breaking news
New Finance Minister
-
ఆర్థిక మంత్రిగా స్కాట్ బెసెంట్
వాషింగ్టన్: ప్రముఖ ఇన్వెస్టర్ స్కాట్ బెసెంట్ను అమెరికా తదుపరి ఆర్థికమంత్రిగా డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. పన్నులు తగ్గించి, దిగుమతి సుంకాలను పెంచుతానని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కీ స్క్వేర్ గ్రూపు వ్యవస్థాపకుడైన బెసెంట్‌పై ఉంటుంది. ‘అంతర్జాతీయ ఇన్వెస్టర్‌గా, ఆర్థిక వ్యూహకర్తగా స్కాట్ బెసెంట్ పేరు ప్రతిష్టలు గడించారు’అని ఆయన నియామకాన్ని ప్రకటిస్తూ ట్రంప్ అన్నారు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ కమిషనర్‌గా మార్టీ మాకరీని నియమించారు. అలాగే పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా స్కాట్ టర్నర్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. -
బ్రిటన్ ఆర్థికమంత్రి క్వాసిపై వేటు
లండన్ : బ్రిటన్ ఆర్థిక మంత్రి క్వాసీ క్వార్టెంగ్పై ప్రభుత్వం వేటు వేసింది. క్వాసీని పదవి నుంచి ప్రధానమంత్రి లిజ్ ట్రస్ తొలగించారు. గత నెలలో క్వాసీ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. దీంతో క్వాసీని ఆర్థిక మంత్రిగా తప్పించి ఆయన స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారు. కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో క్షీణించిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి పన్నుల్లో భారీగా కోత విధిస్తూ క్వాసీ రూపొందించిన మినీ బడ్జెట్ బెడిసికొట్టింది. దేశ ఖజానాకు ఇతర ఆదాయ మార్గాల ను చూపించకుండా దాదాపుగా 4,500 కోట్ల పౌండ్ల పన్ను మినహా యింపులనిస్తూ బడ్జెట్‌ను రూపొందించడంతో స్టాక్ మార్కెట్లు కుప్ప కూలాయి. ప్రధానికి క్వాసీ సన్నిహితుడు కావడంతో గత కొద్ది రోజులుగా లిజ్ మినీ బడ్జెట్‌ను సమర్థిస్తూ వచ్చారు. అన్ని వైపుల నుంచి వచ్చిన విమర్శలతో క్వాసీని తప్పించాల్సి వచ్చింది. క్వాసీని తప్పించినందుకు లిజ్ ట్రస్ ఆయనకు రాసిన లేఖలో సారీ చెప్పడమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బడ్జెట్ దేశానికి మంచి చేస్తుందని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో ఆర్థిక మంత్రిగా నియమితులైన జెరెమీ హంట్ ప్రధాని పదవికి గతంలో పోటీ పడ్డారు. ఇలాంటి సమయంలో ఆర్థికమంత్రి పదవిని చేపట్టడం హంట్‌కు పెద్ద సవాల్‌గా మారింది. -
ధరలకు కళ్లెం.. వృద్ధికి ఊతం
న్యూఢిల్లీ: అధిక ధరలకు కళ్లెం వేయడంతోపాటు మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలోపెడతామని కొత్త ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మంగళవారం ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ద్రవ్యలోటును కట్టడి చేస్తూనే... వృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందించేందుకు కృషిచేస్తామని చెప్పారు. ‘ఆర్థిక వ్యవస్థ కొంతకాలంగా క్లిష్టపరిస్థితుల్లో కొనసాగుతోంది. సవాళ్లు చాలానే ఉన్నాయి. మళ్లీ వృద్ధి రేటును పరుగులు పెట్టించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడం, ఆర్థిక క్రమశిక్షణపైనా దృష్టిపెట్టనున్నాం’ అని జైట్లీ వ్యాఖ్యానించారు. కాగా, రక్షణ శాఖను తాను అదనపు బాధ్యతలుగా మాత్రమే నిర్వహించనున్నానని కూడా ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో కేబినెట్ విస్తరణ జరిగేవరకూ ఈ శాఖ తనవద్ద ఉంటుందన్నారు. తద్వారా తన ప్రధాన కర్తవ్యమంతా ఆర్థిక వ్యవహారాలపైనేనని తేల్చిచెప్పారు. చాలా సవాళ్లున్నాయని తెలుసు... అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల్లో తాను ఆర్థిక శాఖ పగ్గాలను చేపడుతున్నానని... ముఖ్యంగా దేశ ఆర్థిక వ్యవస్థ పట్ల అన్నివర్గాల్లో విశ్వాసాన్ని తిరిగి పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ‘మాకు ప్రజల నుంచి లభించిన స్పష్టమైన మెజారిటీలోనే మాపై వాళ్లు ఎంత నమ్మకం పెట్టుకున్నారన్నది అవగతమవుతుంది. దేశంలో జరిగిన రాజకీయ మార్పు ఇప్పటికే అటు విదేశీ, ఇటు దేశీ ఇన్వెస్టర్లకు పటిష్టమైన సంకేతాలను పంపింది. రానున్న రెండు నెలల్లో ప్రభుత్వంలో సత్వరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే ప్రక్రియ జరుగుతుంది. కొద్ది రోజుల్లోనే ప్రధాని మోడీ నేతృత్వంలోని తమ సర్కారు అనుసరించనున్న మొత్తం విధానపరమైన చర్యలకు సంబంధించి వివరాలను ప్రకటిస్తాం’ అని జైట్లీ వివరించారు. వృద్ధిని పణంగాపెట్టి ద్రవ్యోల్బణం అదుపునకు అధిక ప్రాధాన్యమిస్తారా అన్న ప్రశ్నకు... రెండింటి మధ్య సమతూకంతో కూడిన చర్యలు ఉంటాయని ఆర్థిక మంత్రి చెప్పారు. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు 9 శాతం జీడీపీ వృద్ధిని సాధించిన భారత్... ఆతర్వాత క్రమంగా మందగమనంలోకి జారిపోయిన సంగతి తెలిసిందే. 2012-13లో అత్యంత ఘోరంగా 4.5 శాతం వృద్ధి నమోదుకాగా.. గతేడాది(2013-14)లో 4.9 శాతానికి పరిమితమైంది ప్రస్తుతం 2014-15 ఏడాదిలో వృద్ధి రేటు 5.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రంగంలోకి దిగిన మరికొందరు మంత్రులు... కాగా, మోడీ కేబినెట్లోని మరికొంతమంది కీలక మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించి రంగంలోకి దిగారు. ప్రధానంగా గత ఒప్పందాలకూ అమలయ్యేలా పన్ను చట్టాల్లో చేసిన మార్పులు(రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్)పై కొత్త టెలికం, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సానుకూలంగా స్పందించారు. దీనిపై దేశీ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో.. విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షించేవిధంగా స్థిరమైన పన్నుల విధానాన్ని తీసుకొస్తామని ఆయన హామీనిచ్చారు. ఉపరితల రవాణా, హైవేలు, షిప్పింగ్ శాఖ మంత్రిగా నితిన్ గడ్వారీ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కల్రాజ్ మిశ్రా, ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్, భారీ పరిశ్రమలు-ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి అనంత్ గీతే కూడా ఇంకా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కాగా, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ మాత్రం మంగళవారమే తన కార్యాలయంలో ఆసీనులయ్యారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)ను పటిష్టం చేయడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థంగా తీర్చిదిద్దనున్నట్లు బాధ్యతల స్వీకరణ అనంతరం వ్యాఖ్యానించారు. ఇంధన సరఫరా, విద్యుత్ ప్రాజెక్టుల మధ్య సమన్వయం పెంచి, దేశంలో విద్యుత్ కొరతలు లేకుండా చూస్తామని విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఇక సహజవాయువు ధరల పెంపు, ఇంధన ధరలపై ప్రభుత్వ నియంత్రణల తొలగింపు వంటి అంశాలపై నిర్ణయాల్లో సామాన్యుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ చెప్పారు. రిటైల్‌లో ఎఫ్‌డీఐకి నో..? న్యూఢిల్లీ: దేశంలోని చిరు వ్యాపారులను, రైతులను దెబ్బతీసే మెగా స్టోర్ల ఏర్పాటుకు విదేశీ రిటైలర్లను మోడీ సర్కారు అనుమతించకపోవచ్చు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నూతన మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై బీజేపీ తన వైఖరిని ఎన్నికల మేనిఫెస్టోలో వెల్లడించిందని ఆమె చెప్పారు. కేంద్ర మంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతిస్తే చిల్లర వర్తకులు, చిన్నకారు రైతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పారు. మల్టీ బ్రాండ్ రిటైల్ రంగం మినహా ఉద్యోగాల కల్పన, ఆస్తుల సృష్టి, మౌలిక సౌకర్యాలు, అత్యాధునిక టెక్నాలజీ సమకూర్చుకోవడానికి దోహదపడే రంగాల్లో ఎఫ్‌డీఐని అనుమతిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. మునుపటి యూపీఏ ప్రభుత్వం రిటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐని అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు బ్రిటన్‌కు చెందిన టెస్కో కంపెనీ ఎఫ్‌డీఐ ప్రతిపాదనను మాత్రమే ఆమోదించారు. రాజన్‌తో తొలి భేటీ... కొత్త విత్తమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అరుణ్ జైట్లీ.. ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో దేశంలో ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం ఇతరత్రా అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంగళవారం జైట్లీని కలిసిన అనంతరం రాజన్ మాట్లాడుతూ... ధరల కట్టడే తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచుతూనే వృద్ధికి ఊతమిచ్చేలా ఆర్బీఐ సమతూకాన్ని పాటిస్తోం దని.. దీన్ని ఇకపైనా కొనసాగిస్తామన్నారు. జూన్ 3న ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనున్న తరుణంలో కొత్త ఆర్థిక మంత్రితో రాజన్ భేటీ జరగడం గమనార్హం. వీరిరువురూ 50 నిమిషాల పాటు చర్చిం చుకున్నట్లు తెలుస్తోంది. బంగారం దిగుమతులపై నియంత్రణ సడలింపుపై స్పందిస్తూ విధాన నిర్ణయాల సందర్భంగా తగిన చర్యలు ఉంటాయన్నారు. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ జైట్లీతో సమావేశమమాయ్యారు. బంగారం దిగుమతులపై ఆంక్షల ఎత్తివేత గురించి అడిగిన ప్రశ్నకు... తాము ప్రస్తుత పరిస్థితులను చాలా జాగ్రత్తగా బేరీజువేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.