breaking news
modular homes
-
లారీలో ‘హోమ్’ డెలివరీ.. ఏమిటీ కంటైనర్ హోమ్?
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాత ఆరోగ్యకరమైన జీవితంపై అందరికీ శ్రద్ధ పెరిగింది. తినే తిండి నుంచి ఉండే ఇల్లు వరకూ ఎక్కడా రిస్క్ తీసుకోవట్లేదు. సేంద్రియ ఆహార ఉత్పత్తులు తింటూ పచ్చని ప్రకృతి ఒడిలో నివాసం ఉండాలని భావిస్తున్నారు. కనీసం ఇంటి చుట్టూ నాలుగు చెట్లయినా ఉండాలనుకుంటున్నారు. ఫలితంగా ఫామ్‌హౌస్‌లకు, ఫామ్ ప్లాట్లకు డిమాండ్ పెరిగింది. ఫామ్‌హౌస్‌లు కొనుగోలు చేయలేనివారు ఫామ్ ప్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఫామ్ ప్లాట్లలో నివాస భవనాలకు నిర్మాణ అనుమతులు రావు. దీంతో కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కంటైనర్ హోమ్స్ (మాడ్యులర్ హోమ్స్)కు గిరాకీ పెరిగింది. ఇల్లులా ఏర్పాటు చేయడానికి అవసరమైనవన్నీ ఫ్యాక్టరీలో తయారు చేసి, లారీలో తీసికొచ్చి బిగించేస్తున్నారు. శామీర్‌పేట, కొంపల్లి, కందుకూరు, చేవెళ్ల, భువనగిరి, సదాశివపేట, ఆదిభట్ల, మేడ్చల్ వంటి శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లలో కంటైనర్ హోమ్స్ ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నారు. విదేశాల్లో మాదిరిగా ఇప్పుడిప్పుడే ఆఫీసులు, హోటళ్లు, వసతి గృహాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలలో ఈ తరహావి ఏర్పాటు చేసేందుకు యజమానులు ముందుకొస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కూడా చాలామంది ఫామ్ ప్లాట్లలో కంటైనర్ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారాంతంలో కుటుంబంతో కలిసి పచ్చని వాతావరణంలో సరదాగా గడుపుతున్నారు. ఏమిటీ కంటైనర్ హోమ్? ►కంటైనర్ హోమ్స్‌ను గ్యాల్వనైజింగ్ స్టీల్ షీట్లతో తయారు చేస్తారు. కింద భాగంలో గ్రిడ్ వేసి సిమెంట్, కలప మిశ్రమంతో తయారైన బైసన్ బోర్డ్ వేస్తారు. దానిపైన పాలీ వినైల్ ఫ్లోర్ (పీవీసీ) ఉంటుంది. పీవీసీ వద్దనుకుంటే బైసన్ బోర్డ్ మీద టైల్స్ కూడా వేసుకోవచ్చు. ►ఇంటి బీమ్‌లు, ఫౌండేషన్ స్ట్రక్చర్లను ఉక్కుతో నిర్మిస్తారు. గాల్వనైజ్ పూత ఉంటుంది. ప్రధాన స్ట్రక్చరల్ ఫ్రేమ్, ఫ్లోర్, బాహ్య, అంతర్గత గోడలు, సీలింగ్ ప్యానల్స్లను ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ప్రీ ఫినిష్డ్ వ్యాల్యుమెట్రిక్ కన్స్ట్రక్షన్ (పీపీవీసీ)లతో రూపొందిస్తారు. ►తలుపులు, కిటికీలు ఇంపాక్ట్ రెసిస్టెంట్ గ్లాస్‌లతో ఏర్పాటు చేస్తారు. గాలి, తేమలను నిరోధించేలా నాన్ వుడ్ కాంపోజిట్, సిమెంట్ బోర్డ్‌లతో బహుళ పొరలను ఏర్పాటు చేస్తారు. థర్మల్ ఇన్సులేషన్‌తో వాల్ ప్యానెల్ క్లాడింగ్లను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వేడి ఇంటి లోపలికి రాదు. బయటి వాతావరణం కంటే 6–7 డిగ్రీల తక్కువ ఉష్ణోగత ఉంటుంది. ►నిర్మాణ సామగ్రి తయారీలో బహుళ జాతి కంపెనీలైన సెయింట్ గోబైన్, గైప్రోక్ల నైపుణ్య కార్మికులు ఈ కంటైనర్ హోమ్స్‌ను తయారు చేయడంలో సిద్ధహస్తులు. స్ట్రక్చరల్ ఇంజనీర్, ఆర్కిటెక్ట్‌ల సమక్షంలో వీటిని తయారు చేస్తారు. విస్తీర్ణాన్ని బట్టి కంటైనర్ హోమ్స్ ధరలు ఉంటాయి. మన అభిరుచుల మేరకు హాల్, కిచెన్, బెడ్రూమ్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి ఏ వసతులనైనా ఏర్పాటు చేసుకోవచ్చు. నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లొచ్చు.. ఈ కంటైనర్ హోమ్స్‌కు స్ట్రక్చరల్ వారంటీ 50–60 ఏళ్లు ఉంటుంది. ఇంటి తయారీలో వినియోగించిన అంతిమ ఉత్పత్తి డ్యూరబుల్ వారంటీ 25 ఏళ్లు ఉంటుంది. ఈ కంటైనర్ హోమ్స్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించవచ్చు. వీటిని మెటల్‌తోనే తయారు చేస్తారు కాబట్టి డబ్బులు తిరిగొస్తాయి. ఎక్కువ నష్టం ఉండదు. కరోనా టైంలో కట్టించా.. నా పేరు కిశోర్, డిజైనర్‌గా ఉద్యోగం చేస్తున్నా. కరోనా రెండో దశలో మా కుటుంబ సభ్యులకు వైరస్ వచ్చింది. ఆ సమయంలో చుట్టుపక్కల వాళ్లతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. జనావాసాలకు దూరంగా ఇల్లు ఉంటే బెటర్ అనిపించింది. దీంతో విశాఖపట్నంలోని కోడూరులో ఉన్న ఫామ్ప్లాట్లో రెడీమేడ్ ఇల్లు కట్టించుకోవాలనుకున్నా. తక్కువ ఖర్చుతో, త్వరగా పూర్తయ్యే ఇల్లయితే బాగుంటుందని పరిశోధన చేసిన తర్వాత 1,200 చ.అ. 2 బీహెచ్‌కే మాడ్యులర్ హోమ్ కట్టించుకున్నా. 4 నెలల్లో నిర్మాణం పూర్తయింది. రూ.20 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు కరోనా బెడద తొలగడంతో సొంతింటికి వచ్చేశాం. కానీ ప్రతి వీకెండ్‌కు అందరం అక్కడికి వెళ్లి పచ్చని వాతావరణంలో గడిపి వస్తున్నాం. హోటల్ రూమ్‌కు బదులు చిన్న ఇంట్లో.. నా పేరు చైతన్య. విజయవాడలో వ్యాపారిని. నాకు పటాన్‌చెరులోని ముత్తంగిలో 1,600 గజాల స్థలం ఉంది. పని మీద హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఒకట్రెండు రోజులో సిటీలో ఉండాల్సి వస్తుంది. లాడ్జిలో లేదా తెలిసిన వాళ్ల ఇళ్లల్లో ఉండే బదులు నా సొంత స్థలంలో చిన్నపాటి ఇల్లు కట్టించుకుంటే అయిపోతుంది కదా అనిపించింది. అలా 1,100 చ.అ మాడ్యులర్ హోమ్ కట్టించుకున్నా. చ.అ.కు రూ. 1,300 చొప్పున రూ.14.30 లక్షలు అయింది. ఇంటీరియర్, ఇతరత్రా వ్యయాలు కలిపి మొత్తం రూ.16 లక్షలు ఖర్చయింది. సిటీకి వచ్చినప్పుడల్లా ఇందులోనే ఉంటున్నా. స్థలాన్ని ఎవరైనా కబ్జా చేస్తారేమోనన్న భయం కూడా పోయింది. ఫామ్‌హౌస్‌లలో డిమాండ్ ఉంది కరోనా తర్వాతి నుంచి కంటైనర్ హోమ్స్‌కు డిమాండ్ ఏర్పడింది. చాలా మంది ఫామ్ ప్లాట్లను కొనుగోలు చేశారు. వాటిల్లో ఈ హోమ్స్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఫ్యామిలీకి అవసరమైన వసతులన్నీ ఈ కంటైనర్ హోమ్స్‌లో ఉంటుండటంతో వీకెండ్లో ఫ్యామిలీతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుతున్నారు. – భరత్ తేజ్, ఎండీ, అర్బన్ శాస్త్ర స్మార్ట్ బిల్డ్ -
గూగుల్ ఉద్యోగులకు మాడ్యులర్ ఇళ్లు
న్యూయార్క్: ఐటీ కంపెనీలకు నిలయమైన అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఇళ్ల కొరత తీవ్రంగా ఉండి, ఇంటి ధరలు ఆకాశాన్ని అందుకోవడంతో గూగుల్ కంపెనీ తమ ఉద్యోగుల సౌకర్యార్థం ఏకంగా 300 మాడ్యులర్ ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు గూగుల్ మాతృసంస్థ అయిన అల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ ఈ రంగంలోకి కొత్తగా అడుగుపెట్టిన ‘ఫ్యాక్టరీ ఓఎస్’తో మూడు కోట్ల డాలర్ల ఒప్పందం చేసుకుంది. నిర్దిష్ట వాతావరణంగల ఫ్యాక్టరీలో ఈ మూడు వందల మాడ్యులర్ ఇళ్లను నిర్మించి ఫ్యాక్టరీ ఓఎస్ కంపెనీ గూగుల్ చెప్పిన చోటుకు వాటిని తరలిస్తుంది. మియామి, డెట్రాయిడ్, న్యూయార్క్ రాష్ట్రాల్లో కూడా ఇళ్ల కొనగోళ్లు అతి భారంగా మారడంతో స్థానిక ప్రజలంతా ఇప్పుడు మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నారు. తాము నిర్మించిన ఇళ్లలో అద్దెకు ఉండడం వల్ల నెలకు ఎవరైనా తమ అద్దెలో 700 డాలర్లు పొదుపు చేయవచ్చని ‘ఫ్యాక్టరీ ఓఎస్’ వ్యవస్థాపక సీఈవో రిక్ హోలీడే చెబుతున్నారు. అలమెడా, శాంతాక్లారా, శాన్‌మాటియో సహా సిలికాన్ వ్యాలీలో 2012లో ఇళ్ల ధరలు 535,614 డాలర్లు ఉండగా, అది 2016 నాటికి 888,444 డాలర్లకు చేరుకుందని ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ట్రూలియా’ తెలిపింది. ఇళ్ల రియల ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల కోసం మాడ్యులర్ ఇళ్లనే ఆశ్రయిస్తున్నాయి. ఫేస్బుక్ ఇన్కార్పొరేషన్ మెన్లోపార్క్లో తమ ఉద్యోగుల కోసం 1500 ఇళ్లను నిర్మించాలనుకుంటోంది. ఇక్ ఆపిల్ కంపెనీ కాలిఫోర్నియాలోని క్యూపర్టినోలో 28 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా నిర్మించిన సర్కులర్ భవనంలోకి తమ వేలాది మంది ఉద్యోగులను తరలించాలని నిర్ణయించింది.