బ్రిటిష్ పాలనకాలంలో నీలగిరుల అటవీ శాఖ అధికారి జె.డి సిమ్స్ ఈ పార్కుని అభివృద్ధి చేశాడు. ఈ పార్కు అప్పట్లో మనదేశంలో ఉద్యోగం చేస్తున్న తెల్లవాళ్లకు వేసవి విడిది, వారాంతపు హాలిడే హోమ్. వాల్మీకి రామాయణంలో నీలగిరుల ప్రస్తావన ఉంది. కూనూరుకి మూడు కిలోమీటర్ల దూరాన హులికల్ దుర్గ్ ఉంది. ఇది బకాసురుడు నివసించిన ప్రదేశం అని చెబుతారు. దీనిని ఇప్పుడు టైగర్ రాక్‌ఫోర్ట్ అని పిలుస్తున్నారు. డాల్ఫిన్స్ నోస్ పాయింట్ నుంచి కేథరీన్ఫాల్స్ కనిపిస్తుంది. కూనూర్ జంక్షన్ నుంచి మెట్టుపాలయం రూట్లో ప్రయాణిస్తుంటే నీలగిరి కొండలు, బండరాళ్ల చాటు నుంచి ‘ఇక్కడ మేమూ ఉన్నాం చూడండి’ అంటున్నట్లు రెండు జలధారలు కూనూర్ నదిలోకి దూకుతుంటాయి. అవే లాస్ ఫాల్స్. కూనూర్ నుంచి 17 కిలోమీటర్లు ప్రయాణిస్తే డ్రూంగ్ వస్తుంది. ఇప్పుడు శిథిలావస్థలో ఉన్న కోటలో మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ విహారానికి వచ్చినప్పుడు బస చేసేవాడు. ఈ కోట నుంచి విస్తారమైన కొండలు, లోయల మధ్య ఉన్న పీఠభూములు కనిపిస్తాయి. ఈ వ్యూ చూడడానికే ఈ కోటకు వెళ్తారు. బహుశా టిప్పుసుల్తాన్ కూడా గొప్ప ప్రకృతి ప్రేమికుడు అయి ఉండవచ్చు. అందుకే ఇంత చక్కటి వ్యూ ఉండే ప్రదేశంలో కోట కట్టుకున్నాడు. కూనూర్ నుంచి లాంబ్స్ రాక్కెళ్లే మధ్యలోనే కనిపిస్తుంది లేడీ కేనింగ్స్ సీట్. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ భార్య లేడీ కేనింగ్. ఆమె నీలగిరుల్లో విహారానికి వచ్చినప్పుడు ఇక్కడే ఎక్కువ సేపు గడిపేది. దాంతో ఈ ప్రదేశానికి లేడీ కేనింగ్స్ సీట్‌గా నామకరణం చేసేశారు. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూ విస్తారమైన టీ తోటలు, వాటి మీదుగా కనుచూపు మేరలో లాంబ్స్ రాక్, డ్రూంగ్, లాంప్టన్స్ పీక్ కనిపిస్తాయి. వీటితోపాటు దూరంగా మెట్టుపాలయం రోడ్డు కూడ కనిపిస్తుంది. ఆ దారి వెంట ఊటీ చేరగానే బొటానికల్ గార్డెన్ స్వాగతం పలుకుతుంది. ఇది అరవై ఎకరాల ఉద్యానవనం. ఇక్కడ ఏటా మే నెలలో జరిగే ఫ్లవర్ షో చూడడానికి రెండు కళ్లు చాలవు. ఈ గార్డెన్లో 20 మిలియన్ల ఏళ్ల నాటి మహావృక్షం ఉంటుంది. ఇక్కడి నుంచి ఊటీ సరస్సు వైపుగా వెళ్తే పడవలో విహరిస్తున్న పర్యాటకులతో ఆ ప్రదేశమంతా సందడిగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన ఆకర్షణ బోట్‌హౌస్, దాని పక్కనే ఉన్న మినీ గార్డెన్. ఊటీ సరస్సులో పెడల్ బోట్, రోయింగ్ బోట్, మోటార్ బోట్లు ఉంటాయి. ఇక్కడ గిన్నిస్ రికార్డుకెక్కనున్న ఒక విచిత్రం త్రెడ్ గార్డెన్. ఈ తోటలో కనిపించే పూలు, ఆకులు, రాళ్లు, వంతెనలు కూడా దారంతో చేసినవే. ఈ గార్డెన్ కోసం 50 మంది మహిళలు పన్నెండేళ్లు శ్రమించారు. ఈ విచిత్రం గిన్నిస్ రికార్డు కోసం నామినేట్ అయింది. దాదాపుగా రెండు వందల యేళ్ల కిందట నిర్మించిన ఈ సరస్సులో చేపల వేట సరదాగా ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నించినా చేపలు దొరకవు. ఫిషింగ్‌కి ముందుగా అనుమతి తీసుకోవాలి. చేపల వేట ప్రయత్నం పూర్తయ్యాక ఊటీలో ఇంకా చూడాల్సినవి ఏంటని ఆరా తీస్తే దొడబెట్ట గురించి చెబుతారు. ఇది నీలగిరుల్లో ఎత్తై శిఖరం. నిలబడిన చోటు నుంచి కదలకుండా ఊటీ మొత్తాన్ని చూడాలంటే ఇదే సరైన ప్రదేశం. ఊటీని వదిలిన తర్వాత కనిపించే హిల్‌స్టేషన్ కోటగిరి. ఊటీ, కూనూర్లతో పోలిస్తే ప్రశాంతమైన ప్రదేశం ఇది. ఇక్కడి నుంచి మరో 15 కిలోమీటర్లు ప్రయాణిస్తే కొడనాడు వ్యూ పాయింట్ వస్తుంది. ఇది నీలగిరుల చివరి భాగం. ఇక్కడి రంగస్వామి శిఖరం, మేయార్ నది, ‘తోడ’ గిరిజనుల ఇళ్లు, ముకూర్తి శిఖరం, గోపాల స్వామి బెట్ట మీద ఉన్న పురాతన ఆలయం చూడవచ్చు. బందిపూర్ సాంక్చురీ, మధుమలై రిజర్వ్ ఫారెస్టు చూడాలంటే ఒక రోజు కేటాయించాలి. ఇక ఇక్కడ చివరగా చూడాల్సింది వంద అడుగుల ఎత్తు నుంచి దూకే కాల్హట్టి జలపాతం. కాలహట్టి, మసినగూడి లోయల్లోకి జాలువారే నీటిధారలు, వన్యప్రాణులు పర్యాటకులను అలరిస్తుంటాయి. జనవరిలో నీలగిరుల్లో పర్యటిస్తే ఊటీలో జరిగే టీ అండ్ టూరిజం ఫెస్టివల్‌ని మిస్ కాకూడదు. అలాగే టీ ఫ్యాక్టరీలలో ఇచ్చే టీ తాగకుండా ఈ పర్యటన ముగించకూడదు. ఎలావెళ్లాలి? సమీప విమానాశ్రయం: కోయంబత్తూర్. హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కి ఎకానమీ క్లాస్ టిక్కెట్ 3-4 వేల రూపాయల మధ్య ఉంటుంది. ప్రయాణ సమయం ఒకటిన్నర గంట. స్పైస్‌జెట్, జెట్ కనెక్ట్, జెట్ ఎయిర్ సర్వీసులు నడుస్తున్నాయి. కోయంబత్తూర్ నుంచి ఊటీకి 85 కి.మీ.లు. రెండున్నర గంటల ప్రయాణం. గుడలూర్, మధుమలై రిజర్వ్‌ఫారెస్ట్, మెట్టుపాలయం, కూనూర్ల మీదుగా ఊటీ చేరాలి. సమీప రైల్వేస్టేషన్: కోయంబత్తూర్ జంక్షన్. హైదరాబాద్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్), కొంగు ఎక్స్‌ప్రెస్(కాచిగూడ)లు ఉన్నాయి. 20 గం॥ప్రయాణం. పర్యటనలో మైసూర్ ఉంటే జెపి మైసూర్ ఎక్స్‌ప్రెస్‌లో మైసూరులో దిగి రోడ్డు మార్గాన నీలగిరులను చేరవచ్చు. ఎక్కడ ఉండాలి? హోటల్ దర్శన్ ఊటీ సరస్సు దగ్గరగా ఉంటుంది. ఇందులో గది అద్దె ఒక రోజుకి 1,400 రూపాయలు. ‘స్టెర్లింగ్ ఫెర్న్‌హిల్ ఊటీ’ అంతర్జాతీయ ప్రమాణాలున్న త్రీస్టార్ హోటల్. ఇందులో అద్దె మూడువేలు. కురుంబ విలేజ్ రిసార్టులో కాటేజ్ అద్దె తొమ్మిది వేల రూపాయలు. బడ్జెట్ అకామడేషన్ కావాలంటే కూనూర్ స్టేషన్ ఎదురుగా వెంకటేశ్వరా లాడ్జ్‌లో గది 450 రూపాయలు. భోజనం ఎలా? ‘లాబెల్లె వీ’ కూనూర్‌లో పేరున్న ఫ్రెంచ్ క్విజిన్. ఇండియన్ క్విజిన్ ‘క్వాలిటీ రెస్టారెంట్’. కురుంబ విలేజ్ రిసార్టులో ఇండియన్, చైనీస్, కాంటినెంటల్ రుచులు దొరుకుతాయి. రుచికరమైన ఎగ్‌బిర్యానీ గ్రీన్‌ఫీల్డ్ రెస్టారెంట్‌కి వెళ్లాలి. బర్గర్, హాట్‌డాగ్ వంటి ఫాస్ట్‌ఫుడ్, రుచికరమైన కాఫీ కావాలంటే ‘చెరీ బ్రూస్’ని సందర్శించాలి. షాపింగ్! త్రెడ్ గార్డెన్ నుంచి త్రెడ్ప్లాంట్లు, టీ పొడి, యూకలిప్టస్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, లెమన్ గ్రాస్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, హీనా ఆయిల్, నీలగిరి తైలం, తేనె. ఇంకా ఏమేమి చూడవచ్చు! వ్యాలీ వ్యూ పాయింట్... కూనూర్‌కి దగ్గరగా ఉంటుంది. ఈ లోయలో 21 గ్రామాలున్నాయి. ఇక్కడ హిందీ సినిమా సాజన్ చిత్రీకరణ జరిగింది. సెకండ్ వరల్డ్ వార్ మెమోరియల్ పిల్లర్... కూనూర్‌లో ఉంది. ఇక్కడి విల్లింగ్టన్ గోల్ఫ్‌కోర్సులో రాజా హిందూస్తానీ సినిమా పాటల చిత్రీకరణ జరిగింది. మయూర్ టీ ఎస్టేట్‌లో విహారం... ఇది మయూర్ మాల్వానీది. ఇతడు సినీనటి ముంతాజ్ భర్త. పాతిక వేల ఎకరాల ఎస్టేట్ ఇది. ఎస్టేట్‌లో ఉన్న టీ షాప్‌లో చాకొలెట్ టీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడే రకరకాల టీ పొడులు కొనుక్కోవచ్చు. కురింజి పూలు 2006లో పూశాయి. మళ్లీ ఈ పూలు పూసేది 2018లోనే.