K.Vishwanath
-
లెజెండరీ దర్శకుడి బర్త్‌డే
-
సస్పెన్స్ కాంట్రాక్ట్
కాంట్రాక్ట్ కుదిరింది. కానీ.. ఎవరు? ఎవరితో? దేనికోసం? కాంట్రాక్ట్ కదుర్చుకున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే. అర్జున్ హీరోగా సంజయ్ గొడావత్ సమర్పణలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ఎస్ సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తు్తన్న చిత్రం ‘కాంట్రాక్ట్’. కన్నడ నటి రాధికా కుమారస్వామి కథానాయిక. సీనియర్ దర్శకులు కె.విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నటుడు జేడీ చక్రవర్తి విలన్ పాత్రధారి. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ తమ్ముడు ఫైజల్ ఖాన్ ఈ సినిమాతో సౌత్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. దర్శక–నిర్మాత సమీర్ మాట్లాడుతూ–‘‘యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. అర్జున్ మల్టీ మిలియనీర్ పాత్రలో నటిస్తున్నారు. టాకీపార్ట్‌తో పాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తి అయింది. ఓ పాటను మహారాష్ట్రలో, రెండు పాటలను థాయ్‌లాండ్‌లో చిత్రీకరించనున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సుభాష్ ఆనంద్. కెమెరా: అమీర్లాల్. -
కె.విశ్వనాథ్‌కు మోదీ అభినందన
న్యూఢిల్లీ: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. సినిమారంగ అభివృద్ధికి వీరి సృజనాత్మకత, వీరు చేస్తున్న కృషి మరువలేనివన్నారు. దాదాసాహెబ్ అవార్డు అందుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌పై ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించారు. ‘కె. విశ్వనాథ్ ఓ గొప్ప దర్శకుడిగా విశిష్టతను సంపాదించుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు ఆయనకు నా శుభాకాంక్షలు’ అని ట్వీటర్లో మోదీ పేర్కొన్నారు. -
శాస్త్రీయ సంగీతానికి తరగని ఆదరణ
ప్రముఖ సినీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ అనంతపురం కల్చరల్ : శాస్త్రీయ సంగీతానికి, నాట్యానికీ ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. మారుతున్న కాలానికనుగుణంగా సినిమా వస్తువులోనూ మార్పు వస్తోందని కళాతపస్వి కె. విశ్వనాథ్ పేర్కొన్నారు. శనివారం ఆయన నగరంలో ఓ సంగీతోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శాస్త్రీయ సంగీతం, నేటి సినిమాలు తదితర విషయాలపై ప్రత్యేకంగా ముచ్చటించారు. సాక్షి : శంకరాభరణం లాంటి సినిమాలను మళ్లీ మీ నుంచి ఆశించొచ్చా? విశ్వనాథ్ : ఎప్పుడేమవుతుందో చెప్పలేం. శంకరాభరణమే కాదు సాగర సంగమం, సిరివెన్నెల ప్రతీది దేని ప్రత్యేకత దానిది. ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. సాక్షి : ఇప్పుడొస్తున్న సినిమాలు యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. దీనికేమిటి పరిష్కారం ? విశ్వనాథ్ : సినిమాలే కాదు..నిత్యం వస్తున్న టీవీ సీరియళ్లు ఆడవారిని విలన్లుగా చూపుతున్నాయి. మంచి విషయాన్ని చూడాలంటేనే కనిపించడం లేదు. టీవీకి ఇంటిల్లిపాది బానిసగా మారిపోతున్నారు. చాలా వరకు నేటి యువతలో బాగా అసహనం పెరిగిపోయింది. సాక్షి : యువతను మంచి సినిమాలు మార్చలేవా ? విశ్వనాథ్ : పూర్వం చాలా సినిమాలు చూసి మారిన సందర్భాలెన్నో ఉన్నాయి. కానీ సందేశాత్మకంగా తీయాలంటే నిర్మాతలు భయపడాల్సివస్తోంది. తల్లిదండ్రుల అతి ప్రేమ పిల్లల్లో మార్పుకు ప్రధాన కారణంగా ఉంటోంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మంచి విషయాలపట్ల వారి మనసు మళ్లించాలి. సాక్షి : నేటి సినిమాలు పూర్తీగా కమర్షియల్‌గా మారిపోతున్నాయన్న విమర్శకు మీరేమంటారు? విశ్వనాథ్ : సినిమా అంటేనే వ్యాపారం. అయితే దురదృష్టవశాత్తు వ్యాపారమే సినిమాగా మారిపోతోంది. అందుకు అనేక కారణాలుండొచ్చు. మంచి విషయాలను చెప్పే నిర్మాతలు ఇప్పటికీ ఎంతో మంది ఉన్నారు. ప్రేక్షకులు వాటిని ఆదరించాలి. సాక్షి : పూర్వం శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు ఆడేవి. ఈనాడు గట్టిగా నెలరోజులు ఆడడం లేదు. మళ్లీ అలాంటి రోజులెలా వస్తాయి ? విశ్వనాథ్ : మా రోజుల్లో సినిమాను తపస్సుగా భావించేవాళ్లం. ఇప్పుడంతా వ్యాపార దృక్పథమే. మొదటిరోజే రెండు వందల నుండి నాల్గు వందల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ ధోరణి సినిమాను ఎక్కువ కాలం గుర్తుంచుకునేలా చేయడం లేదు. దానికి తోడు పైరసీ భూతం మంచి సినిమాను తినేస్తోంది. సాక్షి : సినిమాల్లో మంచి మార్పునకు దోహదపడిన మీరు.. టీవీల ద్వారా కూడా మార్పు తెచ్చే అవకాశముందా ? విశ్వనాథ్ : మన చేతుల్లో లేదు. మంచి జరగాలనుకుంటే భగవంతుడు నా ద్వారా చేయిస్తాడేమో. అయినా నేటి టీవీ సీరియళ్లకు రేటింగే ముఖ్యం. నేను చేస్తే రేటింగ్ ఉండదేమో. సాక్షి : వృద్ధాప్యం హాయిగా సాగాలంటే మీరిచ్చే సలహాలేంటి ? విశ్వనాథ్ : వార్థక్యం భయంకరమైనదేమీ కాదు. కాకపోతే అతిగా ఉండే అటాచ్మెంట్ వల్ల టెన్షన్స్ ఎక్కువవుతున్నాయి. వయసుపెరిగే కొద్దీ కొంతైనా అటాచ్మెంట్ తగ్గించుకుని ఆధ్యాత్మిక భావనలు పెరిగితే ఏ స్థితైనా హాయిగానే ఉంటుంది. -
నాణ్యతకు మారుపేరు రామ్రాజ్ కాటన్
న్యూశాయంపేట : వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచుతున్న ఘనత ‘రామ్రాజ్ కాటన్’కు దక్కుతుందని కళా తపస్వి కె.విశ్వనాథ్ అన్నారు. వేలాది మంది చేనేత కార్మికులకు ఆ సంస్థ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఆదివారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట ఏర్పాటుచేసిన రామ్రాజ్ కాటన్ షోరూమ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ పర్యావరణానికి ఏమాత్రం హాని చేయని తెలుపు రంగు దుస్తులను తయారుచేసి, విక్రయిస్తూ ఆ సంస్థ తేటతెలుపు విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. అనంతరం రామ్రాజ్ కాటన్ అధినేత కె.ఆర్.నాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థకు నిజాయతీ, అణకువలే మూలధనమన్నారు. జిల్లాలోని వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యమన్నారు. షోరూం అధినేత కైలాసం, భాస్కర్, చాంబర్ ఆఫ్ కామర్స్ నేతలు కటకం పెంటయ్య, గజ్జల రమేష్‌బాబు, పాల్గొన్నారు. -
క్లాసికల్ డ్యాన్స్‌తోనే భవిష్యత్తు..
బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి : ‘ఏ డ్యాన్స్‌లో రాణించాలనుకున్నా ముందస్తుగా సంప్రదాయ నృత్యం సాధన చేయాల్సిందే. క్లాసికల్ డ్యాన్స్‌లో ప్రావీణ్యం సాధిస్తే ఏ డ్యాన్సయినా సులువుగా చేయవచ్చు. నృత్యంలో రాణించాలనుకున్నవారు ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి’ అని సూచించారు ప్రసిద్ధ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్. నగరానికి చెందిన ప్రసిద్ధ ఒడిస్సీ నృత్యకారిణి సోనాలి ఆచార్జీ మాదాపూర్‌లోని సోనాలి అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మోడ్రన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సరోజ్‌ఖాన్ మాట్లాడుతూ తాను ప్రాథమికంగా క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టే విభిన్న రకాల పాటలకు నృత్యాలను అందించగలిగానన్నారు. అయితే ఇప్పుడు సినిమాల్లో వచ్చే డ్యాన్స్‌లు చూస్తుంటే అవేమిటో తనకే అర్థం కావడం లేదన్నారు. కొన్ని సినిమాల్లో కొరియోగ్రాఫర్‌తో సంబంధం లేకుండానే డ్యాన్స్‌లు చేసేస్తున్నారని, ఈ మధ్య వచ్చిన ఒక సినిమాలో పాటకు హీరోనే డ్యాన్స్ డెరైక్షన్ చేసేశాడని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో, పొట్టి పొట్టి దుస్తుల హీరోయిన్లతో పనిచేయలేకే బాలీవుడ్లో కొరియోగ్రఫీ చేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో సోనాలితో కలిసి ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం సంతోషంగా ఉందంటూ ప్రతి 2 నెలలకు ఒకసారి నగరానికి వచ్చి స్టూడెంట్స్ ప్రతిభను పరిశీలిస్తానని, అలాగే రానున్న దీపావళికి 11 రోజుల పాటు ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి పెద్ద ప్రదర్శన నిర్వహిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాతపస్వి తెలుగు సినీ దర్శకులు కె.విశ్వనాథ్ మాట్లాడుతూ సంప్రదాయ నృత్యం, సంగీతం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయన్నారు. సంగీతం, పాటలు తప్ప ఏముంటాయి ఆయన సినిమాలో అంటూ కొందరు విమర్శించినా... సిరిసిరిమువ్వ దగ్గర్నుంచి తన ప్రతి సినిమాలో వాటికే పెద్ద పీట వేశానని గుర్తు చేశారు. మన సంప్రదాయ మూలాల్ని మరిచిపోతే మనకంటూ ఉన్న గుర్తింపు కోల్పోతామని పిల్లలకు ఈ విషయంలో అవగాహన పెంచాల్సిన బాధ్యత పెద్దలదేనన్నారు. ఇన్స్టిట్యూట్ నిర్వాహకురాలు సోనాలి మాట్లాడుతూ సంప్రదాయ ఒడిస్సీతో పాటు బాలీవుడ్ నృత్యాల్లో కూడా తాము శిక్షణ అందిస్తామన్నారు. -
ఆయన సినిమాలకు‘అభిమాన్’ను నేను: ‘పద్మశ్రీ’ కె. విశ్వనాథ్
హృషీకేశ్ ముఖర్జీ నాకు చాలా ఇష్టమైన దర్శకుడు. ల్యాబ్ అసిస్టెంట్‌గా మొదలై ఎడిటింగ్, స్క్రీన్‌ప్లే రచనల మీదుగా సినీ దర్శకుడు కావడం హృషీకేశ్జీకి కలిసొచ్చిన అంశం. కలకత్తాలో న్యూ థియేటర్సలో దర్శకుడు బిమల్‌రాయ్ దగ్గర నుంచి పలువురు దర్శకుల శైలినీ, వారి సామర్థ్యాన్నీ దగ్గర నుంచి గమనించే అవకాశం ఆయనకు వచ్చింది. ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుంది. వారిలోని సారాన్ని ఆయన గ్రహించారని నాకు అనిపిస్తుంటుంది. ‘ముసాఫిర్’తో మొదలుపెట్టి ‘అనుపమ’, ‘ఆనంద్’, ‘గుడ్డి’, ‘సత్యకావ్’ - ఇలా దాదాపు 50 చిత్రాలు తీసి, ప్రేక్షక హృదయాలను ఆయన గెలుచుకున్నారు. పద్మవిభూషణ్, ఫాల్కే పురస్కారాలందు కొన్నారు. హృషీకేశ్‌జీ చిత్రాలనగానే నాకు ఠక్కున గుర్తొచ్చేది ‘అభిమాన్’. నాకు ఎంతో ఇష్టమైన సినిమా అది. అందులోని సంగీతం, సున్నితమైన భావోద్వేగాలు, మనసును తాకే ఆ సన్నివేశ పరిమళాలు నా మనసులో ఇప్పటికీ అలా నిలిచిపోయాయి. ప్రతి సినిమాలో ఆయన మానవ సంబంధాలను అద్భుతంగా చూపిస్తారు. ‘అభిమాన్’లో కథానుసారం భార్యాభర్తల్లో ఒకరి ఆధిపత్య భావజాలం, వారి మధ్య నెలకొనే ఘర్షణ - చాలా సహజంగా చూపారు. ఒక సహజమైన భావోద్వేగాన్ని ఎక్కడా అతి చేయకుండా మామూలుగా చెబుతూనే, మనసుపై ముద్ర వేయడమనే హృషీకేశ్‌జీ శైలి నాకు నచ్చుతుంది. కథను తెరకెక్కించడంలో నా స్కూల్ కూడా అదే! అంతా తక్కువ మోతాదులోనే తప్ప, బీభత్సాలు, ఏడుపులు, పెడబొబ్బలు మా చిత్రాల్లో కనపడవు. అలాగే, చుట్టూ ఉన్న మనుషులు, వారి జీవితాలనే తప్ప, జీవితాన్ని మించిపోయిన అసహజమైన కథల జోలి కెళ్ళం. నిజానికి, ‘అభిమాన్’ స్ఫూర్తితో ఒక కథ నా మనసులో ఎప్పటి నుంచో తిరుగుతోంది. దానికెప్పటికైనా తెర రూపమివ్వాలని ఉంది. సినీ రంగంలోని చాలామందికి భిన్నంగా, హృషీకేశ్‌జీ ద్వారా పైకి వచ్చిన నటీనటులకు ఆయనంటే ఎంతో గౌరవం, గురుభావం. నటి జయభాదురి (బచ్చన్) ఒకసారి ‘ఫిల్మ్‌ఫేర్’ పత్రికలో ఇంటర్వ్యూ ఇస్తూ, హృషీకేశ్ పట్ల తనకున్న గౌరవాన్ని ఒక్క ముక్కలో చెప్పారు. ‘హృషీదా గనక ‘రేపటి నుంచి సినిమా ఉంది. నువ్వు నటించాలి’ అంటే చాలు... కథేమిటి, నా పాత్ర ఏమిటి లాంటివేవీ అడగనైనా అడగకుండానే, నా చేతిలో ఉన్న సినిమాలన్నీ క్యాన్సిల్ చేసుకొని మరీ ఆ సినిమాలో నటిస్తాను’ అని ఆమె బాహాటంగా చెప్పారు. ఒక దర్శకుడు తీర్చిదిద్దిన మైనంముద్దల లాంటి ఆర్టిస్టులు ఆ విషయాన్ని అంగీకరిస్తూ, అలా చెప్పడాన్ని మించిన కితాబు ఇంకేముంటుంది!హృషీకేశ్‌జీ మంచి సృజనశీలే కాక మంచి మనిషి కూడా! బొంబాయిలో నేను హిందీ చిత్రాలు తీస్తున్న సమయంలో రెండు మూడుసార్లు ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిశాను. ఇంట్లో మంచం పక్కనే కుక్కలతో ఆయన సరదాగా గడిపేవారు. అప్పటికే హిందీ చిత్రం ‘సర్గమ్’ (‘సిరిసిరిమువ్వ’కు రీమేక్)తో అక్కడివాళ్ళకు నేను తెలుసు. ‘శంకరాభరణం’ దర్శకుడిగా ఆయన నన్నెప్పుడూ గుర్తుపెట్టుకొని మాట్లాడేవారు. చలనచిత్రోత్సవాలు, జాతీయ అవార్డు కమిటీలు, సెన్సార్ బోర్డు లాంటి వాటిలో కీలక బాధ్యతలు నిర్వహించడం వల్ల దక్షిణాదిలో ఆయనకున్న పరిచయాలూ ఎక్కువే. పనుల మీద మద్రాసుకు ఆయన వచ్చినప్పుడూ కలిశాను. ఒకసారి ఆయన ప్రసిద్ధ మలయాళ నటుడు గోపికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి, కేరళ వెళ్ళి మరీ చూసిరావడం నాకిప్పటికీ గుర్తే! సందర్భమేమిటో గుర్తులేదు కానీ, దక్షిణ, ఉత్తర భారతీయ సినిమా వాళ్ళం కొందరం కలసి ఒకసారి ఏదో పర్యటనకు వెళ్ళాం. ఆ బృందంలో హృషీకేశ్ ముఖర్జీ, గుల్జార్, నేను - ఇంకొందరం ఉన్నాం. నటి జయభాదురో, షబనా ఆజ్మీయో కూడా ఉన్నారు. ‘దర్శకుడు, రచయిత, నటి - ఇలా మనందరం ఇక్కడే ఉన్నాం కదా! ఇక్కడే ఒక సినిమాకు సన్నాహాలు చేద్దామా’ అని మేమందరం సరదాగా అనుకున్నాం. అవన్నీ తీపి జ్ఞాపకాలు. ఏమైనా, భారతీయ సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన హృషీకేశ్ ముఖర్జీ, శ్యామ్‌బెనెగల్, బాసూ భట్టాచార్య, మృణాల్‌సేన్ లాంటి దర్శకులు, వారి చిత్రాలు మన జాతి సంపద. సంభాషణ: రెంటాల జయదేవ