breaking news
nano chip
-
కణం..వశీకరణం
నానో చిప్‌తో వైద్యం కొత్త పుంతలు! ప్రసాద్‌కు గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడు కణాలు వేగంగా నాశనమవుతున్నాయి. ఇంతలో డాక్టర్లు నల్లటి చిప్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని తలపై పెట్టి.. చిన్న కరెంటు షాక్ ఇచ్చారు! వారం గడిచింది. ప్రసాద్ కోలుకుంటున్నాడు. మెదడు కణాలూ మళ్లీ చైతన్యవంతమవుతున్నాయి! ఇదేదో సినిమా కథ కానేకాదు. ఇంకొన్నేళ్లలో వాస్తవ రూపం దాల్చనున్న వినూత్న టెక్నాలజీ కథ! – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ఒహాయో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా భవిష్యత్తులో ఒక్క గుండెపోటుకే కాదు అనేక ఇతర ఆరోగ్య సమస్యలకూ మెరుగైన చికిత్స అందుబాటులోకి రానుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మూలకణాల గురించి తెలుసుకోవాలి. శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగల సత్తా వీటి సొంతం. పిండ మూలకణాలు, అడల్ట్ స్టెమ్‌సెల్స్ అని ఇవి 2 రకాలు. పిండమూల కణాలు శరీరంలోని ఏ కణంగానైనా మారిపోగలవు. అడల్ట్ స్టెమ్‌సెల్స్‌కు పరిమిత స్థాయిలోనే ఈ సామర్థ్యముంటుంది. గుండె కండరంలో ఉండే అడల్ట్ స్టెమ్‌సెల్స్ ఆ అవయవం తాలూకూ కణాలుగానే మారగలవు. కొన్ని ప్రక్రియల ద్వారా అడల్ట్ స్టెమ్‌సెల్స్‌ను కూడా పిండమూల కణాలుగా మార్చేందుకు అవకాశముంది. ఇప్పటివరకూ ఇది పరిశోధనశాలకే పరిమితం కాగా.. ఒహాయో శాస్త్రవేత్తలు శరీరంలో ఉండే సాధారణ కణాలనూ పిండమూలకణాలుగా మారిపోయేలా చేయగలిగారు. ఇందుకోసం నానోటెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన ఒక చిప్‌లాంటి పరికరాన్ని వాడారు. టిష్యూ నానో ట్రాన్స్‌ఫెక్షన్ (టీఎన్టీ) అని పిలుస్తున్న ఈ వినూత్న టెక్నాలజీని అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదే మానవులపై ప్రయోగించడం మొదలుపెట్టవచ్చు. ఎలుకలు, పందుల్లో ప్రయోగాలు.. ఈ టెక్నాలజీని పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు ఎలుకలు, పందులపై కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. నానో చిప్ సాయంతో ఎలుకల చర్మకణాలను నాడీ కణాలుగా మార్చేసి రక్తనాళాలు బాగా దెబ్బతిన్న ఎలుక కాలిని సరిచేశారు. నానో చిప్ సాయంతో చర్మకణాలనే నాడీ కణాలుగా మార్చేసి మెదడు దెబ్బతిన్న ఎలుకల్లోకి జొప్పించి పరిస్థితిని చక్కదిద్దారు. ‘‘ఈ టెక్నాలజీ 98 శాతం కచ్చితంగా పనిచేస్తుంది. నొప్పి కూడా తెలియనంత సూక్ష్మస్థాయిలో కరెంటు షాక్ ఇవ్వడం ద్వారా ఒక సెకను కాలంలో ఒకరకమైన కణాలను మనకు అవసరమైన కణంగా మార్చేయగలిగాము. పైగా ఇదంతా శరీరం లోపలే జరుగుతుండటం వల్ల కొత్త కణాలను రోగ నిరోధక వ్యవస్థ తిరస్కరించేందుకూ అవకాశం ఉండదు’’ అని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి వైద్యుడు డాక్టర్ చందన్ సేన్ అన్నారు. ఏముంటాయి... ఈ టెక్నాలజీలో రెండు ప్రధాన భాగాలున్నాయి. మొదటిది నానో చిప్. దీంట్లో కణాలను మూలకణాలుగా మార్చేందుకు అవసరమైన సామగ్రి (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ వంటివి) ఉంటుంది. ఇక రెండో భాగం మనం తయారు చేయాలనుకుంటున్న కణం (గుండె, నాడీ, రక్తనాళం వంటివి) తాలూకూ సమాచారం. నానో చిప్‌కు కరెంట్ షాక్ ఇచ్చినప్పుడు అందులోని డీఎన్ఏ, ఆర్ఎన్ఏలు నేరుగా కణాలను చేరుకుని ఉన్న సమాచారానికి తగ్గట్టుగా కావాల్సిన కణాలు తయారవుతాయన్నమాట. అడల్ట్ స్టెమ్‌సెల్స్‌ను సేకరించి పరిశోధనశాలలో పిండ మూలకణాలుగా మార్చడం, ఆ తర్వాత దాన్ని అవసరమైన అవయవం వద్ద జొప్పిం చడం ఇప్పటివరకూ అనుసరిస్తున్న పద్ధతి. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ కొత్త కణాలను తిరస్కరించడం లేదా అవసరమైన మేరకు కొత్తకణాలు అందించలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడ్డాయి. వీటన్నింటికీ టీఎన్‌టీతో చెక్ పెట్టవచ్చునని అంచనా. -
కేన్సర్ ను ముందుగానే గుర్తించే నానో చిప్!
లండన్: మనం ఎంతో సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా ప్రాణాంతక వ్యాధి కేన్సర్ ను ముందుగానే ఎందుకు కనిపెట్టడం లేదని చాలాసార్లు భావించే ఉంటాం. ఆదిలోనే ఆ వ్యాధిని కనిపెడితే తగిన వైద్యంతో బయటపడవచ్చనే ఆలోచన కూడా మనకు ఒకసారైనా వచ్చే ఉంటుంది. తాజాగా కేన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తించే ఓ పరికరాన్ని మన ముందుకు తీసుకువస్తున్నారు శాస్త్రవేత్తలు. దీనికి గాను ఒక నానో చిప్ పరికరాన్ని స్పెయిన్ కు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. కేన్సర్ లక్షణాల కల్గిన వ్యక్తి యొక్క ఒక చుక్క రక్తాన్ని ఆ మైక్రో చిప్ లో ప్రవేశపెట్టి పరీక్ష చేస్తారు. దాంతో కేన్సర్ పై ఒక నిర్దారణకు వచ్చిన తరువాత డాక్టర్లు వైద్యం చేసే వెసులుబాటు ఉంటుందని ప్రొఫెసర్ రొమైన్ కిదాంత్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన పరికరమే కాకుండా చాలా శక్తివంతంగా పనిచేస్తుందన్నారు. మనకు రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు శరీరంలో దాగి ఉన్న కేన్సర్ కారకులు దాడికి పాల్పడుతుంటాయి. ఇలా ఈ రకంగా జరిగినప్పుడు శరీరంలోని కణాలు విడిపోయి కేన్సర్ కు దారి తీస్తుంది. అదే మనకు కేన్సర్ సోకిందని ముందుగానే తెలిస్తే.. దానికి తగిన వైద్యంతో ఆ కారకాల్ని నిర్మూలించేందుకు యత్నిస్తాం. ఇప్పటివరకూ కేన్సర్ అనేది మూడో స్టేజ్ లో గాని, నాలుగో స్టేజ్ లో గాని బహిర్గతమవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి అవకాశం చాలా తక్కువ. త్వరలో మన ముందు రాబోయే ఈ చిన్నపాటి పరికరం కేన్సర్ నిర్మూలనకు ఎంతగా దోహద పడుతుందో వేచి చూడాలి.