breaking news
Kondaveeti Satyavati
-
కేసీఆర్.. ఇప్పటివరకు మాట్లాడలేదు
సాక్షి, హైదరాబాద్: మహిళలపై హింస పెరగడానికి గల కారణాలను ప్రభుత్వం వెలికితీయాలి... వాటిని అరికట్టాలే తప్ప ఎన్కౌంటర్లు చేయడం సరైందికాదని పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య అన్నారు. నేరస్తులు ఎవరైనా శిక్షించాలి. బాధితులు ఎవరైనా న్యాయం జరగాలని, అయితే చట్టాలను అతిక్రమించి నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని చెప్పారు. మంగళవారం సుందరయ్యవిజ్ఞానకేంద్రంలో మహిళా ట్రాన్స్‌జెండర్ ఐక్య కార్యాచరణ సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంధ్య మాట్లాడుతూ... గత రెండు దశాబ్దాలుగా మహిళలపై జరుగుతున్న హింసకు కారణాలను ప్రభుత్వానికి వివరిస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కేసీఆర్ సీఎం అయ్యాక ఇప్పటివరకు మహిళా సంఘాలతో మాట్లాడలేదని, మీ పాలనలో మహిళలు ఉండరా.. మీకు మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు పట్టవా అని విమర్శించారు. ఎన్‌కౌంటర్‌తో చేతులు దులుపుకుంటే సరిపోదని, 108 తరహాలో మహిళలకు హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. భూమిక డైరెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ.. నేరం చేసిన వారిని న్యాయవ్యవస్థ ద్వారా శిక్షించకుండా మధ్యలోనే చంపడం సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఎన్కౌంటర్ చేయగానే సంబరాలు చేసుకోవడం ప్రమాదకరమని, చావును సంబరాలు చేసుకోవడమేంటని ఆమె ప్రశ్నించారు. ఇది ఉన్మాదానికి దారితీస్తుందని అన్నారు. తాము రేపిస్టులను సమర్ధించడంలేదని, కానీ ఈ సంఘటన వల్ల అత్యాచారాలు ఆగుతాయా అని ప్రశ్నించారు. ప్రముఖ రచయిత విమల మాట్లాడుతూ... మహిళలపై రోజురోజుకూ లైంగిక వేధింపులు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కొండవీటి సత్యవతి, జి.ఝాన్సీ, ఉషా సీతామహాలక్ష్మి, ఖలిదా ఫర్వీన్, మీరా సంఘమిత్ర, బండారు విజయ, శాంతి ప్రబోధ, సుజాత, అనురాధ, ఉషా, తేజస్విని, సుమిత్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్నప్పుడు వెంటనే స్పందించే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తేవాలని, అత్యవసర కాల్స్‌ను పర్యవేక్షించే వారే ప్రతిస్పందన చర్యలకు బాధ్యులుగా ఉండేలా చేయాలని, అన్ని పోలీస్స్టేషన్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి, సైబర్ నేరాలను అరికట్టాలని తీర్మానించారు. -
అబ్బూరి ఛాయాదేవి వీలునామా
ఎంతకాలం బతికామన్నది కాదు. ఎలా బతికామన్నది ఒక జీవితానికి ‘విలువ’ కడుతుంది. ఎంత ఇచ్చామన్నదికాదు. వసుధైక కుటుంబానికి ఏమిచ్చామన్నది విలువ చెబుతుంది. ప్రముఖ రచయిత్రి, సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి నిన్న శుక్రవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. 2012లో ఆవిడ రాసిన విల్లునామా యథాతథంగా. ప్రియమైన కొండవీటి సత్యవతి గారికి, నమస్కారం. ఇక్కడ చేరగానే సి.ఆర్.ఫౌండేషన్ వాళ్లు ఒక ప్రింటెడ్ అప్లికేషన్ ఇచ్చారు. అందులో ఒక కాలమ్ –‘‘అత్యవసర పరిస్థితుల్లో సమాచారాన్ని అందించవలసిన వారి పేరు, చిరునామా... అని ఉంటే, మా మరిది డా.గోపాలకృష్ణ పేరు ఇచ్చాను. అతను పూర్తిగా అశక్తుడని తెలుసు. అయినా, నా బాధ్యతగా అతని పేరు ఇచ్చాను. అయితే, నా శరీరాన్ని మాత్రం ‘మోహన్ ఫౌండేషన్’ వారికి అప్పగించమని రాశాను. కానీ మళ్లీ, ఇప్పుడు ఈ సంస్థ వాళ్లు వరుసగా అందరి లిస్టూ రూమ్ నంబర్‌తో సహా తయారు చేస్తున్నారు. అందులో మళ్లీ ఒక కాలమ్ – ‘‘అత్యవసర పరిస్థితిలో సంప్రదించవలసిన వారి పేరు, చిరునామా, ఫోన్ నంబర్’’ అని ఉంది. అందులో ఈసారి మీపేరు ఇవ్వాలనుకుంటున్నాను. లోకల్‌గా ఉంటారు కాబట్టి. మా సుజాత ఎప్పుడు ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇంకెవరూ లాభం లేదు. నా దగ్గరున్న డాక్యుమెంట్స్ అన్నీ ఒక పెద్ద నల్లటి కేన్వాస్ బ్యాగ్ (అరలతో, జిప్పులతో ఉన్నది – సాహిత్య అకాడమీ వాళ్లు ఏదో సదస్సులో ఇచ్చినది)లో పెట్టాను. అది నా అలమారాలో బట్టలున్న భాగం వైపు రెండవ అరలో పెట్టాను. పైన ఒక చిన్న కర్టెన్ బట్ట ముక్క కప్పి ఉంటాను. అవసరమైనప్పుడు ఆ బ్యాగ్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌ని చూసి కావల్సిన విధంగా వాడే స్వేచ్ఛ మీకు ఉంటుంది. ముఖ్యంగా, బ్యాంక్‌లకు (ఆంధ్రాబ్యాంక్ అండ్ ఏపీ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంక్) సంబంధించినదీ, పోస్టాఫీస్‌లో ఉన్న అకౌంటుకి సంబంధించినవీ, కొంత క్యాష్తో పాటు నన్ను ఏదైనా హాస్పిటల్లో చేర్పించవలసి వస్తే వాళ్లకి కావల్సిన డబ్బు ఇవ్వడానికి వీలుగా కొన్ని చెక్కుల మీద మీ పేరు రాసి ఉంచుతాను. తక్కినవి మీరు ఫిల్అప్ చేసుకోవచ్చు. మీ మంచితనాన్నీ, స్నేహాన్నీ వాడుకోవాలనుకుంటున్నందుకు క్షమించండి. ఆధారపడేందుకు ఇంకెవరూ లేరు. చెన్నైలో ఉన్న బావగారి కొడుకులిద్దరినీ రెండు మూడు ముఖ్యమైన ఫిక్స్డ్ డిపాజిట్లకి నామినీలుగా చేశాను. పోస్టాఫీసులోని అకౌంటు (6 ఏళ్లకి వేసినది)కి మా ఆడబడుచు సుజాతను నామినీగా రాశాను. చిన్న చిన్న ఫిక్స్డ్ డిపాజిట్లని (రెండు బ్యాంకుల్లోనూ) మెచ్యూర్ అయినప్పుడల్లా కొండాపూర్‌లోని ఆంధ్రాబ్యాంకుకి మార్చి రెన్యూ చెయ్యడానికి పూనుకున్నాను. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల డాక్యుమెంట్లు అన్నీ ఒక నల్ల పర్సులోనూ, కరెంట్ అకౌంట్ల తాలూకు పాస్బుక్కులూ, చెక్కుబుక్లూ మొదలైనవీ, పోస్టాఫీసుకి చెందిన పాస్‌బుక్కులు, మెరూన్ కలర్ పర్స్‌లోనూ ఉన్నాయి. క్యాష్ లేత ఆకుపచ్చ పర్సులో ఉంటుంది. ఇవన్నీ నల్లటి పెద్ద కేన్వాస్ బ్యాగ్‌లోని ఒక పెద్ద అరలో పెట్టాను. ఇదికాక, మరో అరలో ఇల్లు అమ్మిన తాలూకు డాక్యుమెంట్స్ పెట్టాను. మరో పెద్ద అరలో, నా చదువు, ఉద్యోగం తాలూకు డాక్యుమెంట్లు, మావారి తాలూకు డాక్యుమెంట్లూ ఉన్నాయి. ఇంకొక అరలో నాకు నచ్చిన, ముఖ్యమైన విలువైన ఉత్తరాలు (కొద్దిపాటి), నా అవార్డుల తాలూకు డాక్యుమెంట్లూ రికార్డ్ కోసం దాచి ఉంచాను. వీటన్నిటి బాధ్యతా మీకు అప్పజెబుతున్నాను. నాకు లేని నా కూతురు కన్న మిన్నగా నాపై ఆపేక్ష చూపిస్తున్నందుకు మీపై ఈ బాధ్యత మోపుతున్నాను. అవసరమైనప్పుడు ముందుకొచ్చి, నా విషయమై సహాయపడాలని కోరుకుంటున్నాను. మీకేమైనా సందేహాలుంటే అడగండి. ఈసారి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వాటిని స్వయంగా చూపిస్తాను. నేను నిత్యం వాడే పెద్ద బ్యాగ్ (చాక్లెట్ కలర్‌ది)లో నిత్యం అవసరమయ్యే డబ్బూ, కాగితాలూ పెట్టుకుంటున్నాను. ఇవి నా బట్టలున్న భాగంలో రెండవ అరలో ఉన్నాయి. వాటిపై ఒక చిన్న బట్ట కప్పి ఉంచాను. ఈ ఉత్తరాన్ని డి.టి.పి. చేయించి ఉంటే బావుండేది. నేను మీకు అఫీషియల్‌గా ఇచ్చిన ఆథరైజేషన్ లెటర్‌లా ఉంటుంది. చేయించాలంటే చూడండి. నేను మళ్లీ సంతకం పెట్టి ఇస్తాను. నాకు సంబంధించిన కళాత్మక వస్తువులన్నటినీ అద్దాల అలమారాలతో పాటు ఇక్కడ ఆవరణలో ఉన్న మహిళా శిక్షణాకేంద్రానికి ఇచ్చేస్తున్నట్లూ, నా తదనంతరం అక్కడ భద్రపరచవలసిందనీ, అలాగే నా పుస్తకాలూ మొదలైన వాటిని రీసెర్చి సెంటర్లో భద్రపరచమనీ కోరుతూ ‘విల్లు’ రాసి ఈ సంస్థ అధినేతలకి అందజేశాను. మానసికంగా ‘‘ఎవర్ రెడీ’’గా, నిత్య ‘ఎవర్ గ్రీన్’’ గా ఉండాలని నా ప్రయత్నం. మీ సహకారాన్ని కోరుతూ... అబ్బూరి ఛాయాదేవి -
మగ మహారోజు!
ఏం తక్కువైంది ఈ మగమహారాజులకు?! ఏం మునిగిందని వీళ్లకో ‘ఇంటర్నేషనల్ మెన్స్‌డే’?! జెంట్స్ సీట్లో కూర్చొని, లేడీస్ ఎవరైనా లేవట్లేదా? ఆఫీస్‌లో ‘ముద్దారగా నేర్పిస్తాం’ అని చెప్పి... ఫిమేల్ స్టాఫ్ వచ్చి మీద మీద పడుతున్నారా?! క్యాబ్స్‌లో ప్రయాణిస్తున్న మగవాళ్లపై... లేట్ నైట్ అఘాయిత్యాలు జరుగుతున్నాయా?! ఆడవాళ్లకు ‘మహిళా దినోత్సవం’ ఉన్నట్లే... మగవాళ్లకు ‘మెన్స్‌డే’ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీనిపై మన స్త్రీవాదులు, మానవవాదులు ఏమంటున్నారు? ఇదే ఈవారం మన ‘ప్రజాంశం’ నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. 1999లో ట్రినిడాడ్ టొబాగో దేశంలో మొదటిసారి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అరవై దేశాల్లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా స్త్రీల హక్కుల కోసం పోరాడుతున్న కొందరు సుప్రసిద్ధ మహిళల అభిప్రాయాలివి. ఇద్దరూ అభివృద్ధి చేతి పావులే ప్రకృతిపరంగా ఆడ, మగ తేడాలేమీ ఉండవు. జీవులన్నీ ఒక్కటే. సమాజంలో మనుషులు కృత్రిమంగా సృష్టించిన అంతరాలలో కులం, వర్గం, జాతి, మతం వంటి అణచివేతల్లో జెండర్ కూడా ఒకటి. ఆడ, మగ అనే జెండర్ వ్యత్యాసం కూడా నిర్మాణాత్మకమైనదే. స్త్రీలు, బలహీన పురుషులు బలమైన పురుషాహంకార బాధితులే. ఎక్కువ క్రూరంగా ఉండమని రాజ్యాల్ని, మరింత మగవాడిగా ఉండమని పురుషుల్ని అభివృద్ధి నిర్దేశిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ప్రపంచీకరణ, కులస్వామ్యాలన్నీ పురుషస్వామ్య రక్తమాంసాలతో నిర్మిస్తున్నవే. ఈ నిర్మాణాలు స్త్రీలనే కాదు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా బలహీనులైన మగవాళ్లను కూడా నిర్ధేశిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి నుంచి రాజకీయ ఎన్జీవోల వరకూ స్త్రీల సాధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా... మహిళలు మానవహక్కులు లేకుండా విధ్వంసమవుతున్నారంటే పితృస్వామ్యంలో నిజాయితీ లేకపోవడం వల్లనే. పురుషుల్లో మార్పు రావాలి. ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకంలో మగవారి పాత్ర పెరగాలి. ఆధునిక ఉత్పాదక రంగంలో, వ్యవసాయక రంగంలో, రాజకీయాల్లో మహిళల నాయకత్వాన్ని అంగీకరించాలి. వాళ్ల ప్రాతినిధ్యాన్ని, ప్రవేశాల్ని ప్రోత్సహించాలి. మన దేశంలో 22 నిమిషాలకొక లైంగికదాడి జరుగుతోంది. ఇది మానవ నాగరికతకు సిగ్గుచేటు. కాని... ప్రతి 22 గంటలకూ కనీసం 22 రోజులకు ఒక బాలికను పాఠశాలలో చేర్పించగలిగితే, ఒక మహిళకు ఉపాధి అవకాశాన్ని అందించగలిగితే ఈ దేశంలోనే సమానత్వం సిద్ధిస్తుంది. - జూపాక సుభద్ర, రచయిత్రి రెండు దినోత్సవాలెందుకు? ‘మగవాళ్లు’ అనగానే పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్న వేమన గుర్తుకొస్తాడు నాకు. నిజంగానే పురుషులు అనేకరకాలు. నా మటుకు నాకు కొందరిని చూస్తే గౌరవం, కొందరిని తలుచుకుంటేనే అసహ్యం, కొందరిని చూస్తే జాలి, ఇంకా కొందరంటే ఇష్టం. ఏమైనా... ఈ రోజుల్లో పురుషులు కొంత అయోమయంలో ఉన్నారనిపిస్తుంది. వాళ్లకు పాత తరాలవారి కంటే తాము ఉన్నతం (వారి భాషలో ఆదర్శప్రాయం) గా ఉండాలని ఉంటుంది. కానీ తరతరాలుగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన పురుషత్వం ఆ ఉదాత్తతను నీరుగార్చేస్తుంటుంది. ఈ రెండింటి మధ్య ఇరుక్కుని నేటి పురుషులు (20 -50 మధ్య వయస్కులు) తికమకపడిపోతున్నారు. తను స్త్రీలను గౌరవంగా, తనతో సమానంగా చూస్తే గౌరవించబడతాడో లేక చులకనకు గురౌతాడో సగటు పురుషుడికి అర్థం కావడం లేదు. మొత్తానికి ఈనాటి స్త్రీలకు తమ వ్యక్తిత్వాల పట్ల, జీవనవిధానం పట్ల, పురుషులతో సంబంధాల పట్ల ఉన్నంత స్పష్టత ఇంకా ఈనాటి పురుషులకు రాలేదు. అంతేనా, పురుషులు అబలలు. (వ్యాకరణం మాట చిన్నయసూరి ఎరుగు) - ఎందుకంటే స్త్రీల కంటే ఎక్కువగా వాళ్లు సమాజానికి భయపడతారు. సంప్రదాయానికి వెరుస్తారు. స్త్రీ పురుష సంబంధాల్లో తెగింపు అన్నది ఎప్పుడైనా మనకు కనిపిస్తే అది స్త్రీ చొరవ తీసుకున్నప్పుడే, స్త్రీ సమాజాన్ని లెక్కచేయనపుడే సాధ్యం. మగవాళ్లకు సంబంధించి ప్రచారంలో ఉన్న సామెత ‘ఏడ్చే మగవాడిని నమ్మకు’ అన్నదాన్ని నేను నమ్మను. మగవాళ్లకు కూడా ఏడ్చే హక్కు ఉంది. దొంగ ఏడుపు అంటారా? అది ఆడవాళ్లు కూడా ఏడవగలరు కనక, కన్నీళ్లలోని నిజాయితీని గుర్తించాలి తప్ప, ఏడ్చింది పురుషుడా, స్త్రీనా అన్నది కాదు. పురుషుల దినోత్సవం సందర్భంగా తోటి పురుషులకు చిన్న సూచన: స్త్రీలను మీతో సరిసమానంగా చూడడం వల్ల మీ ఔన్నత్యం పెరుగుతుందే తప్ప, తరగదు. స్త్రీపురుషుల మధ్య అధికార సంబంధాల వల్ల స్త్రీలు మాత్రమే కాదు నష్టపోయేది, పురుషులు కూడ ఎంతో జీవితానందాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే అసమ సంబంధాల్లో ఇరుపక్షాలూ బాధే తప్ప ఆనందాన్ని పొందలేవు. ఆ స్పష్టత స్త్రీపురుషులిద్దరిలోనూ వస్తే, ఇక స్త్రీల దినోత్సవాలూ, పురుష దినోత్సవాలూ అని రెండూ వేర్వేరుగా జరుపుకోవలసిన అవసరం ఉండదు. - ప్రొఫెసర్ మృణాళిని, కేంద్రసాహిత్య అకాడెమీ జనరల్ కౌన్సెల్ సభ్యురాలు అర్థం చేసుకొనేలా ఎదగాలి అంతర్జాతీయ పురుష దినోత్సవం సందర్భంగా వారిలో మానవ త్వం మేలుకోవాల ని కోరుకుంటున్నా ను. మగవాళ్లకు తరతరాలుగా సమాజం ఇచ్చిన అనవసరమైన, అన్యాయమైన అహంకారాన్ని పెంచే అవకాశాలను వాళ్లు ఐచ్ఛికంగా వదులుకుని సమానత్వం వైపుగా అడుగులు వేయడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. తమలో పేరుకుపోయిన వివక్షాపూరితమై న ఆలోచనలను, హింసాత్మక ఆచరణను అమానుష వైఖరిని కడిగి వేసుకుని స్త్రీల స్వేచ్ఛా కాంక్షను అర్థం చేసుకునేలా ఎదగాలని కాంక్షిస్తున్నాను. యుద్ధాన్ని వదిలి శాంతిని, ద్వేషాన్ని వదిలి స్నేహాన్ని మనసులో నింపుకుని ప్రపంచాన్ని... శాంతి, సమానత్వం దిశగా అభివృద్ధి చేయడంలో స్త్రీలతోపాటు భాగస్వామ్యం పంచుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పటికే ఈ పనులు చేస్తున్న సంస్కారవంతులైన కొందరు పురుషులకు నా అభినందనలు. - ఓల్గా, స్త్రీవాద రచయిత్రి Olga ఆధిపత్యం అడగడం లేదు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా పురుషులకు కొన్ని విషయాలు చెప్పదలచుకున్నాను. స్త్రీపురుష వివక్ష మొదట్నించీ ఉన్నది కాదు. ఆదిమ వ్యవస్థలో ఆహారాన్ని కనిపెట్టింది స్త్రీ. కానీ సమాజం పురోగమనంలో మాతృస్వామిక వ్యవస్థ దాటి పితృస్వామిక వ్యవస్థ ఏర్పడింది. అప్పటినుంచి స్త్రీ అణచివేత ప్రారంభమైంది. తర్వాత నాగరిక సమాజంలో స్త్రీ, పురుష సమానత్వం ఒక హక్కుగా రాజ్యాంగం ఇచ్చింది. ఈనాటికీ ఆ సమానత్వాన్ని గుర్తించలేకపోవడం బాధాకరం. స్త్రీలు తమ హక్కుల గురించి మాట్లాడినప్పుడల్లా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుగా భావిస్తున్నారు. కాని స్త్రీకి కావాల్సింది పురుషులపై ఆధిపత్యం కాదు, కేవలం సమానత్వం మాత్రమే. సమాజంలో పురుషాధిపత్య భావజాలం భారంగా మారితే పురుషులు కూడా బాధితులవుతారు. చాలామంది ఒంటరిస్త్రీలు, వితంతువులు... భర్త తోడు లేకుండా కుటుంబాల్ని నెట్టుకొస్తున్నారు. ఎవరి అండా లేకుండానే పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేస్తున్నారు. పురుషులు ఆ పని చేయలేకపోతున్నారు, ఎవరో ఒకరిద్దరు తప్ప. స్త్రీ తోడు లేకుండా బతకగలిగే పురుషులెందరు? కనీసం ఈ వాస్తవాైన్నైనా ఎందుకు గుర్తించరు? సమాజంలో హింసలేని జీవితాన్ని మనుషులందరూ కోరుకుంటున్నారు. అది మానవహక్కు కూడా. కాని స్త్రీలు, పిల్లలు హింసలేని జీవితాన్ని తమ హక్కుగా గుర్తించలేకపోతున్నారు. సమాజంలో శాంతియుత కుటుంబాలు కావాలి. అది ఆధిపత్య సంబంధాలు రద్దయినపుడే సాధ్యమవుతాయి. ఆడవాళ్లయినా, మగవాళ్లయినా ఆధిపత్యం కోరుకోకూడదు. బాధ్యతాయుతమైన మానవ సంబంధాలు మాత్రమే ఉండాలి. మానవజాతి మనుగడ కోసం త్యాగాలు చేసిన పురుషులు, స్త్రీలు ఉన్నారు. పురుష వ్యతిరేకత కాకుండా పురుషాధిపత్య భావజాలాన్ని తొలగించినపుడు మిగిలేది స్త్రీ, పురుషులు. ఎక్కువ తక్కువలు కాదు. - సంధ్య, ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు Sandhya రెండుముఖాలు వద్దు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా మనదేశంలోని పురుషులందరికీ నా అభినందనలు. ఈరోజైనా పురుషులందరూ ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. ‘మీరూ మేము సగం సగం... మీరూ మేము సమం సమం’ అనే మహిళల మాటతో పురుషులందరూ గొంతు కలపాలని ఊరుకుంటే సరిపోదు, ఆచరించాలి. మన సమాజంలో రెండుముఖాలున్న మగవారి సంఖ్య బాగా ఎక్కువ. కొందరు మగవాళ్లు బయటికి స్త్రీవాద కబుర్లు చెప్పి ఇంటికెళ్లి భార్యల్ని హింసిస్తారు. మనసా వాచా మహిళల్ని గౌరవించే మగవారి సంఖ్య చాలా తక్కువ. దీనికి అనాదిగా వస్తున్న పురుష ప్రాధాన్య కట్టుబాట్లే కారణం కాదు, మహిళ తమని మించిపోతోందన్న అభద్రతా భావం కూడా. చదువుల్లో, ఉద్యోగాల్లో, తెలివితేటల్లో మహిళలు రోజురోజుకీ మెరుగవుతున్నారు. కాని మగవారి ఆలోచనలు మాత్రం ఏ కాలంలోనో ఆగిపోయాయి. మహిళల్లో వస్తున్న మార్పుకు తగ్గట్టు మగవారి ఆలోచనతీరు మెరుగవడం లేదు. కొందరిలో మైండ్‌సెట్ మారుతోంది కాని మనసు మారడం లేదు. బిడ్డగా స్త్రీ ఎదుగుదలను కోరుకుంటున్న మగవాళ్లే, భార్యగా ఎదిగితే మాత్రం అడ్డుపడుతున్నారు. మగవారి హృదయం మారడం లేదనడానికి ఇలాంటి ధోరణులే ఉదాహరణలు. వారి అభద్రతాభావం ఏస్థాయికి చేరిందంటే.. స్త్రీల కోసం కొత్త చట్టాలు వచ్చినప్పుడల్లా వాటిని పురుష వ్యతిరేక చట్టంగా భావిస్తున్నారు. అవి కేవలం స్త్రీలను రక్షించడానికి వచ్చిన చట్టాలు కాని పురుషుల్ని వ్యతిరేకించేవి కావు. ఆ మధ్య ఢిల్లీలో నిర్భయ ఘటన సందర్భంగా చాలామంది మగవాళ్లు ‘తాము మగవాళ్లుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం’ అంటూ తమ సానుభూతిని వ్యక్తం చేశారు. అలాంటి సందర్భాల్లో పురుషుల నుంచి స్త్రీలు ఆశించేది సానుభూతి కాదు, తిరుగుబాటు. పురుషుడిగా తోటి పురుషులలో మార్పు తేవాలి. దాని కోసం ఎంతటి పోరాటాలైనా చేయాలి. లేదంటే స్త్రీల రక్షణకోసం పోరాడుతున్నవారికి సాయంగానైనా ఉండాలి. దాన్నే సమానత్వం అంటారు. స్త్రీలకు అన్యాయం జరిగితే తోటి స్త్రీలు స్పందించడం, పురుషులకు అన్యాయం జరిగితే పురుషులు స్పందించడం సమానత్వంలోకి రాదు. దేశంలో ఎవరికి అన్యాయం జరిగినా లింగభేదం లేకుండా అంతా అండగా నిలబడాలి. అప్పుడే ఆడ, మగ అనే భేదం పోయి అందరం ఒక్కటేనన్న భావం వస్తుంది. - కొండవీటి సత్యవతి, కోఆర్డినేటర్ ‘భూమిక’ హెల్ప్‌లైన్ Kondaveeti Satyavati