breaking news
interest costs
-
ఈవీలపై పెరుగుతున్న ఆసక్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వంటి కొత్త ఇంధన వాహనాలపై (ఎన్ఈవీ) క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. 2030 నాటికి వాటికి గణనీయంగా ఆమోదయోగ్యత పెరగనుందని ఒక సర్వే నివేదికలో వెల్లడైంది. అర్బన్ సైన్స్ సంస్థ తరఫున ది హ్యారిస్ పోల్ నిర్వహించిన ఈ సర్వే ప్రకారం అప్పటికి, పెట్రోల్/డీజిల్ వాహనాల ధరతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలపై 49 శాతం వరకు అధికంగా చెల్లించేందుకు కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటారని తేలింది. సర్వేలో పాల్గొన్న 1,000 మందిలో 83 శాతం మంది ఈ దశాబ్దం ఆఖరునాటికి ఎన్ఈవీని కొనుగోలు చేసే అంశం పరిశీలిస్తామని తెలిపారు. భారత్ సహా అమెరికా, ఆ్రస్టేలియా, చైనా, జర్మనీవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో భారత్‌కి సంబంధించిన విశేషాలు చూస్తే.. → ప్రధాన నగరాలు, వర్ధమాన ద్వితీయ శ్రేణి పట్టణాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పబ్లిక్ ఈవీ చార్జింగ్ నెట్వర్క్ వేగవంతంగా విస్తరిస్తుండటంతో ఎన్ఈవీలపై భారత్‌లో సానుకూల అభిప్రాయం నెలకొంది. ప్రస్తుతం ప్రధాన నగరాలు, హైవేల వెంబడి 6,000 పైచిలుకు చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. 2027 నాటికి ఈ సంఖ్య ఒక లక్షకు పైగా పెరగనుంది. → ఈవీ సెగ్మెంట్‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రియాశీలక విధానాలు అమలు చేస్తుండటం కూడా ఎలక్ట్రిక్ వాహనాలపై సానుకూలతకు దోహదపడుతోంది. → ఈ విభాగంలో చైనా స్థాయిలో భారత్ కూడా అధునాతన టెక్నాలజీ, ఉత్పత్తి సామర్థ్యాలను సాధించాలి. అవకాశాలు భారీగా ఉన్నప్పటికీ, చైనా ఆధిపత్యం కారణంగా భారత్‌లో ఈవీల తయారీకి సవాళ్లు ఉంటున్నాయి. ఈవీలకు కీలకమైన లిథియం అయాన్ బ్యాటరీలు .. ఎలక్ట్రిక్ మోటర్లను ఉత్పత్తి చేయడంలోనూ, చార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటు విషయంలోనూ చైనా అధిపత్యం కనిపిస్తోంది. ఈ విభాగాల్లో నైపుణ్యాలు సాధించకుండా ముందుకెళ్లడంలో భారత్ కష్టపడాల్సి రావచ్చు. → భారత్‌లో ఈవీ మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడంలో, ఎలక్ట్రిక్ కార్లను మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తేవడంలో చైనా కంపెనీలతో కలిసి పనిచేయడం కీలకంగా ఉండవచ్చు. చైనా అనుభవాల నుంచి నేర్చుకుని, భారత్ మరింత వేగంగా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మళ్లవచ్చు. -
అంతర్జాతీయ పరిణామాలు కీలకం!
న్యూఢిల్లీ: అమెరికా–చైనా వాణిజ్య సంబంధాలు, ఫెడ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు, ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు వంటి పలు కీలక అంతర్జాతీయ అంశాలకు తోడు డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు చెబుతున్నాయి. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్కెట్ ముందుగానే డిస్కౌంట్ చేసింది. నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. 2.33 శాతంగా నమోదైంది. మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్‌లో 8.1 శాతం పెరిగి ఏడాది గరిష్టస్థాయికి చేరుకుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్బీఐ వైఖరి మారడం అనేది మార్కెట్ వర్గాల్లో ఆశావాదాన్ని నింపింది.’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ అన్నారు. దేశీ అంశాలు పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ అంశాలు ఏమేరకు ప్రభావం చూపుతాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కదలికలు ఉండనున్నాయని పలువురు మార్కెట్ పండితులు విశ్లేషించారు. ఫెడ్ రేట్లు 25 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం.. ఈవారం మంగళ, బుధవారాల్లో (18–19) అమెరికన్ ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం జరగనుండగా.. ఫెడ్ ప్రామాణిక వడ్డీ రేట్లు 25 శాతం పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఫెడ్ వైఖరి ఎలా ఉండనుందనే అంశం కూడా ఇదే సమావేశం ద్వారా వెల్లడయ్యే సూచనలు ఉండడంతో దలాల్ స్ట్రీట్ వర్గాలు ప్రధానంగా దృష్టిసారించాయి. మంగళవారం యూఎస్ వాణిజ్య విభాగం భవన అనుమతులు, నవంబర్ గృహ నిర్మాణాలకు సంబంధించి నివేదికను ఇవ్వనుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పాలసీ ప్రకటన, బ్యాంక్ ఆఫ్ జపాన్ పాలసీ సమావేశం కూడా ఇదే వారంలో ఉన్నాయి. క్రూడ్ ధరల ప్రభావం.. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించిన నేపథ్యంలో ఆ దేశం నుంచి డిమాండ్ తగ్గుతుందనే అంచనాల కారణంగా గతవారంలో ముడిచమురు ధరలు దిద్దుబాటుకు గురైయ్యాయి. ఇదే సమయంలో ఒపెక్ ఉత్పత్తిపై నెలకొన్న పలు అనుమానాలతో గతవారం బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 2.25 శాతం తగ్గి 60.28 డాలర్లకు చేరుకుంది. ‘రష్యా ఉత్పత్తిని తగ్గించనుందనే ప్రకటన, అమెరికా ఎగుమతుల్లో సౌదీ అరేబియా కోత వంటి అంశాల ఆధారంగా చమురు ధరలు రేంజ్ బౌండ్లోనే ఉండేందుకు అవకాశం ఉంది.’ అని ఆనంద్ రాఠీ కమోడిటీస్ విభాగం రీసెర్చ్ హెడ్ రవీంద్ర వీ రావ్ విశ్లేషించారు. ధరలు ఏమాత్రం పడిపోయినా దేశీ మార్కెట్లకు సానుకూలంగా మారునుందన్నారు. 71.30–72.50 శ్రేణిలో రూపాయి.. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేయడం, ఎన్నికల ఫలితాలు, డాలర్ బలపడడం వంటి కారణాలతో గతవారం డాలరుతో రూపాయి మారకం విలువ 109 పైసలు (1.54 శాతం) క్షీణించి 71.89 వద్దకు పడిపోయింది. ఫెడ్ సమావేశాన్ని పరిగణలోనికి తీసుకుని రూపాయి కదలికల శ్రేణి 71.30–72.50 మధ్య ఉండవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ డెరివేటివ్స్ హెడ్ అమిత్ గుప్తా అంచనావేశారు. 10,880–10,929 వద్ద నిరోధం.. నిఫ్టీ 10,700 స్థాయి వద్ద నిలవ గలిగితే అక్కడ నుంచి 10,880–10,929 స్థాయి వరకు వెళ్లేందుకు అవకాశం ఉందని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ చందన్ తపరియా విశ్లేషించారు. ఈ సూచీ కీలక మద్దతు స్థాయి 10,650 వద్ద ఉండగా.. ఈస్థాయిని కోల్పోతే 10,600 తరువాత మద్దతుగా ఉంటుందన్నారు. అమెరికా–చైనా మధ్య సంధిపై ఆశావహంగా ఇన్వెస్టర్లు వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా–చైనాల మధ్య చర్చలు ఫలించవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనా ల్డ్ ట్రంప్, చైనా ప్రభుత్వం.. ఈ రెండు అంశా లను (టారిఫ్‌లు, మింగ్ అరెస్టు) వేర్వేరుగానే చూస్తున్నట్లుగా స్పష్టమవుతోందని వాణిజ్యవేత్త ఎడ్వర్డ్ అల్డెన్ తెలిపారు. చైనా ఉత్పత్తులపై సుంకాలు రెట్టింపు చేసే ప్రతిపాదనలను ట్రంప్ మార్చి 1 దాకా వాయిదా వేయడం, ప్రతిగా అమెరికాతో వాణిజ్య లోటును భర్తీ చేసుకునేలా చైనా మరిన్ని అమెరికన్ ఉత్పత్తులు దిగుమతి చేసుకునేందుకు అంగీకరించడం తెలిసిందే. -
ఐడియాకు వడ్డీ వ్యయాల భారం
♦ రెండు రెట్లకు పైగా పెరిగిన వడ్డీవ్యయాలు ♦ 39 శాతం తగ్గిన నికర లాభం న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం ఐడియా సెల్యులర్ నికర లాభంపై వడ్డీ వ్యయాలు ప్రభావం చూపాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి ఈ కంపెనీ నికర లాభం 39 శాతం తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.942 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.576 కోట్లకు పడిపోయిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. అయితే కంపెనీ ఆదాయం రూ.8,423 కోట్ల నుంచి 13 శాతం పెరిగి రూ.9,484 కోట్లకు పెరిగిందని వివరించింది. వడ్డీ వ్యయాలు రూ.292 కోట్ల నుంచి రెండు రెట్లకు పైగా పెరిగి రూ. 808 కోట్లకు చేరాయని పేర్కొంది. డేటా సర్వీస్ ఆదాయం ఒక్కో మెగాబైట్‌కు 44.8 పైసల నుంచి 22.9 పైసలకు, అలాగే వాయిస్ కాల్స్ ఆదాయం 33.9 పైసల నుంచి 33.3 పైసలకు తగ్గాయని తెలిపింది,. ప్రభుత్వానికి చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలతో సహా తమ నికర రుణ భారం ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ.38,750 కోట్లుగా ఉందని పేర్కొంది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే, 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.3,193 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) 4 శాతం క్షీణించి రూ.3,080 కోట్లకు తగ్గిందని ఐడియా సెల్యులర్ తెలిపింది. ఆదాయం రూ.31,571 కోట్ల నుంచి 14 శాతం వృద్ధి చెంది రూ.35,981 కోట్లకు పెరిగిందని వివరించింది.